లై డిటెక్టర్ Vs నార్కో టెస్ట్.. ఏమిటీ పరీక్షలు..? నేర పరిశోధనలో ఎందుకంత ప్రాధాన్యం...?
నేర పరిశోధనలో నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలు ఎంతో కీలకంగా మారుతోన్న విషయం తెలిసిందే. తాజా శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్‌కు ఈ పరీక్షలు చేపట్టారు. నేర పరిశోధనలో భాగంగా సరైన ఆధారాలు దొరకని కేసుల్లో ఇవి ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయి.
దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలాకు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పాలిగ్రాఫ్ (Polyghraph) నిర్వహిస్తుండగా, నార్కో టెస్టు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో నేర పరిశోధనలో లై డిటెక్టర్ (Lie Detector), నార్కో అనాలసిస్ పరీక్షలు (Narco Test) ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి..? వీటివల్ల ప్రయోజనమేమిటనే విషయాలను ఓసారి చూద్దాం.
నార్కో అనాలసిస్:
నార్కో అనాలసిస్ (Narco Test) అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్, స్కోపలామైన్,, సోడియం అమైథాల్) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు.
పాలిగ్రాఫ్ అంటే..!
పాలిగ్రాఫ్ (Polygraph) టెస్టునే లై డిటెక్టర్ (Lie Detector) అనికూడా పిలుస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా అనే విషయాన్ని దీనిద్వారా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి ఔషధాలు, మత్తుమందులు వాడరు. కేవలం వ్యక్తి శరీరానికి కార్డియో-కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతోపాటు ఇతర పరికరాలు మాత్రమే అమరుస్తారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియా రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వాటివల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియా రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా..? లేదా? అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. అయితే, ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరీక్షను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారి వినియోగించినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్షాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి.
గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో అబ్దుల్ కసబ్‌ల విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు. తాజాగా దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్‌కూ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్
-
Sports News
On This Day: ఆ ఓటమికి సరిగ్గా 20 ఏళ్లు.. ప్రతి భారతీయుడి గుండె పగిలిన రోజు