Hunger : ప్రపంచవ్యాప్తంగా ఆకలి రాజ్యాలు ఎందుకు పెరుగుతున్నాయంటే..!
ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని (World Hunger Day) ఏటా మే 28న నిర్వహిస్తారు. ఆకలి బాధలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును వినియోగించుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా (World) ఆకలి రాజ్యాలు పెరుగుతున్నాయి. సుమారు 828 మిలియన్ల ప్రజలు.. అంటే జనాభాలో 10 శాతం మంది తిండి కోసం అలమటిస్తున్నారు. ప్రతి రాత్రి ఖాళీ కడుపుతో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆకలి (Hunger) బాధితుల సంఖ్య 46 మిలియన్లు ఎగబాకినట్లు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆకలితో బాధపడుతున్న వారిలో మూడింట రెండవ వంతు మంది మహిళలు (Women). సుమారు 80 శాతం మంది వాతావరణ మార్పులకు గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆకలి స్థాయిలు గురించి అవగాహన కల్పించేందుకు ‘ది హంగర్ ప్రాజెక్ట్’ అనే లాభరహిత సంస్థ మే 28ని ‘ప్రపంచ ఆకలి దినోత్సవం’గా (World Hunger Day) ప్రకటించింది.
ఆకలి అనేది పేదరికంతో ముడిపడి ఉన్న సమస్య. చాలా మంది ప్రజలు ఆకలితో మగ్గిపోవడానికి పలు కారణాలున్నాయి. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, సంఘర్షణలు, పేదరికం, పోషకాహారం లేకపోవడం ఇలాంటివన్నీ ఆ కోవలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఆకలితో జీవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మేధో పరమైన లోపాలు ఉత్పన్నమవుతాయి. రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ తక్కువ క్యాలరీల్లో తీసుకోవడాన్ని పోషకాహార లోపంగా పరిగణిస్తారు. 2018 వరకు ఆకలి సూచీలో తగ్గుదల కనిపించింది. అయితే 2019-2021 మధ్య కాలంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 150 మిలియన్లు పెరిగింది. సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక మందగమనం సహా కొవిడ్ మహమ్మారి ప్రబలడం కూడా ఈ పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.
‘ఆకలి’ బాధలకు ప్రధాన కారణాలు
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార ధరల సూచీ ప్రకారం 2019-2022 మధ్య కాలంలో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి. 95.1 పాయింట్లుగా ఉన్న సూచీ 143.7 పాయింట్లకు చేరింది. ఇది వివిధ ఆహార ఉత్పత్తులను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. వాటిలో చక్కెర, మాంసం, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఆహార వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అయితే వీటి పెరుగుదల ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. కొన్ని దేశాలు ఉత్పత్తులపై వినియోగదారులకు సబ్సిడీలు ఇస్తుంటాయి. ప్రపంచ మార్కెట్ ఆధారంగా ఆ సబ్సిడీల హెచ్చుతగ్గులను నిర్ణయిస్తాయి.
- తాజా యూఎన్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ నూట్రీషియన్ ఇన్ ది వరల్డ్ నివేదిక ప్రకారం 2021లో 425 మిలియన్ల ఆసియా జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆఫ్రికాలో 278 మిలియన్ల జనాభా పోషకాహార లోపానికి గురయ్యారు.
- ఒక వ్యక్తికి తగినంత ఆహారం లభించకపోవడం వల్ల వారి జీవితం, జీవనోపాధి తక్షణమే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి స్థితి 2022లో గణనీయంగా పెరిగింది. ఆహార సంక్షోభంపై 2023లో ప్రచురించిన గ్లోబల్ రిపోర్ట్‌లో 258 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
- 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ఆహార ధాన్యాలు, నూనెగింజలు,ఎరువుల పెరుగుదలకు కారణమైంది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో తేడా రావడం వల్ల వీటి ధరలు విపరీతంగా పెరిగాయి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
-
Weather Update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
-
‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’
-
అక్టోబరు 23న విశాఖకు సీఎం జగన్..!