TikTok : ‘టిక్‌టాక్’ ఏం చేస్తోంది.. దానిపై నిషేధాలు ఎందుకు?
యూజర్లలో బాగా ఆదరణ పొందిన సామాజిక మాధ్యమం టిక్‌టాక్‌పై ఇప్పటికే కొన్ని దేశాలు నిషేధం విధించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
టిక్‌టాక్.. చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమం(social media) మొత్తం ఆధునిక సమాజాన్ని షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 100 కోట్లకు పైగా యూజర్లున్నారు(users). ఇటీవలి కాలంలో అమెరికా(america), యూరప్, కెనడా తదితర దేశాల్లో టిక్‌టాక్‌కు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. షార్ట్ వీడియో యాప్(app)గా ప్రజల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్(TikTok) మాతృసంస్థ చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్(bytedance)కు చెందినది కావడమే ఆ దేశాల అందోళనకు అసలు కారణం.
అమెరికాలోని ప్రభుత్వ పరికరాల్లో 30 రోజుల్లోగా ఆ యాప్‌ను పూర్తిగా తొలగించాలని వైట్‌హౌస్(white house) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కెనడా, ఐరోపాలు కూడా అధికారిక పరికరాల నుంచి ఆ యాప్‌ను తీసేయాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా పౌరులు సైతం టిక్‌టాక్ ఉపయోగించకుండా పూర్తిగా నిషేధం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 10 కోట్లకు పైగా యూజర్లు టిక్‌టాక్ వాడుతున్నారు.
దేశాల ఆందోళన ఎందుకు?
టిక్‌టాక్ కార్యకలాపాలు మొత్తం దాని మాతృసంస్థ బైట్‌డాన్స్ నుంచే సాగుతాయి. చైనాకు చెందిన ఈ సంస్థ వద్ద ప్రపంచంలోని ప్రతి యూజర్ డేటా ఉంటుంది. కొన్నిసార్లు అనూహ్య చర్యలకు పాల్పడే డ్రాగన్ ఆ డేటాను దుర్వినియోగం చేసే వీలుందని కొందరు నాయకులు, సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా(Data) ఉపయోగించి ఏ యూజర్ ఏ ప్రదేశంలో నివాసం ఉంటున్నారో కూడా చైనా ప్రభుత్వం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధికారులు అక్కడి సంస్థల నుంచి రహస్యంగా ఆ డేటా పొందే ప్రమాదం లేకపోలేదు. టిక్‌టాక్ ద్వారా చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను టిక్‌టాక్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోంది. అటువంటి సందేహాలు అవసరం లేదని.. తమ యూజర్ల డేటా ఎల్లప్పుడూ భద్రంగా ఉంటుందని చెబుతూ వస్తోంది.
మన దేశంలోనూ..
భారత్‌లోనూ టిక్‌టాక్‌కు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ యాప్‌ను వాడే యూజర్ల సంఖ్య అనతి కాలంలోనే కోట్లకు చేరింది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత చోటు చేసుకున్న తరువాత 2020 మధ్య కాలంలో 59 చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. అందులో టిక్‌టాక్ కూడా ఒకటి. భారత యూజర్ల డేటా మొత్తం బయటి దేశాల సర్వర్లకు(server) ఈ యాప్‌లు పంపుతున్నాయని భారత్ అనుమానం వ్యక్తం చేసింది. తైవాన్, అఫ్గాన్ దేశాలు టిక్‌టాక్‌పై పూర్తి నిషేధం విధించగా.. పాకిస్థాన్ తాత్కాలికంగా నాలుగు సార్లు టిక్‌టాక్ సర్వీసును నిలిపివేసింది.
అమెరికాలో బ్యాన్ చేస్తే..
గతేడాది నవంబరు నుంచే అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్ వినియోగాన్ని బ్యాన్ చేశాయి. కొన్ని కళాశాలలు, టెక్సాస్, ఆబర్న్, బోయిస్ వంటి యూనివర్సిటీలు తమ క్యాంపస్ పరిధిలో వినియోగించే వైఫైలో టిక్‌టాక్ రాకుండా చేశాయి. యూఎస్ ఆర్మీ, మెరైన్ పోలీసులు, వాయుసేన అధికారులు, తీర రక్షక దళాలు వినియోగించే పరికరాల్లో యాప్‌పై మూడేళ్లుగా బ్యాన్ కొనసాగుతోంది. మిగతా యూజర్లు స్వేచ్ఛగా టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. విద్యార్థులు తమ సొంత డేటాను ఖర్చు చేసి మరీ టిక్‌టాక్ వాడుతున్నారు.
టిక్‌టాక్‌ను అమెరికాలో పూర్తిగా నిషేధించే బిల్లును ఆమోదించడానికి అక్కడి చట్ట సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ట్రంప్ హయాంలోనూ అలాంటి ప్రయత్నం చేయగా.. కోర్టు దాన్ని అడ్డుకుంది. టిక్‌టాక్ మాత్రమే కాకుండా రష్యా, ఇరాన్ దేశాలకు సంబంధించిన సామాజిక మాధ్యమాలను కూడా అమెరికాలో వినియోగించకుండా చట్టం చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే న్యాయపరంగా ప్రభుత్వానికి కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. టిక్‌టాక్‌ను కేవలం సాధారణ పౌరులే కాదు.. అమెరికా చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ పత్రికా సంస్థలు కూడా వాడుతున్నాయి.
టిక్ ‘టాక్’ ఏంటి?
తమ యాప్‌పై నిషేధం విధిస్తారనే వార్తలపై టిక్ టాక్ స్పందించింది. అదంతా ఓ ‘రాజకీయ డ్రామా’గా అభివర్ణించింది. అమెరికా ప్రజలపై సెన్సార్ విధించేందుకు కొందరు చట్టసభల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.
యూజర్ల మద్దతు
ఫేస్‌బుక్(Face book), ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లాగే టిక్‌టాక్ కూడా యూజర్ల డేటా సేకరిస్తోందని అందులో ఎలాంటి తప్పు లేదని కొన్ని డిజిటల్ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. టిక్‌టాక్‌పై బ్యాన్ ప్రయత్నాలు ఆపాలని హౌస్ ఫారెన్ ఎఫైర్స్ కమిటీకి ‘ది అమెరికన్ సివిల్ లిబర్టీస్’ లేఖ రాసింది. టిక్‌టాక్‌ను తొలగిస్తే యూజర్లకు మాత్రమే నష్టం కాదని, మార్కెట్లు, డిజిటల్ క్రియేటర్లకు కూడా నష్టం వాటిళ్లుతుందని.. బ్యాన్ నిర్ణయం రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై