Iphone : సెలబ్రిటీలు ఐఫోనే వాడతారెందుకు?
మన దేశంలో సినీ, రాజకీయ ప్రముఖులు, సోషలైట్స్ అందరి చేతుల్లోనూ దాదాపు ఐ ఫోనే (Iphone) కనిపిస్తుంటుంది. వారంతా ఐ ఫోన్ మాత్రమే ఎందుకు వాడుతున్నారో తెలుసుకోండి.
అమెరికా (America) దిగ్గజ కంపెనీ యాపిల్ (Apple) ప్రపంచంలోనే అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ రూపొందించిన ఏ ప్రొడక్ట్ లుక్ చూసినా విలాసవంతంగా.. ఖరీదైనదిగా కన్పిస్తుంది. ఐపాడ్, ఎయిర్‌పాడ్, ఐమ్యాక్, మ్యాక్‌బుక్, ఇయర్ బడ్స్, వాచ్ ఇలా ఏవైనా సరే అత్యుత్తమ ఫీచర్లతో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ధర ఎక్కువైనా ఆ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసే ఐ ఫోన్లను (Iphone) ఎక్కువ మంది సెలబ్రిటీలు కొనుగోలు చేస్తుంటారు. అందుకు గల కారణాలేవో పరిశీలించండి.
గోప్యత.. భద్రత
వినియోగదారుల డేటాకు భద్రత కల్పించడంలో యాపిల్ ఎలాంటి రాజీ పడదు. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా దాన్ని ఎవరు వినియోగించినా వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా చూస్తుంది. సెక్యూర్ డిజిటల్ (ఎస్డీ) కార్డులను కూడా ఈ కంపెనీ నమ్మదు. అందుకే ఆ ఐచ్ఛికం లేకుండానే ఫోన్లను తయారు చేస్తోంది. అంతే కాదు థర్డ్ పార్టీ యాప్‌లు కొన్ని ఆండ్రాయిడ్ యూజర్ల డేటాను తస్కరించడానికి యత్నిస్తుంటాయి. ప్రత్యేక అనుమతులు యూజర్ నుంచి తీసుకొని డేటా చౌర్యానికి పాల్పడుతుంటాయి. అలాంటి చర్యలను యాపిల్ సమర్థంగా అడ్డుకుంటుంది. యాపిల్ సైతం ఆపరేటింగ్ సిస్టమ్ ప్రయోజనాలకు తప్ప ఇతర విషయాల కోసం యూజర్ల డేటాను వాడుకోదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓఎస్‌లలో యాపిల్ అత్యుత్తమం. అది నమ్మకమైనది, భద్రమైనదని సైబర్ నిపుణులు చెబుతున్న మాట. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లను హ్యాక్ చేయడం దాదాపుగా అసాధ్యం. ఈ విషయంలోనే సెలబ్రిటీలు ఎక్కువగా ఐ ఫోన్‌లకు ఆకర్షితులవుతున్నారు.
ఫోన్లకు చెవులుంటాయి!
మనం వాడుతున్న చాలా స్మార్ట్ ఫోన్లు మన మాటలు వింటున్నట్లు సమాచారం. మీకూ ఈ అనుభవం ఎదురై ఉండొచ్చు. కొన్ని విషయాల గురించి ఇంట్లో, ఆఫీసులో, క్యాంటీన్లో ఎక్కడ మాట్లాడినా దానికి సంబంధించిన ఒక ప్రకటన వెంటనే మన ఫోన్‌లోని ఏదోక యాప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఇంతకు ముందెన్నడూ మాట్లాడని విషయం గురించి ప్రస్తావించినా దానికి సంబంధించిన ప్రకటన రావడం ఆశ్చర్యమే కదా? ఐ ఫోన్ యూజర్లకు ఈ అనుభవం దాదాపుగా ఎదురు కాలేదనే చెప్పవచ్చు.
యాపిల్ ఎకో సిస్టమ్
మనం వాడుతున్న ఫోన్, కంప్యూటర్, వాచ్ ఇలా అన్నీ యాపిల్ కంపెనీకి చెందినవే అయితే దాన్ని యాపిల్ ఎకో సిస్టం అని పిలుస్తారు. వీటన్నింటినీ ఒకదానికొకటి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోన్‌లోని సమాచారం కంప్యూటర్‌లోకి, వాచ్‌లోని సమాచారం ఫోన్‌లోకి సులభంగా మార్పిడి చేయొచ్చు. ఫోన్ దగ్గర్లో లేకపోయినా మ్యాక్‌బుక్‌లో నుంచి కాల్స్ మాట్లాడొచ్చు. ఇలాంటి సౌకర్యాలన్నీ యాపిల్ ఎకో సిస్టమ్‌లో లభిస్తాయి. వీటిలో ఏదైనా సమస్య తలెత్తితే కేవలం యాపిల్ సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా గోప్యత, భద్రత ప్రమాణాలు పాటిస్తూ వాటిని రిపేర్ చేస్తారు. మిగతా ఫోన్ యూజర్లు ఎక్కడికైనా వెళ్లి రిపేర్ చేయించుకోగలుగుతారు కానీ.. అందులోని సమాచారం అక్కడి సిబ్బంది ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా గుర్తించే అవకాశం ఉండదు.
కెమెరా పని తీరుకు ఫిదా
ఐఫోన్‌లో కెమెరాకు విశిష్ట స్థానం ఉంది. సెలబ్రిటీలు తమ ఐ ఫోన్‌తో మిర్రర్ సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం తరచూ చూస్తుంటాం. ఐఫోన్ కెమెరాలో ఫొటో తీస్తే వచ్చే రంగులు, ఎక్స్‌ప్లోజర్, వీడియోల్లో వినిపించే స్వరాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ట్రావెల్ ఫొటోగ్రఫీ, దర్శనీయ స్థలాలు, చూడచక్కని ఇంటీరియర్స్ ఇలా వేటిని క్లిక్‌మనిపించినా ఆ చిత్రాల్లో వక్రీకరణ కనిపించదు. ఎడిటింగ్ అవసరం లేకుండానే ఐ ఫోన్‌లో తీసిన ఫొటోలను నేరుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకోవచ్చు. వాటిలో అంత నాణ్యత ఉంటుంది.
సులభతర వినియోగం
ఐ ఫోన్లలో ప్రత్యేకమైన ఐఓఎస్ ఉంటుంది. అది ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. మల్టీ ట్యాబ్స్ ఓపెన్ చేసినా హ్యాంగ్ కాదు. ఐఓఎస్ వెర్షన్లు మారుతున్నా బేసిక్ ఫీచర్లను అలాగే కొనసాగిస్తున్నారు. వాటి ఐకాన్స్ అందంగా కన్పిస్తుంటాయి. దాంతో ఫీచర్లను సులభంగా గుర్తుపట్టొచ్చు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ ఐఓఎస్‌లో స్వల్ప మార్పులు మాత్రమే చేశారు. మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లను చూస్తే ఒక్కో ఫోన్ ఒక తీరుగా ఉంటుంది. కొత్తగా ఫోన్ కొన్న ప్రతిసారి కాస్త గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. ఐ ఫోన్ యూజర్లకు ఈ ఇబ్బంది ఎదురుకాదు. అందులో కనిపించే ఐకాన్, ఫాంట్స్, ప్రకాశవంతమైన రంగులు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఎందుకు భిన్నమో ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎలాంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయినా అన్ని డివైజ్‌లలోకి వేగంగా అందుబాటులోకి వస్తుంది. వాటి కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. యాపిల్ ఎప్పటికప్పుడు తన పరికరాల్లోకి అప్‌డేట్స్ అందజేస్తుంటుంది. అందుకే సెలబ్రిటీలు ఈ బ్రాండ్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!