ఏమిటీ రివెంజ్‌ ట్రావెల్‌? దీనిపై ఆందోళన దేనికి?

నాల్రోజులు సెలవులు దొరికితే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లాలా ఆలోచిస్తుంటాం. పని ఒత్తిడి నుంచి ఉమశమనానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటిది కరోనా పుణ్యమా అని ఇలాంటి ఆలోచనలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు జనం

Published : 13 Jul 2021 09:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు రోజులు సెలవులు దొరికితే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లాలా? ఆలోచిస్తుంటాం. పని ఒత్తిడి నుంచి ఉమశమనానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటిది కరోనా పుణ్యమా అని ఇలాంటి ఆలోచనలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు జనం. కొవిడ్‌ కారణంగా చాలా వరకు ఇంట్లోనే ఉండి పనిచేయాల్సిన స్థితి. భయంతో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. దీంతో వారాల తరబడి జనం ఇంట్లో మగ్గారు. అలాంటి వాళ్లకు ఆంక్షల సడలింపు కొత్త రెక్కలనందించింది. దీంతో భౌతిక దూరానికి బైబై చెప్పి.. మాస్కులకు మంగళం పాడేసి గుంపులుగా చేరడం మొదలుపెట్టారు. ఈ తరహా పర్యటకాన్ని రివెంజ్‌ ట్రావెల్‌గా పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పుడు ఆందోళన వ్యక్తంచేస్తోంది.

బంధనం నుంచి విముక్తి కోసం..

ఏ తుపానులో, వరదలో వచ్చేప్పుడు తప్ప.. ఇంట్లోంచి అడుగు బయట పెట్టని పరిస్థితులు అరుదు. అలాంటిది కొవిడ్‌ కారణంగా ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆఫీసుల్లేక ఇంటికే పరిమితం కావడం.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఇంట్లోనే మగ్గడం.. జనానికి లైఫ్‌ రొటీన్‌గా మారిపోయింది. ఇలాంటి సమయంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. దీంతో ప్రజల్లో కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న తలంపు ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడ సేద తీరడం ఇటీవల కనిపిస్తోంది. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీ, సిమ్లా, ధర్మశాల; ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం, హరిద్వార్‌లోని హర్‌ కీ పౌరీ ఘాట్‌ వంటి ప్రాంతాల్లో పర్యటకులతో కిక్కిరిస్తున్నాయి. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇటీవల వైరల్‌గా మారాయి.

ప్రభుత్వం ఆందోళన...

దేశంలో సెకండ్‌వేవ్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. ఒకానొక దశలో నాలుగు లక్షల చొప్పున రోజువారీ కేసులు వచ్చేవి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 40వేల మంది వరకు మహమ్మారి బారిన పడుతున్నారు. పరిస్థితులు అదుపుతప్పితే మరో వేవ్‌ కారణమని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి వీకే పాల్‌ వంటి వారు  హెచ్చరిస్తున్నారు. ఈ రివెంజ్‌ ట్రావెల్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్‌ పోరాడుతున్న వేళ ఇలాంటి పర్యటనలు ప్రమాదకరమని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే ఆంక్షలను పునరుద్ధరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని