ఈ నిబంధనలు మహా విచిత్రం గురూ!

మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ‘మీ టూ’ఉద్యమం వచ్చిన తర్వాత ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్‌ నెట్‌ఫ్లిక్స్‌.. తమ సంస్థలో కొత్త పాలసీలు చేర్చింది. కంపెనీలో ఉద్యోగులు మహిళా ఉద్యోగులవైపు ఐదు సెకండ్లకు మించి చూశారంటే వారు లైంగిక

Published : 07 Mar 2021 16:27 IST

అక్కడ రాజకీయాలపై చర్చించకూడదు.. 

ఆ కస్టమర్ల వద్ద కొన్ని పదాల వాడకం నిషేధం..

ఆయన దగ్గరకు సెంట్‌ కొట్టుకోని వెళ్లొద్దు..

వారిని ఐదు సెకన్లకు మించి చూస్తే నేరమే..

ఆ స్టోర్‌లో షర్ట్‌ తీసేసి అమ్మకాలు జరపాలి

ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? కొన్ని కంపెనీల నిబంధనలు. సాధారణంగా ఏ కంపెనీలైనా తమకంటూ కొన్ని పాలసీలు, నిబంధనలను రూపొందిస్తాయి. వాటికి అనుగుణంగానే ఉద్యోగులు వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనలు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా గానీ.. వ్యక్తిగత అంశాలకు భంగం కలిగించేలా కానీ ఉండవు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం చిత్రవిచిత్రమైన నిబంధలను అమలు పరుస్తున్నాయి. కాలక్రమంలో మార్పులూ చేస్తున్నాయి.. మరి ఆ నిబంధనలేవో చూద్దామా..! 

ఐదు సెకన్లకు మించి చూశారో..

మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ‘మీ టూ’ఉద్యమం వచ్చిన తర్వాత ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్‌ నెట్‌ఫ్లిక్స్‌.. తమ సంస్థలో కొత్త పాలసీలు చేర్చింది. కంపెనీలో ఉద్యోగులు మహిళా ఉద్యోగులవైపు ఐదు సెకన్లకు మించి చూశారంటే వారు లైంగిక వేధింపులకు పాల్పడినట్లేనట. ఎవరైనా అలా చూస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సంస్థ చెబుతోంది. సంస్థలోని ఉద్యోగులే కాదు.. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించే షోల్లో నటించే నటీనటులకూ ఈ నిబంధన వర్తింస్తుందట.


రాజకీయాలపై గూగుల్‌లో వెతకొచ్చు.. సంస్థలో మాట్లాడొద్దు

మనకు ఏ అంశంపై అనుమానం వచ్చినా గూగుల్‌లో వెతుకుతాం. ఎన్నికల సమయంలో అయితే గూగుల్‌లో హాట్‌ టాపిక్‌ రాజకీయాలే. అలాంటిది గూగుల్‌ సంస్థలో ఉద్యోగులు రాజకీయాలపై చర్చించకూడదట. విధుల్లో ఉన్నప్పుడు కంపెనీ గురించి చెడుగా మాట్లాడటం, రాజకీయాలపై చర్చించడం, అనవసర ముచ్చట్లు పెట్టకూడదని నిబంధనలు తీసుకొచ్చారు. ఈ మేరకు 2019 ఆగస్టులో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సంస్థలోని ఉద్యోగులందరికి మెయిల్‌ పంపారట. రాజకీయాలపై మాటలు మొదలైతే.. అవి చర్చల వరకు వెళ్తాయని.. దీంతో ఉద్యోగుల మధ్య స్నేహపూర్వకభావం పోతుందనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టినట్లు పేర్కొన్నారు.


చూపించాలంటే చూపుడు వేలు ఒక్కటే చాలదు

సాధారణంగా దేన్నైనా చూపించాలంటే చూపుడు వేలుతో చూపిస్తాం. కానీ డిస్నీపార్కుల్లో అలా చూపుడు వేలుతో చూపించడం నిషేధం. డిస్నీపార్క్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల్లో ఉన్నాయి. అయితే ఆయా పార్కుల్లో ఉద్యోగులు పర్యాటకులకు ఏదైనా చూపించాలంటే రెండు వేళ్లను ఉపయోగించాలి. ఎందుకంటే చైనా, జపాన్‌ వంటి పలు దేశాల్లో ఒక్క చూపుడువేలును మాత్రమే ఎత్తి చూపడం నేరంగా భావిస్తారు. అందుకే ఈ నిబంధన పెట్టినట్లు సంస్థ చెబుతోంది.

రెండు వేళ్లను ఉపయోగించడంపై మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. డిస్నీ వరల్డ్‌ అధినేత వాల్ట్‌ డిస్నీకి దేన్నైనా రెండు వేళ్లను ఉపయోగించి చూపించడం అలవాటని చెబుతుంటారు. అందుకు కొన్ని ఫొటోలు ఆధారంగా చూపిస్తుంటారు. అయితే ఆ ఫొటోలో వాల్ట్‌ డిస్నీ వేళ్లను ఫొటోషాప్‌ చేశారని, ఆయన వేళ్ల మధ్య ఉండే సిగరెట్‌ కనిపించకుండా చేసే యత్నంలో అలా రెండు వేళ్లు కనిపిస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు.


అమెజాన్‌లో రెండు పిజ్జాల మీటింగ్‌ నిబంధన 

అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కంపెనీ ప్రారంభించిన కొత్తలో రెండు పిజ్జాల మీటింగ్‌ పాలసీని ప్రవేశపెట్టారు. మీటింగ్స్‌ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనడం.. వారికి అల్పాహారం తదితర వసతి కల్పించడంతో ఖర్చు అధికమవుతోంది. దీనికి పరిష్కారంగా చిన్న బృందాలుగా సభ్యులు మీటింగ్‌ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని జెఫ్‌ భావించారట. అందుకే రెండు పిజ్జాలు పంచుకొని తినేంత మంది మాత్రమే బృందాలుగా మారి మీటింగ్స్‌ నిర్వహించాలని ఆదేశించారట.


ఆర్భాటం ఉండకూడదు

మార్థ స్టీవర్ట్‌.. ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె స్థాపించిన కంపెనీల్లో మార్థ స్టీవర్ట్స్‌ లివింగ్‌ ఓమ్ని మీడియా ఒకటి. ఈ మీడియా కంపెనీ ఆఫీస్‌లో ఉద్యోగుల క్యాబిన్లు.. డెస్క్‌లు చాలా సాదాసీదాగా ఉంటాయి. ఆఫీస్‌లో హంగులు ఆర్భాటాలు ఉండకూడదని స్టీవర్ట్‌ ఆదేశించారట. అందుకే డెస్క్‌ టేబుల్‌పై ఉద్యోగులు తమ వ్యక్తిగత వస్తువులు, ఫొటోలు, టీ మగ్గులు వంటివి పెట్టకూడదని నిబంధనలు తీసుకొచ్చారు. ఆఫీస్‌లో ఫర్నీచర్‌ కూడా భారీ డిజైన్‌తో కాకుండా మామూలుగా ఉంటుంది.


సెంట్‌ కొట్టావా? ఇంక అంతే..

టెస్లా కంపెనీ అధినేత ఎలెన్‌ మస్క్‌కి విచిత్ర జబ్బు ఉంది. ఆయనది చాలా సున్నితమైన ముక్కు. ఘాటుగా ఉండే కొన్ని రకాల వాసనలు ఎలెన్‌కు పడవు. అలాంటి వాసనలు వచ్చినప్పుడు ఆయన అనారోగ్యానికి గురవుతారట. అందుకే ఉద్యోగులు, ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులు అలాంటి వాసనలు ఉండే సెంట్‌ కొట్టుకొని ఆయన వద్దకు వెళ్లవద్దని సంస్థ సూచిస్తుంటుంది.


యాపిల్‌లో ఆ పదాలు నిషేధం

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల సంస్థ ‘యాపిల్‌’ తమ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సమయంలోనే ఓ నిబంధనను కచ్చితంగా పాటించాలని చెబుతుందట. ఐఫోన్‌లో సాంకేతిక సమస్య వచ్చి వినియోగదారులు తమ వద్దకు వస్తే.. క్రష్‌, ప్రాబ్లమ్‌, బగ్‌ వంటి పదాలు వాడకూడదట. అలాంటి పదాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని అలాంటి పదాలకు బదులు ప్రత్యమ్నాయ పదాలు ఉపయోగించాలని సూచించింది. కొన్నేళ్ల క్రితం సంస్థ అంతర్గత శిక్షణ నిబంధనల పట్టిక లీక్‌ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


షర్ట్‌లెస్‌ సేల్స్‌మెన్‌

ప్రముఖ క్లాత్‌ స్టోర్‌ అబెర్‌క్రోంబీ అండ్‌ ఫిచ్‌లో వినూత్న పాలసీ ఉంది. ఆ స్టోర్‌లో పనిచేసే సేల్స్‌మెన్స్‌ అంతా షర్ట్‌ లేకుండా కస్టమర్లకు వస్త్రాలు అమ్మాలి. మొదట్లో కేవలం అందంగా ఉండే అబ్బాయిలకు మాత్రమే ఉద్యోగాలు అనే నిబంధన పెట్టుకున్న సంస్థ.. 2015 తర్వాత వారిని షర్ట్‌ తీసేసి అమ్మకాలు జరపాలని ఆదేశించింది. 


ఎయిర్‌ హోస్టెస్‌ ఏం సౌందర్య సాధనం వాడిందో..

ఎమిరేట్స్‌ విమానాల్లో ఉండే మహిళా ఎయిర్‌ హోస్టెస్‌ ఎప్పుడూ ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో కనిపిస్తుంటారు. అది ఆ సంస్థ నిబంధన. కానీ మనకు తెలియని నిబంధనలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మహిళా ఎయిర్‌ హోస్టెస్‌ జుట్టుకు కృత్రిమ రంగులు వేయకూడదు. చేతి గోళ్లకు వారి లిప్‌స్టిక్‌, లేదా తలపాగాకు మ్యాచ్‌ అయ్యే రంగులనే వేసుకోవాలి. అవి కూడా సంస్థ అనుమతిచ్చే రంగులనే వాడాలి. అంతేకాదు.. వారు ఇంటి వద్ద ఏలాంటి సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నారో సంస్థకు తెలియజేయాలి. విధుల్లో లేని సమయంలో విటమిన్‌ సీతో కూడిన మాస్కులను ధరించాలి.


23 ఏళ్లలోపు వారితో డేటింగ్‌కు నో

జపాన్‌లోని ఓ కంపెనీలో షాకింగ్‌ నిబంధనలు ఉన్నాయట. అక్కడి ఉద్యోగులు మేకప్‌ వేసుకోకూడదట. మహిళా ఉద్యోగులు ఆఫీస్‌లోని 23 ఏళ్లలోపు సహోద్యోగులతో డేటింగ్‌ చేయడాన్ని సంస్థ నిషేధించింది. ఒకవేళ నిబంధనను ఉల్లంఘిస్తే.. జీతంలో కోత విధిస్తారట. అంతేకాదు.. ఉద్యోగులందరూ కేవలం తెలుపు, గోధుమ రంగు లోదుస్తులను వేసుకోవాలని నిబంధన పెట్టిందట. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని