Health: అలసటగా అనిపిస్తోందా?... ఇవి ట్రై చేసి చూడండి!

అలసట (Tired)గా అనిపించినప్పుడు కాస్త ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది టీ (Tea),కాఫీ (Coffee)ల వైపు మొగ్గు చూపుతారు.అయితే వాటికి బదులు ప్రకృతి సిద్ధమైన పళ్ల రసాలు, పానీయాలు తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Updated : 11 Mar 2023 15:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎండాకాలం (Summer) మొదలైంది.. ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట ఆవహిస్తుంది. దాన్నుంచి ఉపశమనం పొందేందుక కాస్త టీ (Tea) లేదా కాఫీ (Coffee) తీసుకుంటాం. అప్పటికి కాస్త రిలీఫ్‌గా అనిపించినా.. కెఫిన్‌ (Caffeine) ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో దుష్ప్రభావాలు కలిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీలైనంత వరకు కెఫిన్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. అలాగే పోషకాహార లోపం ఉన్నవారు కూడా తరచూ నీరసించిపోతారు. ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుంది. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే.. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే ఉత్తమ మార్గం. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతోపాటు..అలసట కూడా దూరమవుతుంది. మరి అవేంటో చూద్దామా?

1. అరటిపండు షేక్‌

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం ఖనిజ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌ కూడా అధిక మోతాదులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉండేందుకు అరటిపళ్లు సహకరిస్తాయి. ఉదయం పూట అరటిపళ్లు తినడం వల్ల ఆరోజుకు అవసరమైన పోషకాలను పొందే వీలుంటుంది. అయితే నేరుగా తీసుకుంటే కొద్ది మందికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల మిల్క్‌ షేక్‌ చేసుకొని తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

2. హోంమేడ్‌ హెర్బల్‌ టీ

బయటి దుకాణాల్లో బోలెడన్ని హెర్బల్‌ ‘టీ’లు రకరకాల ప్లేవర్స్‌లో దొరుకుతున్నాయి.  వీటికి బదులు ఇంట్లోనే హెర్బల్‌ టీ తయారు చేసుకొని తాగడం ఉత్తమం. దీనిని తయారు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. మరుగుతున్న నీటిలో సరిపడా గ్రీన్ టీ ఆకులు వేసి, సువాసన కోసం కొంచెం యాలకులు, అల్లం, పసుపు కలిపి కొద్దిసేపు మరిగించాలి. వడపోసిన తర్వాత కొంచెం తేనె, నిమ్మరసం కలిపితే ఇంకా బాగుంటుంది. ఉదయం లేచిన తర్వాత ఓ కప్పు హెర్బల్‌ టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తప్రవాహాన్ని క్రమబద్ధీకరించి రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. రాత్రి నిద్ర పోయే ముందు హెర్బల్‌ టీ తీసుకుంటే దీర్ఘకాలిక అలసట సమస్యలను అదుపు చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3. దానిమ్మ రసం

దానిమ్మలో విటమిన్‌ సి, విటమిన్‌ కే, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం, జింక్‌ తదితర ఖనిజధాతువులు అధిక మోతాదులో ఉంటాయి. బీపీ తక్కువగా ఉన్నవారు, అనవసరపు కొవ్వు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ దానిమ్మ రసం తీసుకుంటే వారి శక్తిస్థాయులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. దానిమ్మలోని ఐరన్‌ ధాతువులను గ్రహించడానికి విటమిన్‌ సీ ఉపయోగపడుతుంది. నిమ్మ రసంలో సీ విటమిన్‌ పుష్కలంగా ఉండటం వల్ల అందులోని ఐరన్‌ను సంగ్రహించే వీలుంటుంది. రక్తంలో ఐరన్‌ స్థాయులు తగ్గినట్లయితే అలసటగా అనిపించడం, దీర్ఘ కాలంలో రక్తహీనతకు దారితీసే అవకాశాలున్నాయి.

4. పుచ్చకాయ- సబ్జా గింజలు

పుచ్చకాయలో సి-విటమిన్‌తో పాటు.. ఐరన్‌, మెగ్నీషియం ఉంటాయి. ఎండ వల్ల అలసటగా అనిపించినప్పుడు పుచ్చకాయ తీసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే, వాటర్‌ మిలన్‌ జ్యూస్‌లో కొద్దిపాటి సబ్జా గింజలు వేసి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో సబ్జా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎండ తాకిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థాలు చక్కెర స్థాయులు పెరగకుండా చేసి.. నిదానంగా జీర్ణమవుతాయి. మధుమేహంతో బాధపడేవారు అలసట నుంచి విముక్తి పొందాలంటే ఇదో చక్కటి చిట్కా. సబ్జాగింజల్లోని ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా ఎముకలు బలంగా మారతాయి.

5. కొబ్బరి నీళ్లు

వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది కొబ్బరి నీళ్లకే మొగ్గు చూపుతారు. ప్రకృతి సిద్ధమైన ఈ డ్రింక్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరం నాజూగ్గా తయారవుతుంది. బాగా అలసటగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లలో కొద్దిపాటి నిమ్మరసం, తేనె, పుదీనా లేదా కొత్తిమీర వేసుకొని తాగితే నోటికి రుచిగా ఉంటుంది. రక్త ప్రవాహం సజావుగా సాగి అలసటను తగ్గించడంలో కొబ్బరినీళ్లు మేలు చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని