మహా మహా మాయగాళ్లు..కరీబియన్‌కే ఎందుకు?

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో మెహుల్‌ ఛోక్సీ నిందితుడు. భారత్‌ నుంచి పారిపోయి ఆంటిగ్వాలో తలదాచుకున్న ఆయన, ఉన్నట్టుండి మే 23న అదృశ్యమయ్యాడు...

Updated : 06 Jun 2021 11:06 IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో మెహుల్‌ ఛోక్సీ నిందితుడు. భారత్‌ నుంచి పారిపోయి ఆంటిగ్వాలో తలదాచుకున్న ఆయన, ఉన్నట్టుండి మే 23న అదృశ్యమయ్యాడు. క్యూబా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో డొమినికా సముద్ర తీరంలో పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అసలు.. భారత్‌ నుంచి తప్పించుకున్న ఛోక్సీ కరీబియన్‌ దీవుల్లోని ఆంట్విగాకే ఎందుకు వెళ్లాడు? ఒక్క మెహుల్‌ ఛోక్సీనే కాదు.. ఐపీఎల్‌ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లలిత్‌ మోదీ లాంటి పెద్దపెద్ద నిందితులెందరో దేశం నుంచి పారిపోయి కరీబియన్‌ దీవుల్లోనే తలదాచుకుంటున్నారెందుకు?వాళ్లందరికీ ఆ దీవులు పూలపాన్పులా ఎందుకు తయారయ్యాయి?

కరీబియన్‌ దీవుల్లో ఆంటిగ్వా, బార్బడోస్‌, డొమినికా, గ్రెనడా, సెయింట్‌ కిట్స్‌, సెయింట్‌ లూసియా తదితర చిన్న చిన్న దేశాలున్నాయి. ద్వితీయ పౌరసత్వం కావాలకున్న విదేశీయులకు ఇవి ఎర్ర తివాచీ పరుస్తాయి. ఆయా దేశాల్లో కొంత మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు. సులభంగా ఆ దేశ పౌరసత్వం పొందొచ్చు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 150-165 దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆ జాబితాలో ఇంగ్లాండ్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు కూడా ఉండటం గమనార్హం. అందువల్లే భారత్‌లో భారీ మోసాలకు పాల్పడ్డ నిందితులు.. కొంత మొత్తంలో అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ దేశ పౌరసత్వం పొందుతున్నారు. సరైన సమయం చూసుకొని అక్కడికి ఎగిరిపోతున్నారు. స్థానిక పౌరసత్వం ఉన్న కారణంగా వారికి రాజ్యాంగ పరమైన రక్షణ ఉంటుంది. భారతదేశ చట్టాలు అక్కడ పని చేయకపోవడం వల్ల  వారిని పట్టుకోవడం అధికారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతోంది.

పెట్టుబడులతో పౌరసత్వం  

కరీబియన్‌ దేశాలు అనుసరిస్తున్న పెట్టుబడులతో పౌరసత్వం విధానం కింద 2014 నుంచి ఇప్పటి వరకు 28 మంది భారతీయులు ఆంటిగ్వా పౌరసత్వం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 2017, జనవరి 1 నుంచి జూన్‌ 30 మధ్య కాలంలో 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఏడుగురికి పౌరతస్వం ఇచ్చినట్లు ఆంటిగ్వా ప్రకటించింది. ఈ వ్యవహారాలను నిర్వహించేందుకు ఆ దేశంలో ఏకంగా ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖే ఉండటం గమనార్హం. 2014-2019 మధ్య కాలంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆంటిగ్వా జులై 2013లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. డిసెంబర్‌ 31, 2019 వరకు వివిధ దేశాలకు చెందిన 2,240 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో  అనేకమందికి ఆ దేశం పౌరసత్వం ఇచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం 2019లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

సెయింట్‌ కిట్స్‌దీ అదే దారి

కరీబియన్‌ దీవుల్లోని మరో దేశమైన సెయింట్‌ కిట్స్‌ 1983లో ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్యం పొందింది.  స్వతంత్ర దేశమైన ఏడాది తర్వాత, అంటే ఆంటిగ్వా కంటే ముందుగానే, 1984లోనే ఈ వివాదాస్పదమైన పెయిడ్‌ సిటిజన్‌షిప్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో వీసాలు లేకుండా ప్రయాణం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పడంతో బడాబడా వ్యాపారస్థులు కొంతమొత్తంలో అక్కడ పెట్టుబడి పెట్టి పౌరసత్వం తీసుకున్నారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. కేవలం పౌరసత్వం మాత్రమే కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యక్ష పన్ను, మూలధన లాభాలపై పన్ను, డివిడెండ్లపై పన్ను లేకపోవడంతో చాలామంది వ్యాపారవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు.

పౌరసత్వం మరీ ఇంత తేలికా..!

కరీబియన్‌ దేశాల పౌరసత్వం పొందడం ఎంత తేలికో అని కొన్ని అంశాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. డొమినికా, సెయింట్‌ లూసియా పౌరసత్వం పొందాలంటే ఒక వ్యక్తి లక్ష డాలర్లు  పెట్టుబడి పెడితే చాలు. ఆ వ్యక్తితోపాటు ఆయన భార్యకు కూడా పౌరసత్వం కావాలంటే సెయింట్‌ లూసియాలో 1.65 లక్షల డాలర్లు, డొమినికాలో అయితే 1.75 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చైనాలో వ్యాపారం చేయాలనుకుంటే నేరుగా ఆ దేశ పౌరుడై ఉండక్కర్లేదు. 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కరీబియన్‌ దేశమైన గ్రెనడా పౌరసత్వం తీసుకుంటే చాలు. ఆ పాస్‌పోర్టుతో కొన్ని యూరప్‌ దేశాలతోపాటు, చైనాకు కూడా వీసా లేకుండా వెళ్లిపోవచ్చు.

ఈ వెసులుబాటునే ఆసరాగా చేసుకొని మహా మహా మాయగాళ్లంతా కరీబియన్‌ దీవులనే అడ్డాగా మార్చుకుంటున్నారు. తమ సొంత దేశాల్లో దోచుకున్న డబ్బులో కొంత పెట్టుబడి పెట్టి, అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారు. అలా ఆర్థిక నేరగాళ్లు భారత్‌ కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని