Vande Bharat Express: వందే భారత్‌.. అలా మొదలైంది!

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) ఈ నెల 19న హైదరాబాద్‌ నుంచి విశాఖకు పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్న ఈ రైలును ఎలా తీర్చిదిద్దారు.. దాని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.

Updated : 10 Jan 2023 10:07 IST

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande bharat express) ఈ నెల 19న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి విశాఖ (Vizag)కు పరుగులు పెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించనున్నారు. అసలు ఈ వందే భారత్‌ రైలును ఎలా తీర్చిదిద్దారు.. దాని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.

ఇలా రూపకల్పన..

వేగవంతమైన రైళ్లు నడపాలనేది ఎప్పటి నుంచో భారతీయ రైల్వే(indian railways) ఆలోచన. అలా 2015లో మోడ్రన్‌ హై స్పీడ్‌ రైలుకు రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దానికి స్పందన రాకపోవడంతో 2017లో దేశీయంగానే సెమీ హైస్పీడ్‌ రైళ్లు(semi high speed train) తయారీ చేయాలని ప్రభుత్వం దృఢంగా నిశ్చయించుకొంది. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్‌లో ‘ట్రైన్‌-18’ (train 18)ప్రాజెక్టు పట్టాలెక్కింది. తొలి టెస్ట్‌ రన్‌ నిర్వహించగా 180 కి.మీ వేగంతో ఈ రైలు ప్రయాణించింది. అయితే దేశంలోని ఏ ట్రాక్‌లూ ఆ వేగాన్ని తట్టుకునే స్థాయిలో లేకపోవడంతో ఈ రైళ్ల వేగాన్ని 130 కి.మీకు పరిమితం చేశారు.

తొలి కూత అక్కడే

‘ట్రైన్‌-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ - వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 762 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ ఛైర్‌కార్ సీసీ క్లాస్‌ ధరను రూ.1,440గా నిర్దేశించారు. 2022 సెప్టెంబర్‌ 30న గాంధీనగర్‌ - ముంబయి వందేభారత్‌ 2.0 ట్రైన్‌ను ప్రారంభించారు.

తయారీ వేగానికి బ్రేకులు 

2022 నాటికే 45 రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ కొవిడ్‌ కారణంగా అది నెరవేరలేదు. 2022 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ త్వరలో 400 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తయారు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(nirmala sitharaman) ప్రకటించారు. ఈ రైళ్ల కోసం కావాల్సిన 36 వేల చక్రాలను తయారు చేసేందుకు భారత్‌.. ఉక్రెయిన్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యమైంది.

దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన భారత్ చెక్‌ రిపబ్లిక్‌, పోలండ్‌, మలేసియా, చైనా, అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలోని స్టీల్‌ అథారిటీతో 1లక్ష చక్రాలు తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది. దుర్గాపూర్‌ స్టీల్‌ప్లాంట్ యూనిట్‌లో వాటి ఉత్పత్తి జరుగుతోంది.

చిన్న చిన్న ప్రమాదాలు

2019 ఫిబ్రవరిలో ఈ తొలి రైలు ప్రారంభమైన రెండో రోజే ఉత్తరప్రదేశ్‌లోని ఈఠవా వద్ద ఒక ఎద్దును ఢీకొంది. ఆ ప్రమాదం(accident)లో ఫైబర్‌, స్టీల్‌ కలగలిసి తయారైన రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అదే సంవత్సరం ఆగస్టు 17న మరోసారి పశువులు ఈ రైలును ఢీకొన్నాయి. 2022 అక్టోబర్‌ 6న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలో ఓ పశువుల మందను ఢీకొంది. ఇటీవల బిహార్‌(bihar)లో ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. 

ఇక వందే భారత్ 2.0 విషయానికి వస్తే..

  • వందేభారత్‌ రైలు బరువు 392 టన్నులు. తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతోంది.
  • ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. 
  • జీపీఐఎస్‌ బేస్డ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఉంది.
  • ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు
  • వైఫై సదుపాయం
  • కవచ్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్ సిస్టమ్‌.
  • బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌.
  • అన్ని కోచ్‌లలో రిక్లైనబుల్‌ సీట్లు.
  • వీటిలో 32 ఇంచుల టెలివిజన్‌ సదుపాయం. 
  • ఆటోమాటిక్‌ ప్లగ్ డోర్స్‌, టచ్‌ ఫ్రీ స్లయిడింగ్‌ డోర్స్‌.
  • ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌ యూనిట్.
  • విశాలమైన డ్రైవర్‌ క్యాబిన్‌.
  • హయ్యర్‌ ఫ్లడ్ ప్రొటెక్షన్‌

నిత్య నూతనం.. అధునాతనం.. 

త్వరలో ‘ట్రైన్‌ 20’ పేరుతో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మలుపుల వద్ద రైలు ఎంత వేగంగా వెళ్లినా ప్రమాదాలు జరగకుండా టిల్టింగ్‌ టెక్నాలజీ(tilting technology)ని జోడించనున్నారు. 1.0 వెర్షన్‌ ఫీచర్లతో తయారైన ఈ రైలులో సకల సదుపాయాలను, భద్రతా సౌకర్యాలను విస్తరిస్తూ 4.0 వెర్షన్‌కు చేర్చనున్నారు. వందేభారత్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా విదేశాలు ఈ రైళ్లను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులు చేస్తామని రైల్వే ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఈ రైళ్లను పరీక్షించడానికి జోధ్‌పూర్‌ డివిజన్‌లో 59 కిలోమీటర్ల ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని