Project Cheetah : అగమ్యగోచరంగా ‘ప్రాజెక్టు చీతా’.. కలవరపెడుతున్న మరణాలు!

‘ప్రాజెక్టు చీతా’ (Project Cheetah) ద్వారా భారత (India) గడ్డపై అడుగుపెట్టిన చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. తాజాగా మూడు కూనలు సైతం చనిపోవడంతో ఈ నేలపై వాటి సంతతి అభివృద్ధి చెందడం సాధ్యమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.

Updated : 28 May 2023 13:18 IST

గతేడాది సెప్టెంబరు 17న నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చీతాను మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) కునో నేషనల్‌ పార్క్‌లో వదిలిపెట్టారు. అది నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అందులో మూడు ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక మరణించాయి. అవన్నీ సాధారణ మరణాలేనని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ దేశంలో చీతా (Cheetah) కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి 11 మంది సభ్యులతో అత్యున్నతస్థాయి స్టీరింగ్‌ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీకి ‘గ్లోబల్‌ టైగర్‌ ఫోరమ్‌’ సెక్రటరీ జనరల్‌ రాజేశ్‌ గోపాల్‌ నేతృత్వం వహించనున్నారు.

ఏమిటీ ‘ప్రాజెక్టు చీతా’?

‘ప్రాజెక్టు చీతా’ ద్వారా 74 ఏళ్ల తర్వాత దేశంలోకి మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అందుకే భారత్‌ చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు ప్రత్యేక విమానంలో వాటిని తీసుకొచ్చి వదిలారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని చీతాలను రప్పించాలని ప్రణాళిక రచించారు. 

పులులు, సింహాలు సంచరిస్తున్న స్థాయిలో చీతాలు కూడా వాటి సంతతితో స్వేచ్ఛగా తిరుగాడాలనేది ‘ప్రాజెక్టు చీతా’ ప్రధాన ఉద్దేశం. కునోలో ప్రస్తుతం 17 చీతాలున్నాయి. అందులో ఆరింటిని మాత్రమే బయటకు విడిచిపెట్టారు. మిగిలిన వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఎన్‌క్లోజర్లలో ఉంచారు. భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడే వరకు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం చీతాలను బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెట్టాలని ప్రణాళిక రచించారు. అన్ని చీతాల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వాటికి రేడియో-కాలర్స్‌ను అమర్చారు. ఇంతలోనే వరుసగా చీతాల మరణాలు సంభవిస్తున్నాయి.

కూనలు ఎలా చనిపోయాయి?

ఈ నెల 23న అధికారులు కూనలను ట్రాక్‌ చేయగా అందులో ఒకటి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు. అది తల్లి వద్దకు చేరుకునే స్థితిలో కూడా లేదని గమనించి పశు వైద్యులతో చికిత్స చేయించేందుకు యత్నించారు. ఇంతలోనే అది మృత్యువాత పడింది. మిగిలిన మూడు చిరుతల పరిస్థితిని సమీక్షించగా అవి అనారోగ్యం బారిన పడినట్లు తేలింది. రెండు కూనలు బలహీనంగా ఉండటంతోపాటు, బరువు తక్కువగా ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే అవి కూడా చనిపోయాయి. ‘అధిక వేడి, పోషకాహార లోపం కారణంగానే అవన్నీ చనిపోయినట్లు’ పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మిగిలిన ఒక్క కూన బలహీనంగా ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటోంది. దాన్ని ఒక నెల పాటు ప్రత్యేక ప్రదేశంలో పెంచి.. తరువాత తల్లి దగ్గర వదిలి పెట్టాలనే ఆలోచనలో అధికారులున్నారు.

మరణాల శాతం ఎక్కువే

భారత్‌లో జన్మించిన నాలుగు చీతా కూనల్లో మూడు ఇప్పటి వరకు మరణించాయి. ఇక పెద్ద వాటిలోనూ మూడు చీతాలు మరణించాయి. ఈ నెల ప్రారంభంలో మగ చీతాలతో జరిగిన సంఘర్షణలో ఆడ చీతా ‘దక్ష’ తీవ్రంగా గాయపడి మరణించింది. అంతకుముందు శాషా, ఉదయ్‌ అనే చీతాలు మూత్రపిండ, హృదయ సంబంధ వ్యాధులతో మరణించాయి. అడవిలో సంచరించే పులులు, సింహాలతో పోలిస్తే చీతా పిల్లల మరణాల శాతం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చీతాల మరణాలు.. అధికంగా వేటాడటం, తల్లి విడిచిపెట్టడం వల్ల జరుగుతాయని గతంలో నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న చాలా చీతాలు ఎన్‌క్లోజర్లలోనే ఉన్నందున ఆ ప్రమాదం ఉండదని భావిస్తున్నారు. ఇక నమీబియా చీతా తొలిసారి కూనలకు జన్మనిచ్చిందని, దానికి పిల్లలను పెంచడంలో అనుభవం లేకపోవడం వల్ల కూడా మరణాలు సంభవించి ఉంటాయని అనుమానిస్తున్నారు.

అధికారుల నిర్ణయంపై విమర్శలు

గతేడాది సెప్టెంబరులో 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి రప్పించారు. ఏడాది కల్లా వాటిలో సగం జీవించి ఉన్నా ఈ ‘ప్రాజెక్టు చీతా’ విజయవంతమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా లోపాలున్నాయని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. అందులో ఒకటి కునోలోనే 20 చీతాలను ఉంచడం. అక్కడున్న కొద్దిపాటి ప్రదేశం చీతాలు స్వేచ్ఛగా సంచరించడానికి అనుకూలంగా లేదని చెబుతున్నారు. పైగా ఆహార కొరత కూడా ఉంటుందని విమర్శిస్తున్నారు. కొన్ని జంతువులను రాజస్థాన్‌లోని ముకుందర రిజర్వ్‌కు తరలించాలని సలహా ఇస్తున్నారు. అయితే ఈ సలహాలను నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ అధికారులు తోసిపుచ్చుతున్నారు. కునో సామర్థ్యం ఎక్కువేనని, భవిష్యత్తులో రాబోయే చీతాలను మాత్రమే వేరొక చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని