ప్రతిదానికీ ‘సారీ’ చెబుతారేంటో..!

సాధారణంగా మనవల్ల ఏదైనా పొరపాటు జరిగినా, ఎదుటివాళ్లకి ఇబ్బంది కలిగినా వెంటనే సారీ చెబుతాం. పొరపాటుకు క్షమించమని అడగడం అనేది సంస్కారం. సారీ చెబితే ఎదుటివాళ్లు మన్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సారీ అనే పదం

Updated : 23 Feb 2024 11:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా, ఎదుటివాళ్లకి ఇబ్బంది కలిగినా వెంటనే సారీ చెబుతాం. పొరపాటుకు క్షమించమని అడగడం సంస్కారం. సారీ చెబితే ఎదుటివాళ్లు మన్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సారీ అనే పదం ఎంతో విలువైనదిగా భావిస్తాం. కానీ, కెనడా ప్రజలకు సారీ అనే పదం ఒక ఊతపదంలా మారిపోయింది. వారి తప్పు ఉన్నా లేకున్నా.. ఎదుటివాళ్లకు సారీ చెప్పేస్తుంటారు. దీంతో అక్కడి ప్రభుత్వం సారీ చెప్పడాన్ని కట్టడి చేసేందుకు ఒక చట్టం తీసుకురావడం మరింత విడ్డూరం!

విస్తీర్ణం పరంగా అతి పెద్ద దేశాల్లో కెనడా ఒకటి. 3.76 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎక్కడ చూసినా సారీ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. హోటల్‌లో వెయిటర్‌ను ఏదైనా అడగాలన్నా ముందుగా సారీ చెప్పి తమకు కావాల్సింది అడుగుతారు. నిజానికి వెయిటర్‌ ఉన్నదే మనకు కావాల్సిన ఆహార పదార్థాలను అడిగి తెప్పించుకోవడానికి. అయినా కెనడియన్లు సారీ చెబుతారు. వాహనంపై వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే.. మనమయితే ఇంట్లో చెప్పి వచ్చావా? అంటూ మండిపడతాం. కానీ, కెనడాలో అడ్డొచ్చినవారికే సారీ చెప్పి మన్నించమంటారు. ఇలా ప్రతి చోటా తమవైపు తప్పు ఉన్నా.. లేకున్నా సారీ చెబుతూ అదో జాతీయ పదంగా మార్చేశారు. ఇలా అయిన దానికి కానిదానికి క్షమాపణ అడగడానికి పలు కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

అందుకే చెబుతారా?

బ్రిటీష్‌ పాలకులకు చాలా కాలం కెనడాను పరిపాలించారు. ఆ సమయంలో సారీ పదం అక్కడి ప్రజలకు అలవాటైంది. జీవించు.. జీవించనివ్వు అనే సిద్ధాంతంతో కెనడియన్లు ఉంటారు. అందుకే ఎదుటివాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సారీ చెబుతుంటారట. ఒకసారి నిర్వహించిన పరిశోధనలో ఓ అమ్మాయి కెనడాలోని ఓ బ్రిటీష్‌ షాపింగ్‌ మాల్‌లో పలువురిని కావాలనే రాసుకుంటూ వెళ్లింది. అయితే తప్పు వాళ్లది కాకున్నా ఆమెకు తగిలిన వారిలో 80శాతం మంది సారీ చెప్పారట. కెనడా ప్రజలు ప్రశాంతంగా, ఎలాంటి గొడవలూ లేకుండా జీవించడానికి ఇష్టపడతారు. అందుకే ఏదైనా పొరపాటు తమ వల్ల జరిగినా, జరగకపోయినా ఎదుటివాళ్లకు క్షమాపణ చెబుతుంటారు. సారీ చెప్పకపోతే ఎదుటివాళ్లకు కోపం వచ్చి.. గొడవ జరిగి.. తద్వారా శతృత్వం పెరిగి.. పోలీసులు, కోర్టులకు వెళ్లడం.. ఇవన్నీ ఎందుకని సారీ చెప్పి గొడవ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారట. ఆ దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా సారీ చెబుతారని ఓ సర్వేలో వెల్లడైంది. 

జాతీయ అసంకల్పిత చర్య..

యూఎస్‌లో ఎవరైనా సారీ చెబితే.. అదో అసమర్థ పనిగా భావిస్తారట. కానీ, కెనడాలో ప్రతిదానికి సారీ చెప్పేస్తుంటారు. దీంతో క్షమాపణ చెప్పడం జాతీయ అసంకల్పిత చర్యగా నిపుణులు అభివర్ణిస్తుంటారు. అందుకే కెనడాలోని పలు ప్రావిన్స్‌ల్లో 2009లో ఒక చట్టం తీసుకొచ్చారు. ‘అపాలజీ యాక్ట్‌’గా పిలిచే ఈ చట్టంలో సారీ పదం ఏయే విషయాల్లో వర్తిస్తుంది..? వేటికి సారీతో సరిపెట్టొచ్చు? వేటికి సారీ చెప్పినా శిక్షలు పడాలి? వంటి అంశాలను పొందుపర్చారు. విడ్డూరంగా ఉంది కదూ!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని