Uttarakhand: ప్రమాద ఘంటికలు.. జోషిమఠ్‌ ఎందుకు కుంగిపోతోంది?

ఉత్తరాఖండ్‌లో మరోసారి అలజడి చెలరేగుతోంది. జోషిమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడటం అక్కడి అధికార యంత్రాంగాన్ని ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు ఈ పట్టణం కుంగిపోవడానికి కారణం ఏంటి?

Updated : 07 Jan 2023 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్: దేవ్‌భూమి ఉత్తరాఖండ్‌లో 2013 ప్రళయం తర్వాత మరోసారి అలజడి చెలరేగుతోంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అవి క్రమంగా పెద్దవై భవనాలు కూలిపోతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు, పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ ఎముకలు కొరికే చలిలోనే తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణాలను తెలుసుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అసలు జోషిమఠ్‌ ఎక్కడ ఉంది? దాని భౌగోళిక స్వరూపం, కుంగిపోవడానికి కారణాలేంటో తెలుసుకుందామా!

ఎక్కడ ఉంది?

జోషిమఠ్‌.. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ సానువుల్లో ఓ చిన్న పట్టణం. ప్రముఖ బద్రీనాథ్‌ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుడిని ఇక్కడికే తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. భారత్‌-చైనా సరిహద్దులో పహారా కాస్తున్న సైనికులకు, హిమాలయ యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఇదే బేస్‌ క్యాంప్‌. రిషీకేష్‌-బద్రీనాథ్‌ (ఎన్‌హెచ్‌-7) రహదారికి సమీపంలో ఉంటుంది. బద్రీనాథ్‌ సందర్శనకు వెళ్లిన చాలా మంది భక్తులు రాత్రి పూట ఇక్కడే బస చేస్తారు. అవులి, వ్యాలీ ఆఫ్‌ ప్లవర్స్, హేమకుండ్‌ సాహిబ్‌, తదితర ఎన్నో ప్రముఖ సందర్శన ప్రదేశాలు దీనికి దగ్గర్లోనే ఉంటాయి. అంతేకాకుండా భారతసైనిక దళాలకు ఇదో వ్యూహాత్మక పట్టణం. ధౌలిగంగా, అలకనంద నదుల సంగమ స్థానమైన విష్ణుప్రయాగకు చేరువలో ఉంటుంది. జోషిమఠ్‌లో అప్పుడప్పుడూ భూకంపాలు వస్తుంటాయి. చమోలీ జిల్లాకు ఆరు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్‌ జోన్‌(జోన్‌-5) పరిధిలో ఉంది.

భౌగోళిక స్వరూపమే కారణమా?

జోషిమఠ్‌కు ప్రమాదం పొంచి ఉందని భూగర్భశాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు. ఈ పట్టణం పురాతనమైన శిలలపై నిర్మితమై ఉందని, పైగా భూగర్భంలో జలప్రవాహం వల్ల నేల సామర్థ్యం క్షీణిస్తే.. కుంగిపోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ పట్టణం ఏటవాలు ప్రాంతంలో ఉందని, దీని వల్ల ఎప్పటికైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందని 1976లో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసి మిశ్రా కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఏటవాలు ప్రాంతంలో ఉండటం వల్ల నేలకు పటుత్వం తక్కువగా ఉంటుందని, పెద్ద పెద్ద నిర్మాణాలకు ఈ నేల సహకరించదని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. మరోవైపు ఇటీవల కాలంలో భవన నిర్మాణాలు పెరగడంతోపాటు వివిధ హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు విస్తరణ కోసం కొండలను తవ్వేయడం కూడా ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

విష్ణుప్రయాగ నుంచి వస్తున్న నదీ ప్రవాహాల ప్రభావం కూడా జోషిమఠ్‌పై పడుతోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు 2022లో ఈ ప్రాంతంలో ఓ పరిశోధన చేశారు. ఇక్కడి భూ గర్భంలో పెద్దపెద్ద రాళ్లతోపాటు, గ్నిసిక్‌ శిలలు ఉన్నట్లు తేల్చారు. ఈ గ్నిసిక్‌ శిలలు అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. వర్షాకాలంలో ఈ రాళ్లమధ్య తీవ్ర ఒత్తిడి ఏర్పడి భూ గర్భపొరల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ‘‘ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహాల వల్ల జోషిమఠ్‌లోని పర్వత సానువులు కోతకు గురవుతున్నాయి. నేల పొరల్లోకి నీరు చేరిపోయి. నేల పటుత్వం కోల్పోతోంది. అంతేకాకుండా జోషిమఠ్‌లోని మురుగునీటి వ్యవస్థ అత్యంత దుర్భరంగా ఉంది. వృథానీటిని బయటకి పంపడానికి సరైన మార్గాలు లేవు, దీనివల్ల కూడా నష్టం వాటిల్లుతోంది’’ అని వాడియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త స్వప్నమిత వైదేశ్వరన్‌ 2006లో తన నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు 2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రళయం కారణంగా.. అక్కడి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ఆ తర్వాత దానిని పునరుద్ధరించడంలోనూ అక్కడి ప్రభుత్వం వైఫల్యం చెందింది.

నష్టాన్ని నివారించాలంటే..!

జోషిమఠ్‌లో నష్టాన్ని నివారించాలంటే వెంటనే హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు అక్కడి స్థానికులను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. పట్టణం భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా టౌన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అంటున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు వృథా నీరు ఎక్కడికక్కడ ఇంకిపోకుండా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. నేల సామర్థ్యం పుంజుకునేలా చర్యలు చేపట్టాలని దీనికోసం బీఆర్‌వో లాంటి సైనిక సంస్థలతోపాటు పౌరులు కూడా ముందుకురావాలి కోరుతున్నారు.

చివరిగా..

జోషిమఠ్‌కు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమఠ్‌ ‌(జ్యోతిర్‌మఠ్‌). మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా. ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్‌ టెంపుల్‌, నార్సింగ్‌ ఆలయం, తపోవన్‌, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్‌ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్‌ క్యాంప్‌గా సహాయక చర్యలకు కూడా ఉపయోగించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని