Published : 03 Dec 2020 20:21 IST

రాజ్యం పోయినా ఊరుకున్నారు.. పీట కోసం పోరాడారు


(Photo: ASANTEMAN ASSOCIATION OF MINNESOTA)

స్వతంత్ర రాజ్యంగా ఉండాలని బ్రిటన్‌తో ఎంతో పోరాడారు. పలుమార్లు యుద్ధాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో ఏం చేయలేక, మళ్లీ పోరాడలేక బ్రిటన్‌ పాలనలో బానిసలుగా బతికేయాల్సిందేనని అనుకున్నారు. అయితే ఓ బ్రిటీష్‌ అధికారి కోరిక ఆ రాజ్యంలో ప్రజలకు ఆగ్రహావేశాలు తెప్పించింది. మళ్లీ యుద్ధానికి ఉసిగొల్పింది. కొన్ని నెలలపాటు సాగిన ఈ యుద్ధంలో అక్కడి ప్రజలు ఓడినా.. ఆ అధికారి కోరిక తీరకుండా చేశారు. ఇంతకీ ఏంటా కోరిక? ఎవరిది ఆ రాజ్యం?

గతంలో బ్రిటన్‌ అనేక రాజ్యాలపై దాడి చేసి తమ అధీనంలోకి తెచ్చుకుంది. అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను ఎన్నో శతాబ్దాలు పాలించింది. ఈ క్రమంలోనే ఆఫ్రికా ఖండంలోని అశాంతి రాజ్యాన్ని (ప్రస్తుత ఘనా దేశం) తమ పరిపాలనలోకి తెచ్చుకోవాలని 1824 నుంచి 1900 మధ్య నాలుగుసార్లు బ్రిటన్‌ యుద్ధం చేసింది. అయితే మూడుసార్లు విఫలమైన ఆంగ్లేయులు నాలుగోసారి విజయం సాధించారు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని అప్పటి చక్రవర్తి ప్రెంపెపై రాజ్య బహిష్కరణ విధించారు. ఇకపై రాజ్యాన్ని బ్రిటన్‌ ప్రభుత్వమే పాలిస్తుందని ప్రకటించారు. అయితే గోల్డ్‌కోస్ట్‌ గవర్నర్‌ అయినా ఫ్రెడెరిక్‌ మిచెల్‌ హడ్సన్‌ కన్ను... అశాంతి రాజ్య చక్రవర్తులు కూర్చునే బంగారు పీటపై పడింది. ఆ బంగారు పీటను ఆ రాజ్య ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ పీటపై కేవలం అశాంతి రాజ్య పాలకులకు మాత్రమే కూర్చునే అర్హత ఉంటుందని నమ్ముతారు. అలాంటి పీటపై తాను కూర్చొని పాలన చేయాలని అతడికి కోరిక పుట్టింది. వెంటనే ఆ బంగారు పీటను తనకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశాడు. 

ఇక అంతే.. రాజ్యం పోయినా మిన్నకుండిపోయిన ప్రజలు.. బంగారు పీటను బ్రిటీష్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించగానే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అశాంతి రాజ్య రాజమాత యా అసంతేవా, బంగారు పీట కాపలాదారు, మరికొందరు ప్రజలే సైన్యంగా మారి బ్రిటన్‌ ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు. 1900 మార్చి 28న మొదలైన ఈ యుద్ధం ఆరు నెలలపాటు కొనసాగింది. ఈ క్రమంలో 2వేలకు పైగా అశాంతి రాజ్య సైనికులు, వెయ్యి మంది బ్రిటన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలోనూ బ్రిటీష్‌వారే గెలుపొందారు. అయితే ఆ బంగారు పీట మాత్రం వారికి లభించలేదు. దానిని అశాంతి రాజ్య సైనికులు ఎవరికీ దొరకుండా భద్రపర్చారు.

అయితే 1920లో రైలురోడ్‌ నిర్మిస్తున్నప్పుడు కొందరు కార్మికులకు ఈ బంగారు పీట లభించింది. దానికున్న ఆభరణాలను తొలగించేందుకు ప్రయత్నించగా.. వారిని అశాంతి ప్రజలు పట్టుకొని ఉరితీయబోయారు. అప్పుడు బ్రిటన్‌ అధికారులు జోక్యం చేసుకొని వారిని మరో చోటుకు పంపించారు. బంగారు పీటకు ఉన్న విలువ, పవిత్రత తెలుసుకున్న అధికారులు ఇకపై దాని జోలికి వెళ్లబోమని హామీ ఇచ్చారు. అలా అక్కడి ప్రజలు ఆ బంగారు పీటను కాపాడుకోవడమే కాదు.. ఇప్పటికీ దానిని ఓ పవిత్రమైన వస్తువుగా పూజిస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని