Bitcoin: పాస్‌వర్డ్‌ చెప్పకుండా చనిపోతే..?

బిట్‌కాయిన్‌..పరిచయం అక్కర్లేని పదం.  ఇది ఏదేశానికీ చెందిన కరెన్సీకాదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. ఇది అచ్చమైన అంతర్జాతీయ వర్చువల్‌ కరెన్సీ. డిజిటల్‌ రూపంలో దాచుకున్న కరెన్సీని క్రిప్టో కరెన్సీగా వ్యవహరిస్తారు. అంటాం. దీనిని ప్రైవేటు కరెన్సీ అని కూడా వ్యవహరిస్తారు. ఓ ప్రత్యేక సాంకేతికతతో పనిచేయడం వల్ల దీనిని ఫోర్జరీ చేయడం కుదరదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మొత్తంలో చలామణీలో ఉండటం వల్ల కాస్త గిరాకీ పెరిగినా.....

Updated : 08 Jun 2021 15:07 IST

బిట్‌కాయిన్‌..పరిచయం అక్కర్లేని పదం.  ఇది ఏదేశానికీ చెందిన కరెన్సీకాదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. ఇది అచ్చమైన అంతర్జాతీయ వర్చువల్‌ కరెన్సీ. డిజిటల్‌ రూపంలో దాచుకున్న కరెన్సీని క్రిప్టో కరెన్సీగా వ్యవహరిస్తారు. అంటాం. దీనిని ప్రైవేటు కరెన్సీ అని కూడా వ్యవహరిస్తారు. ఓ ప్రత్యేక సాంకేతికతతో పనిచేయడం వల్ల దీనిని ఫోర్జరీ చేయడం కుదరదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మొత్తంలో చలామణీలో ఉండటం వల్ల కాస్త గిరాకీ పెరిగినా..దాని విలువ మాత్రం అమాంతం పెరిగిపోతోంది. దీనిపై పెట్టుబడి పెట్టేవారిసంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఎక్కువ లాభాలొస్తున్నాయన్న కారణంగా ఎంతోమంది మధ్య తరగతివారు సైతం అందులో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, ఒక వేళ బిట్‌కాయిన్స్‌ను కొనుగోలు చేసిన వారు మరణిస్తే పరిస్థితి ఏంటి? వాళ్ల కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామికి ఆ ఆస్తిని అనుభవించే హక్కు ఉంటుందా? ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి?చాలా మంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి.

కాలిఫోర్నియాకు చెందిన జాన్‌ క్లెన్‌ (32) ఐటీ నిపుణుడు. ఇంట్లో నిచ్చెన వేసుకొని 10 అడుగుల ఎత్తులో పని చేస్తుండగా.. ఒక్కసారిగా అది జారిపోయి కిందపడిపోయాడు. ప్రాణాపాయం లేదుగానీ.. ఒక్కసారిగా ఆయన ఆలోచనలన్నీ తాను కొనుగోలు చేసిన బిట్‌ కాయిన్స్‌వైపు వెళ్లాయి..ఒకవేళ హఠాత్తుగా తాను మరణిస్తే పరిస్థితి ఏంటి? బిట్‌కాయిన్లు కొనుగోలు చేసిన విషయాన్ని గానీ, వాటికి సంబంధించిన పాస్‌వర్డులు గానీ ఆమెకు చెప్పలేదు. షాక్‌ నుంచి తేరుకున్న కొన్ని రోజుల తర్వాత బిట్‌కాయిన్‌ ఖాతాకు సంబంధించిన ప్రైవేటు కీ, పాస్‌వర్డ్‌లను ఓ తెల్లకాగితంపై రాసి, వాటిని ఎలా నిర్వహించాలో కూడా అందులోనే రాసి, ఓ రహస్య ప్రాంతంలో పెట్టి భార్యకు చెప్పాడు. ఒక వేళ అప్పుడే జాన్‌ క్లెన్‌ మరణించి ఉంటే..!

సాధారణ ఆస్తులతో సమస్య లేదు

సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆస్తులైతే పెద్దగా సమస్యలేవీ ఉండవు. దూరదృష్టితో ఆలోచించిన వారైతే..మరణించక ముందే తన ఆస్తిని ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసేస్తారు. కొన్నిసార్లు కుటుంబ పెద్ద మరణించిన తర్వాత ఆయన కుటుంబీకులు పెద్దల సమక్షంలో వాటాలు తేల్చుకుంటారు. అదీ కుదరని పక్షంలో కోర్టు ఓ ఎక్జిక్యూటర్‌ను నియమిస్తుంది. ఆయన చెప్పినట్లుగా అందరూ నడచుకోవాల్సి ఉంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీ విషయంలో ఇది అంత సులభం కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే యజమాని మరణించిన తర్వాత ఆ ఖాతాను తిరిగి తెరడం చాలా కష్టం. అంతేకాకుండా చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. 

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేవారు లావాదేవీలను చాలా రహస్యంగా ఉంచుతారు. పాస్‌వర్డ్‌, ప్రైవేట్‌ కీ ఉంటేనే ఖాతాలో ఎంత ఉందో తెలుసుకునే వీలుంటుంది. అవిలేకుండా సదరు వ్యక్తి మరణించిన తర్వాత క్రిప్టో కరెన్సీ వివరాలు తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. విశ్వసనీయ సమచారం ప్రకారం దాదాపు 20శాతం ఖాతాలు ఇలాగే మూతపడుతున్నట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు 140 బిలియన్‌ డార్లు ఉండొచ్చని అంచనా. కనీసం ఐదేళ్లకు మించి లావాదేవీలు జరగకపోతే  ఆయా వాలెట్లలో ఉండే కాయిన్లను తొలగిస్తారు. కేవలం బిట్‌కాయిన్‌ మాత్రమే కాకుండా ఎన్‌ఎఫ్‌టీ, కాయిన్‌బేస్‌, లాంటి దాదాపు పదివేలకుపైగా క్రిప్టో కరెన్సీలు మార్కెట్లో చలామణీ అవుతున్నట్లు అంచనా.

మిలియన్‌ డాలర్లు మదుపుపెట్టినా..!

చాలా మంది క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి సంపదను వృద్ధి చేసుకుందామనుకుంటారు. కానీ, వాటివల్ల నష్టపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు.

* గెరాల్డ్‌ కాటెన్ (30)‌.. క్రిప్టో ఎక్సేంజ్‌ క్వార్డిగా సంస్థ సీఈవో. 2018లో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.  అప్పటికే అతడు 250 మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేశాడు. కానీ, కుటుంబ సభ్యుల దగ్గర దానికి సంబంధించిన ప్రైవేటు కీ లేదు. ఫలితంగా అంతా నష్టపోవాల్సి వచ్చింది.
* మాథ్యూ మెలాన్‌.. 2013లో బిట్‌కాయిన్స్‌లో 2 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాడు. 2018లో ఆయన మరణించేనాటికి దాని విలువ 500 మిలియన్లకు పైగా ఉంది. కానీ, ఆ ఖాతాకు సంబంధించిన పాస్‌వర్డులుగానీ, ప్రైవేటు కీలు గానీ ఎవరికీ తెలియవు. ఆయన వ్యాలెట్లను ఇంకా గుర్తించాల్సి ఉంది.
26 ఏళ్ల మాథ్యూ మూడీ 2013లో ఓ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బిట్‌ కాయిన్లలో వేలాది డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. కానీ, ఆ వివరాలేవీ ఆయన కుటుంబ సభ్యుల దగ్గర లేవు. ఇప్పటికీ ఆయన తండ్రి కొడుకు పెట్టుబడి పెట్టిన సొమ్మును తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 
కేవలం వీళ్లే కాదు.. ఇలాంటి వారెందరో క్రిప్టోలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించినప్పటికీ..వాటిని అనుభవించలేకపోయారు. 

దాదాపు 40శాతం మందికి ఇదే పరిస్థితి

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి విషయాన్ని పక్కన పెడితే.. దాదాపు 40శాతం మంది ఆ వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం లేదని ఓ సర్వేలో తేలింది. ఇందులో మదుపు చేసిన వారి సరాసరి వయస్సు 38 ఏళ్లని అంచనా. అందువల్ల చాలా మంది తమ మరణానంతరం ఏంటి? అనే విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదని, హరాత్పరిణామాలు సంభవించినప్పుడు.. ఆయా ఖాతాలను ఉపయోగించుకోలేక కుటుంబ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని సర్వేలో తేలింది. అయితే ప్రస్తుత కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా మంది క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వివరాలను జీవిత భాగస్వామికి, ఇతర కుటుంబసభ్యులతో పంచుకుంటున్నారట.

తెరపైకి డిజిటల్‌ ఎగ్జిక్యూటర్‌

కెనడాకు చెందిన ఎరెన్‌ బరీ కుటుంబ సభ్యుడొకరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారు. కొన్నాళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. ఆయనదీ అదే పరిస్థితి కీలకమైన పత్రాలేవీ లేవు. ఖాతాకు సంబంధించిన సమాచారం లేదు. సాంకేతిక నిపుణుడైన ఆయన ‘విల్‌ఫుల్‌’ అనే డిజిటల్‌ ఎస్టేట్‌ ప్లానింగ్‌ సర్వీస్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా క్రిప్టో ఖాతాకు చెందిన  కొన్ని కీలక అందులో దాచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం..
*క్రిప్టో ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాల జాబితా తయారు చేసుకోవాలి. అవి ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలి? తదితర విషయాలు స్పష్టంగా రాసుకోవాలి
* వాటిని సరైన రక్షణ కల్పించి, ఒక చోట గానీ, వేర్వేరు చోట్లగానీ భద్రపరచుకోవాలి.
* వాటిని యాక్సిస్‌ చేసే విధంగా డిజిటల్‌ ఎక్జిక్యూటర్‌కి కొన్ని అనుమతులు ఇవ్వాలి.
* ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అందులోనే రాసిపెట్టినట్లయితే తదనుగుణంగా డిజిటల్‌ ఎక్జిక్యూటర్‌ వాటాలు కేటాయిస్తాడు.
ఎవరైనా తమ ఖాతావివరాలను ఎవరితోనూ పంచుకునేందుకు ఇష్టపడనట్లయితే.. వాళ్లు బతికున్నప్పుడే వాటిని తిరిగి సాధారణ నగదురూపంలోకి మార్చుకోవాలి. లేదంటే దాదాపు అవి కోల్పోయినట్లే.

ఇటీవల మరిన్ని ఆప్షన్లు..

ఇటీవల క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టే వారికి సరికొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వారి పాస్‌వర్డ్స్‌, కీ వర్డ్స్‌కు రక్షణ కల్పించేందుకు మరిన్ని టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ట్రస్ట్‌వెర్స్‌.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేస్తుంది. ప్రైవేటు కీలకు, పాస్‌వర్డులకు రక్షణ కల్పిస్తుంది. దీంతోపాటు సేవ్‌ హెవెన్‌, క్లోర్క్‌, కాసాలాంటి సర్వీసులెన్నో ఉన్నాయి. వాటిలో మన కీలక సమాచారాన్ని దాచుకునే వెసులుబాటు ఉంది.

కుటుంబీకులు నిర్వహించినా కష్టమే!

కుటుంబీకులకు పాస్‌వర్డులు, కీ వర్డులు చెప్పినా, సరికొత్త టెక్నాలజీతో వాటికి రక్షణ కల్పించినా పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. ఎందుకుంటే.. రివైజ్డ్‌ యూనిఫాం ఫిడుషియరీ యాక్సెస్ టు డిజిటల్‌ చట్టం (ఆర్‌యూఎఫ్‌ఏదీఏఏ) ప్రకారం.. చనిపోయినవారి ఖాతాల్లో లాగిన్‌ అవ్వడం నేరం. కానీ, కాయిన్‌బేస్‌, బినాన్స్‌ తదితర క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీలు చనిపోయిన వారి ఖాతాలను నిర్వహించేందుకు ప్రత్యేక విధానాన్ని కలిగి ఉన్నాయి. బ్యాంకు ఆధారంగా సంబంధిత కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. చనిపోయిన వారి కాయిన్‌బేస్‌ క్రిప్టో కరెన్సీ ఖాతాను తెరవాలంటే.. సదరు వ్యక్తి మరణించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులు సమర్పించాల్సి ఉంటుంది.  

మరణించిన తర్వాత వెనక్కి తీసుకుంటే పన్ను

అవాంతరాలన్నీ ఎదుర్కొని, అవసరమైన పత్రాలన్నింటినీ సమర్పించినప్పటికీ నగదు మొత్తం వెనక్కిరాదు. బ్యాంకు ద్వారా నగదును వెనక్కితీసుకుంటున్నందున సాధారణంగా చెల్లించినట్లుగానే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖాతాదారుడు మరణించిన నాటి విలువ ఆధారంగా దీనిని లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి 2013లో 5 వేల డాలర్లు క్రిప్టోలో పెట్టుబడి పెట్టాడనుకుందాం. ఆయన మరణించిన సమయానికి దాని విలువ 50వేల డాలర్లు. కానీ, ఆయన కుటుంబసభ్యులు అమ్మేనాటికి దాని విలువ 60వేల డాలర్లు అనుకుందాం. ఇప్పుడు కేవలం 10 వేల డాలర్లపైనే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతాపూర్తవడం అంతసులభమేమీ కాదు. చాలా సమయం తీసుకుంటుంది. అందుకే ‘బతికున్నప్పుడే క్రిప్టోను సాధారణ కరెన్సీగా మార్చుకోవాలి. లేదంటే మనతోపాటే అది కూడా చనిపోతుంది’.. అని క్రిప్టోలో పెట్టుబడి పెట్టిన చాలా మంది చెబుతుండటం గమనార్హం. ఈ క్రిప్టో కరెన్సీని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ, బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో చలామణీలో ఉంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని