JPC : గతంలో కుంభకోణాలపై జేపీసీ.. అవి ఏం చేశాయంటే..?
అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు జేపీసీ ఎలా పని చేస్తుందో చదివేయండి.
అదానీ గ్రూప్(Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. దీంతో మదుపరులు సహా, కొన్ని బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే షేర్ల ధరల్లో అవకతవకలు, ఖాతా పుస్తకాల్లో మోసాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(Joint Parliamentary Committee)తో విచారణ జరిపించాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇంతకీ, సంయుక్త పార్లమెంటరీ సంఘం అంటే ఏంటి? గతంలో అదెలాంటి విచారణలు చేసిందో తెలుసుకోండి.
ఏమిటీ జేపీసీ?
ఏదైనా కుంభంకోణం గురించి లేదా ఒక నిర్దిష్టమైన బిల్లుకు సంబంధించిన సమాచారంపై విశ్లేషణ చేయడానికి జేపీసీ ఏర్పాటవుతుంది. అందుకు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలో ఏదైనా ఒక చోట సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)పై తీర్మానం చేసి మరో సభ దాన్ని బలపరచాల్సి ఉంటుంది. ఇంకో విధానంలో.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఇద్దరూ సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో జేపీసీని ఏర్పాటు చేయవచ్చు. ఈ సంఘంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఎంపికైన లోక్‌సభ సభ్యుల సంఖ్యలో సగ భాగానికి సమానమైన సభ్యులను రాజ్యసభ నుంచి ఎన్నుకుంటారు. మొత్తం సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది.
ఎలాంటి అధికారాలుంటాయి?
జేపీసీ ఏర్పాటైన తరువాత అందులోని సభ్యులు విచారణ చేస్తున్న అంశం గురించి సంబంధిత నిపుణులు, ప్రజా ప్రతినిధులు, సంఘాలు, వ్యక్తులు, పార్టీల నుంచి ఆధారాలను(evidence), సమాచారాన్ని సేకరిస్తారు. ఎవరైనా.. విచారణకు సహకరించకపోయినా, జేపీసీ ఎదుట హాజరు కాకపోయినా సభా ధిక్కారంగా పరిగణిస్తారు. పరిశీలనలో భాగంగా జేపీసీ మౌఖిక, రాత పూర్వక ఆధారాలను సేకరిస్తుంది. కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కూడా పరిశీలిస్తుంది. ఈ విషయాలన్నీ గుట్టుగా జరుగుతాయి. ఒక వేళ సెక్యూరిటీస్, బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలను విచారిస్తున్నట్లయితే ఆ విచారణకు సంబంధించిన విషయాలను నిరభ్యంతరంగా ప్రజలకు తెలియజేస్తుంది. జేపీసీ ఛైర్మన్ కమిటీ సాగించిన చర్చల వివరాలను మీడియాకు బహిర్గతం చేస్తారు.
జేపీసీ విచారణలో భాగంగా ఎవరినైనా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించొచ్చు. మంత్రులను సహజంగా జేపీసీ పిలవదు. అయితే సెక్యూరిటీస్, బ్యాంకింగ్ లావాదేవీల అక్రమాలపై విచారణ సాగిస్తుంటే స్పీకర్ అనుమతి తీసుకొని మంత్రులనూ విచారించే అవకాశముంటుంది. జేపీసీ అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు.. వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం (government) నిరాకరించవచ్చు. అటువంటి సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని ఆయన సమ్మతి తెలిపితే తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ కుంభకోణాలపై జేపీసీలు ఏర్పాటయ్యాయి. అవేంటంటే..
బోఫోర్స్ కుంభకోణం
1987లో తొలిసారి బోఫోర్స్ కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత బి.శంకరానంద దానికి అధ్యక్షత వహించారు. నాటి రక్షణమంత్రి కేసీ పంత్ లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారం రోజుల తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించింది. 50 సార్లు సమావేశమైన ఈ కమిటీ 1988 ఏప్రిల్ 26న తుది నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ సభ్యులు అధికంగా ఉన్నారని విమర్శిస్తూ ఈ కమిటీని అప్పటి విపక్షాలు వ్యతిరేకించాయి. పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన నివేదికను సైతం తిరస్కరించాయి.
హర్షద్ మెహతా కుంభకోణం
జేపీసీ రెండోసారి 1992లో ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్‌నేత, అప్పటి కేంద్రమంత్రి రామ్‌నివాస్ మ్రిధా దానికి అధ్యక్షత వహించారు. హర్షద్ మెహతా కుంభకోణంతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో సెక్యూరిటీస్, బ్యాంకింగ్ లావాదేవీలపై విచారణ జరిగింది. నాటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మరుసటి రోజు రాజ్యసభ దాన్ని ఆమోదించింది. ఈ విచారణ సంఘం సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు. అమలు కూడా చేయలేదు.
కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణం
హర్షద్ మెహతా కుంభకోణం తరువాత కేతన్ పరేఖ్ షేర్ మార్కెట్ కుంభకోణంపై 2001లో జేపీసీని ఏర్పాటు చేశారు. నాటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భాజపా సీనియర్ నేత, మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రకాశ్ మణి త్రిపాఠి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 105సార్లు సమావేశమైన కమిటీ 2002 డిసెంబరు 19న నివేదిక ఇచ్చింది. స్టాక్ మార్కెట్ నిబంధనల్లో భారీగా మార్పులు తీసుకురావాల్సి ఉందని ఈ కమిటీ అభిప్రాయంపడింది. కానీ, అవన్నీ బుట్టదాఖలయ్యాయి.
శీతల పానియాల్లో పురుగుమందులు
శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని తెలియడంతో 2003లో జేపీసీ ఏర్పాటు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ దీనికి అధ్యక్షత వహించారు. పురుగుమందుల అవశేషాలు ఉండటం నిజమేనని ఈ కమిటీ నిర్ధారించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అధ్యక్షత వహించాలని చెప్పింది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
2జీ స్పెక్ట్రం కుంభకోణం
2జీ కేసు విచారణ కోసం 2011 ఫిబ్రవరిలో జేపీసీ ఏర్పాటైంది. దీనికి పీసీ చాకో అధ్యక్షత వహించారు. మొత్తం 30 మంది సభ్యుల్లో 15 మంది భాజపా, జేడీయూ, సీపీఐ, సీపీఎం, తృణమూల్, బిజద, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నుంచి ఉన్నారు. అధ్యక్షుడు పీసీ చాకో పక్షపాతంతో వ్యహరిస్తున్నారని ఈ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆయనను తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస పత్రం కూడా అందజేశారు. అంతేకాకుండా డ్రాఫ్ట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు. దాంతో దిగొచ్చిన పీసీ చాకో డ్రాఫ్ట్ సవరణకు అంగీకరించారు.
వీవీఐపీ ఛాపర్ స్కామ్
2013లో రాజ్యసభలో జేపీసీపై తీర్మానం ప్రవేశపెట్టారు. అగస్టా వెస్ట్‌లాండ్ నుంచి రక్షణశాఖ వీవీఐపీ హెలికాప్టర్లు పొందడానికి చేసిన లావాదేవీల్లో అవకతవకలు, లంచాలపై విచారణకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
భూ సేకరణ బిల్లు
భూమికి తగ్గ పరిహారం, భూ సేకరణలో పారదర్శకత, పునరావాస బిల్లు 2015కు సంబంధించి ఎస్.ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలో జేపీసీ ఏర్పాటు చేయాలని సూచించింది.
వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లు
2019 డిసెంబరులో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భాజపా నేత మీనాక్షి లేఖి అధ్యక్షతన జేపీసీ పూర్తి విశ్లేషణ చేసి బడ్జెట్ సమావేశాలు ఉండటంతో 2020 మార్చి నాటికి ఆ బిల్లుపై డ్రాఫ్ట్ లాను అందజేసింది. 2022లో వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణకు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
SJ Surya: ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. గుక్కపెట్టి ఏడ్చా: ‘ఖుషి’ డైరెక్టర్
-
India News
Jaishankar: శాంతి నెలకొన్న తర్వాతే చైనాతో సంబంధాలు.. జైశంకర్
-
Movies News
Anasuya: అనసూయ కోసం వాళ్ల నాన్న రక్తం అమ్మి బహుమతి ఇచ్చారట: దర్శకుడు శివ ప్రసాద్
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై తప్పుడు కేసు నమోదు చేశారు: మైనర్ బాలిక తండ్రి