కుడి - ఎడమ డ్రైవింగ్‌లో మతలబు!?

మన దేశంలో ఎడమ వైపు నుంచి డ్రైవింగ్‌ చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసు. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్‌ ఉంటుంది. ఎడమవైపు డ్రైవింగ్‌ అలవాటు ఉన్న వ్యక్తులు.. కుడివైపు డ్రైవింగ్‌ చేసే దేశాల్లో వాహనం నడపాల్సి వస్తే చాలా జాగ్రత్త వహించాలి.

Updated : 02 Aug 2021 10:19 IST

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. అని ఓ సినీ కవి అన్నారు. కానీ డ్రైవింగ్‌ విషయంలో కుడి.. ఎడమ చూసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. మన దేశంలో ఎడమ వైపు నుంచి డ్రైవింగ్‌ చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసు. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్‌ ఉంటుంది. ఎడమవైపు డ్రైవింగ్‌ అలవాటు ఉన్న వ్యక్తులు.. కుడివైపు డ్రైవింగ్‌ చేసే దేశాల్లో వాహనం నడపాల్సి వస్తే చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. గణాంకాల ప్రకారం.. 75 దేశాల్లో ఎడమవైపు.. 165 దేశాల్లో కుడివైపు డ్రైవింగ్‌ చేస్తారట. కానీ, ఎందుకలా? అన్ని దేశాల్లో ఒకేలా ఎందుకుండదు? అసలు ఈ కుడి.. ఎడమ డ్రైవింగ్‌ ఎలా మొదలైంది? వీటికి సమాధానం తెలియాలంటే.. కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లాల్సిందే.

మొదట అంతా ఎడమవైపే

ప్రాచీన కాలం నుంచి అందరూ ఎడమ వైపు నుంచే ప్రయాణించేవారట. ఇందుకు కారణాలు.. ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజ్యాల్లో ఉండే సైనికులు గుర్రాలపైకి ఎడమవైపు నిలబడి ఎక్కేవాళ్లు. సైనికుల కత్తి ఒర ఎడమవైపు ఉంటుంది కాబట్టి.. కుడివైపు నుంచి ఎక్కడానికి వీలుకాదు. అదే ఎడమవైపు నుంచి అయితే.. ఇబ్బంది లేకుండా కుడి కాలు పైకి లేపి, గుర్రం ఎక్కొచ్చు. అంతేకాదు.. గుర్రాన్ని ఎడమవైపు నుంచి తీసుకెళ్లడం వల్ల ఒరలోంచి కత్తిని కుడిచేతితో సులభంగా తీసి శత్రువులతో యుద్ధం చేయడానికి, రాజుకు సెల్యూట్‌ చేయడానికి వీలు ఉండేది. అలా యజమానికి అనుగుణంగా గుర్రాలు కూడా ఎడమవైపు నుంచి వెళ్లడానికి అలవాటు పడ్డాయి. అలా రోమన్‌ సైనికులతోపాటు సామాన్య ప్రజలు కూడా వారి గుర్రాలను.. రథాలను ఎడమవైపు నుంచే నడిపించేవారు. క్రీస్తుశకం 1300లో పోప్‌ బెనిఫేస్‌ VIII రోమ్‌ను సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఎడమవైపే వాహనాలను నడపాలనే నిబంధన కూడా విధించాడని చరిత్రకారులు చెబుతున్నారు.

కుడివైపునకు మారిన ఫ్రాన్స్‌

ఫ్రాన్స్‌లో క్రీస్తుశకం 1700 కాలంలో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. గుర్రాలకు చెక్కతో చేసిన పెద్ద పెద్ద డబ్బాలను కట్టి వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే, ఆ సమయంలో గుర్రాలను నడిపించే డ్రైవర్‌కు ప్రత్యేకంగా సీటు ఏమీ ఉండేది కాదు. ఎడమవైపు ఉండే గుర్రంపై కూర్చొని కుడి చేత్తో కొరడా ఝుళిపిస్తూ బండిని తోలాల్సి ఉండేది. రోడ్డుకు ఎడమవైపున కూర్చోవడంతో వెనుక వచ్చే బండ్లను గమనించడం డ్రైవర్‌కు కష్టంగా మారింది. అందుకే గుర్రపు బండిని రోడ్డుకు కుడివైపు నుంచి తోలడం మొదలుపెట్టారు. దీంతో డ్రైవర్‌ రోడ్డు మధ్యలో నుంచి వెళ్తున్నట్లుగా ఉండేది. తన వెనక వచ్చే బండ్లను ఎడమ వైపు నుంచి ముందుకు పంపే వీలు కలిగేది. అయితే, సాధారణ గుర్రాలు ఎడమవైపు నుంచి.. గుర్రపు బండ్లు కుడివైపు నుంచి వెళ్తుండటంతో ప్రయాణం కాస్త గందరగోళంగా మారేది. ఇది గమనించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం అందరూ కుడివైపు నుంచే వెళ్లాలని 1792లో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనపార్ట్‌ కుడివైపు డ్రైవింగ్‌ను చట్టంగా మార్చారు.

నిర్ణయం మార్చుకోని బ్రిటన్‌

ఫ్రాన్స్‌లో కుడివైపు డ్రైవింగ్‌ మొదలు కావడంతో పొరుగు దేశాలు సైతం కుడివైపు డ్రైవింగ్‌ను అనుసరించడం మొదలుపెట్టాయి. కానీ బ్రిటన్‌ ఇందుకు నిరాకరించింది. ఎడమవైపు డ్రైవింగ్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎడమవైపు డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు 1773లో జనరల్‌ హైవే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కాలానుగుణంగా ఈ చట్టాన్ని 1835లో మరోసారి అమలు చేసింది.

బ్రిటన్‌తో కొన్ని.. ఫ్రాన్స్‌తో కొన్ని..

అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉన్న బ్రిటన్‌.. ఫ్రాన్స్‌ అప్పటికే ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాయి. దీంతో తమ అధీనంలో ఉన్న దేశాల్లో బ్రిటన్‌ ఎడమ వైపు డ్రైవింగ్‌.. ఫ్రాన్స్‌ కుడివైపు డ్రైవింగ్‌ను అమలు చేశాయి. అలా భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా సహా బ్రిటన్‌ పరిపాలించిన అనేక దేశాల్లో ఎడమ వైపు డ్రైవింగ్‌ కొనసాగుతోంది. జపాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ వంటి ఆసియాలోని మరికొన్ని దేశాలు కూడా ఎడమవైపు డ్రైవింగ్‌ను అనుసరించాయి. అమెరికా, కెనడాలోనూ మొదట్లో ఎడమవైపు డ్రైవింగే ఉండేది. కానీ అక్కడి పెద్దరోడ్లు గుర్రపుబండ్లు తిరగడానికి వీలుగా ఉండటంతో ఫ్రాన్స్‌ మొదలుపెట్టిన కుడివైపు డ్రైవింగ్‌వైపే మొగ్గుచూపాయి. కాలక్రమంలో కార్లు, అనేక రకాల వాహనాలు వచ్చాయి. గుర్రపు బండి సూత్రం ప్రకారం.. డ్రైవర్‌ రోడ్డుకు మధ్యలో ఉండేవిధంగా.. ఎడమవైపు డ్రైవింగ్‌ కార్లలో కుడివైపు స్టీరింగ్‌, కుడివైపు డ్రైవింగ్‌ కార్లలో ఎడమవైపు స్టీరింగ్‌ ఉండటం గమనించొచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని