‘విండో’ నుంచి ప్రపంచాన్ని చూసేద్దామా!

కరోనా వల్ల పర్యాటక రంగం మొత్తం తుడిచిపెట్టుకోపోయింది. ఇల్లే దాటలేని ప్రస్తుత పరిస్థితిలో విదేశాల్లో విహారయాత్రలు, ప్రకృతి ఒడిలో సేద తీరడాలు కలే. బయటకు వెళ్తే కరోనా ఎక్కడా సోకుతుందోనని చాలా మంది ఇంటికే పరిమతయ్యారు. ఇంటి

Updated : 25 Jul 2020 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైంది. ఇల్లే దాటలేని ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో విహారయాత్రలు, ప్రకృతి ఒడిలో సేద తీరడాలు ఒక కలే. బయటకు వెళ్తే కరోనా సోకుతుందేమోనని చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి కిటికీలోంచే బయట ఏం జరుగుతుందో చూస్తున్నారు. మరి ఈ కిటికీ నుంచే ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే సింగపూర్‌కి చెందిన సోనాలీ రంజిత్‌.. వైష్ణవ్‌ బాల సుబ్రమణ్యం దంపతులకు వచ్చింది. దీంతో ‘విండో స్వాప్‌’ వెబ్‌సైట్‌ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడో ఎవరి ఇంట్లోనో ఉన్న కిటికీ నుంచి బయటి దృశ్యాలను చూడొచ్చన్నమాట. వింతగా ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే ‘ఓపెన్‌ ఏ న్యూ విండో సమ్‌వేర్‌ ఇన్‌ ది వరల్డ్‌’అనే బటన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయగానే దేశ విదేశాల్లోని నగరాల్లో ఉండే ఓ ఇంటి కిటికీ ప్రత్యక్షమవుతుంది. ఆ కిటికీలోంచి బయట దృశ్యాలు కనిపిస్తాయి. 

ఉదాహరణకు ‘ఓపెన్‌ ఏ న్యూ విండో సమ్‌వేర్‌ ఇన్‌ ది వరల్డ్‌’ క్లిక్‌ చేయగానే యూఎస్‌లోని న్యూయార్క్‌ నగరంలో ఉన్న ఓ ఇంటి కిటికీ కనిపిస్తుంది. అందులో నుంచి బయట ఉన్న భవంతులు, వర్షం కురుస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మరోసారి బటన్‌ నొక్కితే పొర్చుగల్‌లోని వీఎన్‌ గెయియా నగరంలోని మరో ఇంటి కిటికీ వస్తుంది. అందులో నుంచి బయట రోడ్లు.. వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఇలా ‘ఓపెన్‌ ఏ న్యూ విండో సమ్‌వేర్‌ ఇన్‌ ది వరల్డ్‌’ బటన్ నొక్కిన ప్రతిసారీ ప్రపంచంలోని ఏదో ఒక నగరానికి చెందిన దృశ్యాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకోసం వెబ్‌సైట్‌ రూపకర్తలు మొదట దేశ విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల ద్వారా వీడియోలు చేయించి పెట్టారు. ప్రస్తుతం 15 దేశాలకు చెందిన పలు నగరాల్లోని వీడియోలు ఇందులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించే విజిటర్స్‌ కూడా తమ ఇంటి కిటికీ బయట దృశ్యాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చొచ్చు. ఇందుకోసం హెచ్‌డీ క్లారిటీతో మీ కిటికీ బయటి దృశ్యాలను పది నిమిషాలపాటు చిత్రీకరించి.. మీ పేరు, నగరం.. దేశం పేర్లు జతచేసి అప్‌లోడ్‌ చేయాలి. భలే ఆలోచన కదా.. మీరూ ఒకసారి www.window-swap.comను సందర్శించండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని