Published : 10/08/2021 15:55 IST

Gold Price: బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబడులు పెట్టాలంటే స్థిరాస్తి రంగం, బంగారం, స్టాక్‌మార్కెట్లు, డిపాజిట్లు లాంటి మార్గాలు ఉన్నాయి.  స్థిరాస్తి రంగంలో పెట్టాలంటే భయపడే మదుపర్లు కొందరు ఉంటారు. ఇక స్టాక్‌ మార్కెట్లు రిస్క్‌తో కూడుకున్నవి కావడంతో, భద్రత కోరుకునేవారు బంగారాన్ని పెట్టుబడికి మంచిమార్గంగా ఎన్నుకుంటారు. ఎందుకంటే బంగారం రేటు దారుణంగా పడిపోవడం అంటూ ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ల వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో  ప్రస్తుతం పెట్టుబడులకు మంచి అవకాశంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.  కానీ, ఇంతకీ ఈ బంగారం విలువైన లోహంగా ఎందుకు మారింది? బంగారానికి విలువను ఎవరైనా నిర్ణయిస్తారా?

సంపదను కొలిచే సాధనం!

కరెన్సీ తర్వాత సంపదను కొలిచేందుకు ఉపయోగపడే అత్యుత్తమ సాధనం బంగారమే. కొన్ని వేల సంవత్సరాలుగా బంగారం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పట్లో బంగారాన్ని వెలికి తీసి శుద్ధి చేయడం సులభమే. కానీ ఇంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందని  రోజుల్లో బంగారాన్ని భూమి నుంచి వెలికితీయడం చాలా కష్టంతో కూడుకున్న పని.  బంగారాన్ని ఎన్నాళ్లు దాచుకున్నా తుప్పు పట్టదు, బరువు తగ్గదు. ఎలాంటి మార్పునకు గురవ్వదు.  దాంతో లోహాల్లోకెల్లా పసిడికి విశేషమైన స్థానం దక్కింది.  బంగారం కోసం యుద్ధాలు, దోపిడీలు జరిగిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. 

బంగారం ఉంటే చేతిలో కరెన్సీ ఉన్నట్లే!

బంగారం ఉంటే వెంటనే డబ్బు కావాలంటే దాన్ని తాకట్టు పెట్టి, అరగంటలో అప్పు పుట్టించవచ్చు. లేదా అప్పటి మార్కెట్‌ రేటు ప్రకారం అమ్ముకోవచ్చు.  కానీ స్థిరాస్తుల్లాంటి పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. సరైన ధర వచ్చేంతవరకూ వేచి చూడాల్సి ఉంటుంది. భూమిని, ఇంటిని తాకట్టు పెట్టాలన్నా చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. ఎన్నో డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. కొన్నిసార్లు అవసరం మేరకు తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది.

ఆభరణాలా.. బాండ్ల రూపంలో కొనుగోలు చేయాలా?

ప్రతి ఒక్కరూ బంగారాన్ని  ఆభరణాలుగా ధరించడం ఉంది. కానీ, బంగారాన్ని ఆభరణాల రూపంలో  కంటే బాండ్ల రూపంలో కొనడమే మేలంటారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే ఆభరణాలను మార్చుకునేటప్పుడు తరుగు, తయారీ ఛార్జీలు ఉంటాయి.  అదే బాండ్లయితే, వాటిమీద వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాక, మెచ్యురిటీ తేదీనాటికి మార్కెట్‌లో ఉన్న విలువ ప్రకారం డబ్బు లెక్కగట్టి ఇస్తారు.

బంగారం ధరను ఎవరైనా నిర్ణయిస్తారా?

చాలామందికి బంగారం ధర ఎలా నిర్ణయమవుతుందో తెలియదు. ఆర్‌బీఐ, లేదా అంతర్జాతీయ సంస్థలు వాటి ధరలను కాలానుగుణంగా నిర్ణయిస్తాయేమో అనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు.  పుత్తడి ధరను ఏ సంస్థ కూడా నిర్ణయించదు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వచ్చిపడ్డాక ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. డోలాయమాన ఆర్థిక పరిస్థితులు తలెత్తడంతో   మదుపరులు  బంగారంలో పెట్టుబడులు పెట్టసాగారు. దాంతో డిమాండ్‌ పెరగడంతో బంగారం ధర కూడా పెరిగిందంటారు నిపుణులు.  పసిడిని వెలికితీసి, శుద్ధీకరించేందుకు అయ్యే ఖర్చు, శ్రమ, సమయాన్ని బట్టి దాని ధర నిర్ణయమవుతుంటుంది. కానీ బంగారం నిల్వలు తక్కువగా ఉండి, దానికోసం ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, దాని ఉత్పత్తి చేసేందుకు అయిన వ్యయం కంటే చాలా ఎక్కువ ధర పలుకుతుంది.  ఇతర లోహాల్లా బంగారం విరివిగా దొరక్కపోవడంతో, దాన్ని కొనుక్కునేందుకు తీవ్రమైన పోటీ ఉంటుంది.  అలాగే బంగారాన్ని ఎన్నేళ్లపాటు దాచుకున్నా ఎలాంటి మార్పు ఉండదు. తుప్పు పట్టదు. నల్లబడదు. కాబట్టి అది అరుదైన లోహంగా మిగిలిపోయింది. దాంతో అనాదిగా బంగారానికి ఇతర లోహాలకంటే ఎక్కువ ధర ఉంటోంది.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని