Gold Rate : బంగారం ఓ భరోసా.. ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా!
భారత్‌లో పసిడికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ప్రపంచంలో ఏ మార్పు సంభవించినా దాని ప్రభావం ధరలో ప్రతిబింబిస్తుంది. అసలు బంగారం విలువను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
తాజాగా 10 గ్రాముల మేలిమి బంగారం(Gold) ధర రూ.61 వేలను దాటిపోయింది. ఈ మధ్య కాలంలో బంగారం ధర (Gold Rate) విపరీతంగా పెరుగుతోంది. భారతీయ సంస్కృతిలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు ఏవి జరిగినా ఆ వేడుకలో బంగారం ధగధగ మెరుస్తూ ఉంటుంది. మొదట్లో మోజుతో దాన్ని కొన్నప్పటికీ.. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఇంట్లో బంగారం (Gold) ఉంటే ఓ భరోసా ఇస్తుందనే నమ్మకం చాలా మందికి ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టే కొన్నేళ్లుగా బంగారం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటోంది.
అంతర్జాతీయ పరిణామాలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం, తాజాగా అమెరికా(America), స్విట్జర్లాండ్‌లలో బ్యాంకులు దివాలా తీయడం ఇలాంటి ఘటనలు ఏవి జరిగినా మన దేశంలో బంగారం ధర కొండెక్కి కూర్చుంటుంది. బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టే ఈ పరిస్థితి వస్తుంది. మార్కెట్లో బంగారం విలువ పెరిగితే మన ఇంట్లో ఉన్న బంగారు నగల విలువ కూడా పెరిగినట్లవుతుంది. ఏదైనా దేశంలో రాజకీయ తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ కరెన్సీ విలువ పతనమవుతుంది. స్టాక్ మార్కెట్లు(stock market) నష్టాలబాట పడతాయి. కానీ, విచిత్రంగా బంగారానికి మాత్రం డిమాండ్ ఏర్పడి దాని ధర పెరుగుతుంది. అందువల్లే బంగారాన్ని ‘సంక్షోభంలో ఆదుకునే వస్తువు’గా పిలుస్తుంటారు.
బ్యాంకుల్లో బంగారం నిల్వలు
చాలా దేశాలు తమ ప్రధాన బ్యాంకుల్లో నగదు నిల్వలతోపాటు, బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. భారత్‌లోని బ్యాంకులన్నీ దాదాపుగా బంగారంపై రుణాలిస్తున్నాయి. తమ దగ్గరున్న నగదును ఖాతాదారులకు ఇచ్చి వడ్డీ రూపంలో ప్రయోజనం పొందుతున్నాయి. ఇలా బ్యాంకులు బంగారాన్ని సేకరించడం వల్ల కూడా ధర పెరుగుతోంది. బ్యాంకుల్లో కిలోల కొద్దీ బంగారం పోగవడంతో.. బయట మార్కెట్లో నగదు పెట్టి ఏవైనా నగలు కొనాలని వెళితే అక్కడ తగినంత ముడి బంగారం దొరకట్లేదు. దాంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
ద్రవ్యోల్బణం
గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధర నిలకడగా పెరుగుతూ వస్తోంది. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది. అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుంటారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. దాంతో ధర పెరుగుతుంది.
బంగారు దుకాణాలు
వేడుక ఏదైనా భారతీయులకు బంగారం కొనడం ఒక అలవాటుగా మారిపోయింది. దాంతో దుకాణాల్లోని బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. బంగారాన్ని కేవలం నగల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలోనూ వాడుతున్నారు. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. దిగుమతి చేసుకుంటున్న బంగారంలో 12శాతం పారిశ్రామిక అవసరాల కోసం వెళ్తున్నట్లు సమాచారం.
అధిక వడ్డీ రేట్ల నుంచి భరోసా
అవసరాల కోసం స్వల్ప, భారీ మొత్తాల్లో అప్పులు చేయడం సహజం. బయటి వ్యక్తులు, బ్యాంకుల వద్ద ఏ రుణం తీసుకున్నా దాదాపుగా అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అదే ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది. ఆపద సమయాల్లో బయట రుణాలు తీసుకోవడం కంటే బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టడం లాభదాయకమని చాలా మంది భావిస్తున్నారు. అందుకే చేతిలో భారీగా నగదు ఉన్నప్పుడు బంగారం కొంటున్నారు. అత్యవసర సమయాల్లో దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు పొందుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే..!
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Movies News
Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్ హాసన్
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్స్టర్ హత్య..!