Train : రైలు చివరి బోగీపై ‘X’.. ఎందుకో తెలుసా!

భారతీయ రైళ్లలో చివరి బోగీకి ‘X’ తప్పకుండా అతికించి ఉంటుంది.

Published : 09 Mar 2023 13:53 IST

మీరు ఎప్పుడైనా రైలు(Train) వెనుక బోగీపై ‘X’ గుర్తు ఉండటం గమనించారా? దాని అర్థం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా? అయితే ఈ సమాచారం మీ కోసమే..!

రైలు బోగీ చివర ‘X’ కనిపిస్తే అదే ఆ రైలుకున్న చివరి బోగీ అని అర్థం. ఈ గుర్తును రేడియం స్టిక్కర్‌(Radium sticker)తో అతికిస్తారు. అది శాశ్వతంగా ఉంటుంది. ఈ ‘X’ మాత్రమే కాకుండా రైలు వెనుక భాగంలో ‘LV’ అక్షరాలు రాసిన చిన్న బోర్డు ఉంటుంది. అంటే అదే లాస్ట్‌ వెహికల్‌(Last vehicle) అని అర్థం. దీనిని రైల్వే గార్డు బోగీకి తగిలిస్తారు. ప్లాట్‌ఫామ్‌పై రైలు నిల్చున్నప్పుడు ఇతర రైళ్ల లోకో పైలట్లు ఈ ‘LV’ బోర్డును తప్పకుండా గమనిస్తారు. బాగా దూరం నుంచి ‘X’ గుర్తు స్పష్టంగా కనిపించడంతో ఇతర రైళ్లు వెనుక నుంచి ఢీకొనే ప్రమాదం ఉండదు. ఇది మాత్రమే కాదు ‘X’ కనిపించిందటే అర్థం ఆ రైలు బోగీలన్నీ కలిసే ఉన్నాయని. ఏదైనా లోపం వల్ల కొన్నిసార్లు బోగీలు ఊడిపోతూ ఉంటాయి. ఆ విడిపోయిన బోగీలు ఎక్కడో ఒక చోట ఆగిపోతాయి. కానీ.. రైలు ఇంజిన్‌తో అనుసంధానమైన ముందు బోగీలన్నీ పరుగు తీస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో వాటి వెనుక ‘X’ గుర్తు కనిపించదు. దాంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమవుతారు. వివిధ స్టేషన్ల(Railway station) గుండా రైలు దాటుతున్న సమయంలో స్టేషన్‌మాస్టర్లు తప్పకుండా వెనుక బోగీకి ‘X’ ఉందో లేదో పరిశీలనగా చూస్తారు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ముందు స్టేషన్లకు, వెనక స్టేషన్లకు సమాచారం ఇస్తారు. 

రాత్రి సమయాల్లో ‘LV’ కనిపించదు కనుక ఒక ఎర్రని లైట్‌ వెలుగుతూ.. ఆరిపోతూ ఉంటుంది. దీంతో లోకోపైలట్ తన ముందు ఆగి ఉన్న లేదా వెళ్తున్న రైలు దూరాన్ని అంచనా వేయడానికి వీలుంటుంది. ఏబీసీడీలు 26 ఉంటే రైల్వే అధికారులు ‘X’ మాత్రమే ఎందుకు పెట్టారు? అనే అనుమానం మీకు రావొచ్చు. ఆ ‘X’ అనేది చిహ్నం మాత్రమే. అక్షరం కాదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆంగ్ల వర్ణమాలలోని ఇతర అక్షరాలతో పోలిస్తే ‘X’ చాలా దూరం నుంచి సులభంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఎంచుకున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు