Volcano : అగ్ని పర్వతాన్ని ఆరాధించే పండగ ‘యడ్‌న్యా కసాడా’

ప్రపంచవ్యాప్తంగా (World wide) దేవుళ్లను (God) వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. అలా ఇండోనేసియాలో (Indonesia) ఓ అగ్ని పర్వతాన్ని (Volcano) దేవుళ్లకు ప్రతిరూపంగా ఆరాధిస్తున్నారు. ఏటా యడ్‌న్యా కసాడా పర్వదినాన అక్కడకు వెళ్లి మొక్కులు చెల్లిస్తున్నారు. ఆ సంగతేంటో చదివేయండి. 

Published : 07 Jun 2023 17:12 IST

ఇండోనేసియాలోని (Indonesia) మౌంట్‌ బ్రోమో (Mount Bromo) అగ్నిపర్వతం పరిసరాలు సోమవారం నాడు టెంగరీ తెగ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ‘యడ్‌న్యా కసాడా’ పర్వదినాన అగ్నిపర్వతానికి మొక్కులు చెల్లించుకోవడం గత కొన్ని శతాబ్దాలుగా వారికి ఆనవాయితీగా వస్తోంది. మేకలు, కోళ్లు, కూరగాయలు, పండ్లు, బియ్యం ఇలా తమకు తోచినవన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ వాటిని మండుతున్న బిలంలోకి విసిరేస్తారు. 

బ్రహ్మ పర్వతమే ‘బ్రోమో’!

అగ్నిపర్వతానికి ‘బ్రోమో’ అనే పేరు సృష్టికర్త అయిన బ్రహ్మ పేరు మీదుగా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బ్రోమో టెంగర్ సెమెరు నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో ఇదో అగ్నిపర్వతం. 2019లో ఒకసారి భారీ విస్ఫోటనం చెందింది. దాంతో భూకంపం సంభవించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ శిఖరం వద్ద గణపతి విగ్రహం కూడా ఉంటుందట. వందల ఏళ్లుగా తమను గణపతి దేవుడు రక్షిస్తున్నాడనేది టెంగరీస్‌ హిందువుల విశ్వాసం. బ్రోమో పర్వతం చుట్టుపక్కలి 48 గ్రామాల్లో కలిపి సుమారు 3 లక్షల మంది నివాసం ఉంటున్నారు. 

కొండల్లో నివసిస్తున్న టెంగర్‌ తెగ ప్రజలు సంవత్సరానికి ఒకసారి ఈ పర్వదినాన అగ్నిపర్వతం దగ్గర సమావేశమవుతారు. తూర్పు జావాలో నివసించే తమ తెగకు అదృష్టం కలిసి వచ్చేలా చూడాలని ప్రార్థనలు చేస్తారు. ఏటా ‘కసాడ’ నెలలో వచ్చే 14వ రోజున పండగ నిర్వహిస్తారు. సంప్రదాయ టెంగర్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజు వస్తుంది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 నుంచి ఇక్కడ పండగ వాతావరణం కనిపించలేదు. ఈ సారి ఆ నిబంధనలు పూర్తిగా తొలగించడంతో వేలాది మంది తరలివచ్చారు.

పిల్లలు కలుగలేదని..

ఈ పండగకు మూలం 15వ శతాబ్దంలో.. మజాపహిత్‌ రాజ్యంలో ప్రారంభమైనట్లు ఓ జానపద సాహిత్యం తెలుపుతోంది. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలుగకపోవడంతో యువరాణి రోరో ఆంటెంగ్‌, ఆమె భర్త బ్రోమో పర్వతంపై ధ్యానం చేస్తూ దేవుళ్లను వేడుకున్నారట. తరువాత 25 మంది సంతానం కలుగగా అందులో ఒకరిని మౌంట్‌ బ్రోనో అగ్నిపర్వతంలోకి విసిరేస్తామని మొక్కుకున్నారట. తల్లిదండ్రుల మొక్కు తీర్చడం, టెంగర్‌ ప్రజల శ్రేయస్సు కోసం ఓ చిన్నారి ఇష్టపూర్వకంగానే అగ్నిపర్వతంలోకి దూకాడనే కథ ప్రచారంలో ఉంది. 

ఎందుకీ నైవేద్యాలు?

దేవుడు ప్రసాదించిన వాటిలో కొంత భాగాన్ని తిరిగి దేవుడికే నైవేద్య రూపంలో పెడితే.. ఆయన తమపై మరింత కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం. అందుకే పది ఆవులున్న యజమాని ఒక ఆవును, కోళ్లున్న వారు ఒక కోడిని ఇలా రకరకాలుగా తాము జీవనోపాధి పొందుతున్న వాటిని నైవేద్యంగా సమర్పించడానికి తీసుకొస్తారు. ఈ టెంగర్‌ తెగ ప్రజలు అగ్నిపర్వతంలో విసిరినవి పట్టుకోవడానికి కొంతమంది వలలు అడ్డు పెడుతుంటారు. అగ్నిపర్వతం అంచున నిలబడి, ప్రాణాలకు తెగించి వారు ఆ సాహసం చేస్తారు. నిజానికి మండుతున్న బిలం, అగ్నిపర్వత శిఖరం అంచు మధ్య చాలా దూరం ఉంటుంది. కాబట్టి భక్తులు సమర్పించే నైవేద్యాలన్నీ మధ్యలోనే పడుతుంటాయి. వాటిని సేకరించి తీసుకుపోవడానికి టెంగర్‌ తెగ కాని వారు పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు ఆవులు, మేకలు, కోళ్లు కూడా వారికి దొరుకుతాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని