Nityananda: కైలాస దేశ ‘ప్రధాని’.. వివాదాల స్వామీజీ!

భారత దేశాన్ని విడిచి పారిపోయిన వివాదాస్పద, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తన కోసం ప్రత్యేకంగా ఓ దేశాన్నే సృష్టించుకున్నారు. 

Published : 02 Mar 2023 10:20 IST

(Image : Srinithyananda insta)

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్‌ కైలాస(USK) ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొన్నారు. నిత్యానంద(Nithyananda)ను భారత్‌ వేధిస్తోందని, అందుకే రక్షణ కల్పించాలని మహిళా ప్రతినిధి విజయప్రియ నిత్యానంద డిమాండ్ చేశారు. జెనీవాలో వివిధ దేశాల ప్రతినిధులను కలిసి కైలాస రాజ్యాంగ పీఠికను అందజేశారు. దానిని ‘ద భగవద్గీత’గా పేర్కొంటూ పంపిణీ చేశారు. అసలు నిత్యానంద ఎవరు? ఓ దేశాన్ని స్థాపించినట్లు ఎందుకు ప్రకటించుకున్నారు..?

నిత్యానంద ఎవరు?.

నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్‌. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో జన్మించారు. సన్యాస సంచారం చేస్తున్న సమయంలో మహావతార్‌ బాబాజీ తనకు నిత్యానందగా నామకరణం చేసినట్లు ఆయనే చెప్పారు. తొలిసారి 2003లో బెంగళూరు(Bangalore) సమీపంలోని బిదాడి వద్ద నిత్యానంద ధ్యానపీఠం నెలకొల్పారు. తనకు 12వ ఏటనే జ్ఞానోదయం(enlightenment) అయినట్లు భక్తులకు ఉపదేశించారు. ధ్యానపీఠంలో ప్రవచనాలు చెబుతూ నిత్యానంద బాగా పేరు సంపాదించారు. విదేశీయులు కూడా ఆయనకు భక్తులుగా మారారు. దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికాకు నిత్యానంద ఛైర్మన్‌గా ఉన్నారు. బ్రహ్మసూత్ర, పతంజలి, యోగసూత్ర, శివసూత్ర వంటి వాటిపై ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవారు. నిత్యానంద ధ్యానపీఠం ధార్మిక కార్యక్రమాలు దాదాపు 47 దేశాల్లో ప్రాచుర్యం పొందాయి.

(Image : Srinithyananda insta)

‘ఆ’ వీడియోతో మొదలైన వివాదం

ఆధ్యాత్మిక గురువుగా సాగిపోతున్న నిత్యానంద 2010లో లైంగిక వీడియో(video) వివాదంలో చిక్కుకున్నారు. ఓ నటితో కలిసి రాసలీలలు సాగిస్తున్నట్లుగా అందులో ఉంది. స్థానిక తమిళ ఛానళ్లతోపాటు, ఇంటర్నెట్‌లోనూ ఆ దృశ్యాలు అప్పట్లో వైరల్‌గా మారాయి. అయితే దానిపై స్పందించిన నిత్యానంద అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ కేసు ఓ సంచలనంగా మారింది. తరువాత కొన్ని రోజులకు ఈ కేసులో బెయిల్‌ పొందారు. మరోసారి 2019లో ఆయనపై అహ్మదాబాద్‌లో కేసు నమోదైంది. మైనర్‌ బాలికలను ఆశ్రమంలో నిర్బంధించి వేధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో ఇరుక్కుంటే తన మనుగడ కష్టమని భావించిన నిత్యానంద దేశం విడిచి పారిపోయారు. 

కైలాస దేశం.. ఆయనే ప్రధాని

భారత్‌ను వీడిన తరువాత నిత్యానంద ఎక్కడున్నారో ఎవరికీ తెలియరాలేదు. అనూహ్యంగా కొద్దిరోజులకు దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌ ఐలాండ్‌లో నిత్యానంద ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కైలాస’ను స్థాపించి సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అతిగొప్ప, స్వచ్ఛమైన హిందూ దేశంగా దాన్ని ప్రకటించుకున్నారు. ఈ కైలాస ఏర్పడిన తొలినాళ్లలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను త్యజించి ఈ దీవికి వెళ్లాలనుకుంటున్నారని వార్తలు వినిపించాయి. నిత్యానంద శిష్యుల్లో చాలా మంది ధనికులున్నారు. వారే ఆయనకు ఈ దీవిని కొనుగోలు చేసి ఇచ్చారని చెబుతుంటారు. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కైలాస’లో అడుగుపెట్టాలంటే దానికి అక్కడి ‘ప్రధాన మంత్రి(నిత్యానంద)’, ‘కేబినెట్‌’ అనుమతి పొందాల్సి ఉంటుంది. నిత్యానంద భక్తులై ఉండి ఆయనకు విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పిస్తారు. నిత్యానంద ప్రకటించుకున్న దేశంలో పలు మంత్రిత్వశాఖలు కూడా ఉన్నాయి. అందులో ‘జ్ఞానోదయ నాగరికత విభాగం’ కూడా ఒకటి. సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో దాన్ని ఏర్పాటు చేశారు. ఇక కైలాస పర్వతానికి దేశం తరహాలోనే ప్రత్యేక జెండా ఉంది. దాన్ని ‘రిషభధ్వజ’గా పిలుస్తున్నారు. జాతీయ జంతువుగా నంది, పక్షిగా ‘శరభం’, పుష్పంగా కమలం, చెట్టుగా మర్రిని ఎంపిక చేశారు. ఇంగ్లిష్‌, సంస్కృతం, తమిళంను అధికారిక భాషలుగా ప్రకటించారు.

నిత్యానంద తన హిందూ రిజర్వ్‌బ్యాంకుకు వచ్చిన విరాళాలను క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్లు ఆయన వెబ్‌సైట్‌(Kailaasa.org)గతంలో పేర్కొంది. 2018లోనే పనామాలో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఎవరైనా సరే స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటే ఈ కైలాసానికి రావొచ్చని పిలుపునిస్తున్నారు. భారత్‌ నుంచి పారిపోయినప్పటి నుంచి నిత్యానంద రోజువారీ ఉపన్యాసాలు ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో ప్రసారం అవుతున్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని