Intermittent Fasting:  ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’.. వీరికి చేటు!

పండుగల సమయంలోనూ, కాస్త అజీర్తిగా ఉంటేనో, డైట్‌లో భాగంగా, బరువు తగ్గించుకునేందుకు ఉపవాసం చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నామమాత్రపు ఉపవాసం( ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) బాగా ప్రాచుర్యం పొందింది.  అయితే అందరూ...

Updated : 17 Nov 2021 13:37 IST

పండుగల సమయంలోనో, కాస్త అజీర్తిగా ఉంటేనో, డైటింగ్‌లో భాగంగా, బరువు తగ్గించుకునేందుకు ఉపవాసం చేస్తుంటాం. ఈ మధ్యకాలంలో నామమాత్రపు ఉపవాసం( ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) బాగా ప్రాచుర్యం పొందింది. అయితే అందరూ ఇలాంటి ఉపవాసాలు చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఇలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని పేర్కొన్నారు. అసలేంటి ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్.. దీన్ని ఎవరెవరు చేయకూడదో తెలుసుకుందాం!

అసలేంటి ఈ ఫాస్టింగ్‌..

ప్రతి వ్యక్తి రాత్రి నిద్రలో దాదాపు 8 గంటలపాటు ఏమీ తినడు. అప్పుడు కూడా ఫాస్టింగ్‌ పాటిస్తున్నట్లే. అయితే ఇక్కడ ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించే వాళ్లు ఆ 8 గంటల సమయాన్ని పెంచుకుంటారు. అదెలాగంటే.. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసి తర్వాత రాత్రి 8 గంటలకు మళ్లీ భోజనం చేశారనుకుందాం. తర్వాతి రోజు ఉదయం వేళ ఎలాంటి టిఫిన్‌ చేయకుండా డైరెక్ట్‌గా మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసేసి.. అలా దానిని కంటిన్యూ చేస్తే అదే నామమాత్రపు ఉపవాసం (ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) అవుతుంది. ఇలా దాదాపు 16 గంటలపాటు ఉపవాసం పాటించినట్లు అవుతుంది. అయితే నామమాత్రపు ఉపవాసాన్ని అనేక రకాలుగా పాటించేవారు ఉన్నారు. కొందరు ప్రతిరోజూ పాటిస్తే, మరికొందరు వారానికొకసారి పాటిస్తూ ఉంటారు. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ ప్రధాన ఉద్దేశం చక్కెర స్థాయిలను తగ్గించి, కొవ్వును ఖర్చు చేయడమే. అయితే కొంతమంది ఇలాంటి ఫాస్టింగ్‌ చేయకూడదని వైద్యులు పేర్కొన్నారు.


నిద్రలేమి సమస్యలు ఉంటే.. 

ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా నిద్ర పోవాలి. కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలపాటు రాత్రివేళ నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు. అతినిద్ర కూడా అనర్థమే అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆకలితో నిద్రపోతే శరీరానికి, మెదడుకు సరైన విశ్రాంతి దొరకదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం నిద్రపోతే శరీరం తనంతట తాను శుద్ధి చేసుకునే పనిలో ఉంటుంది. కొన్ని గంటల పాటు ఆహారం తినకపోతే రక్తంలోని చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల అర్ధరాత్రుల్లో మధ్యలోనే మెలకువ వచ్చేస్తుంది. ఇలా చాలాసార్లు జరిగితే మాత్రం జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి వల్ల శరీర బరువు నిర్వహణలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.


ప్రణాళిక ప్రకారం తినకపోవడం.. అజీర్తి సమస్య

డైటింగ్‌ చేసేవారు సరైన ప్రణాళికలు వేసుకుని ఆహారం స్వీకరిస్తారు. వారికి ఎంత తినాలో, ఎప్పుడు తినాలో కూడా తెలుస్తుంది. దాని ద్వారా వారు శరీరాన్ని తమ అదుపులోనే ఉంచుకుంటారు. అలాంటివారు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయవచ్చు. కానీ సరైన ప్రణాళిక లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినేవారు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ విధానంలో ఉపవాసం పాటించాలంటే నియమిత సమయం వరకు ఆకలేసినా తినకుండా ఉండగలగాలి. జీర్ణ, గ్యాస్ట్రిక్‌ సమస్య ఉన్నవారు కూడా ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ విధానం వైపు రాకపోవడమే మేలు. రెండు భోజనాల మధ్య ఎక్కువ సమయం గ్యాప్‌ ఉండటం వల్ల వీరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య పెరిగే ప్రమాదం ఉంది.


ప్రత్యేక శిక్షణ, బాడీ బిల్డింగ్‌ కసరత్తు చేస్తుంటే... 

ప్రత్యేక శిక్షణలో ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయకపోవడమే ఉత్తమం. మారథాన్‌ లేదా ఇతర ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యేకంగా డైట్‌ మెనూను ఫాలో కావాల్సి ఉంటుంది. వ్యాయామం చేసే ముందు, తర్వాత బలవర్ధకమైన ఆహారం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫాస్టింగ్‌లో సమయం వ్యవధి ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేసేవారు ప్రతి మూడు నాలుగు గంటలకు ఏదో ఒకటి తినాలి. లేకపోతే శక్తి స్థాయులు పడిపోవడం వల్ల శరీరమంతా నిస్సత్తువ ఆవహిస్తుంది. అలాగే ప్రోటిన్లను మంచి కండల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.


మధుమేహ వ్యాధిగ్రస్థులు.. 

ప్రపంచ జనాభాలో అత్యధిక వేగంగా వృద్ధి అవుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోపాటు జన్యుపరంగాను డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఇలాంటి వారు తమ రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. టైప్‌ 1 డయాబెటిస్‌ రోగుల్లో ఇన్సులిన్‌ దానంతట అదే ఉత్పత్తి కాలేదు. ఇన్సులిన్‌ను శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసి సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. రోజువారీ ఇన్సులిన్‌ తీసుకుంటూ డయాబెటిస్‌ కోసం మందులు వాడేవారు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను చేయకుండా ఉండటమే మేలు. ఒకవేళ చేద్దామంటే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంది. 


గర్భిణులు, పాలిచ్చే తల్లులు

చిన్న పిల్లల తల్లులు, గర్భిణులు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించకుండా ఉంటేనే మంచిది. చిన్నారులకు తల్లులు పాలు పట్టించాలంటే తప్పనిసరిగా మంచి ఆహారం స్వీకరించాలి. లేకపోతే సరైన మోతాదులో పాల ఉత్పత్తి జరగక చిన్నారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలానే గర్భిణులు కూడా ఉపవాసాలు పాటించకూడదు. గర్భంలోని శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే సరైన పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఉపవాసాలు పాటిస్తే ఇటు కాబోయే తల్లికి, అటు పుట్టబోయే శిశువుకు తీవ్ర సమస్యలు వస్తాయి. గర్భం ధరించాలని భావించే మహిళలు కూడా ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయకూడదు.


వ్యాధి నిరోధక శక్తి లోపించినవారు.. మందులు వాడేవారు

భోజనం తినక ముందు, తిన్న తర్వాత తప్పనిసరిగా మందులు వేసుకునేవారు ఉంటారు. లేకపోతే వారికి తల తిరగడం, కడుపులో వికారం కలుగుతాయి. అలాగే ఆహారంతోపాటు మందులు తీసుకునేవారూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను పాటించకూడదు. ప్రతిరోజూ మందుల రూపంలో అదనంగా విటమిన్స్‌ తీసుకునేవారు ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది. ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తి ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇది కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా లేనివారు కూడా ఇలాంటి ఫాస్టింగ్‌ చేయకూడదు. అలాగే క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలు ఉంటే సమయానికి మందులు, ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు కూడా ఉపవాసం చేయకుంటేనే మంచిది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని