దివ్యాంగులకు కోడింగ్ నేర్పుతున్నాడు!
కోడింగ్ రాయడం అంత సులువుకాదు. బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం కొన్నిసార్లు కోడింగ్ రాయడంలో తడబడుతుంటారు.
చిత్రాలు: వారి అధికారిక వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: కోడింగ్ రాయడం అంత సులువుకాదు. బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం కొన్నిసార్లు కోడింగ్ రాయడంలో తడబడుతుంటారు. కానీ, కొందరు దివ్యాంగులు కోడింగ్‌లో ఆరితేరారు. అలవోకగా రాసేస్తున్నారు. వెబ్‌సైట్‌లనూ సృష్టించేస్తున్నారు. వారు ఆ పని చేయగలరని నమ్మాడో వ్యక్తి. వారికి కోడింగ్ నేర్పుతూ శిక్షణనిస్తున్నాడు. అందుకు ఓ అంకుర సంస్థనూ స్థాపించాడు. ఇంతకీ ఎవరతను? తనకా ఆలోచన ఎలా వచ్చింది? ఏంటా సంస్థ? తెలుసుకుందాం.
ఆలోచన ఎలా?
చెన్నెకి చెందిన మను శేఖర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, బ్రాండింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తదుపరి ‘టెక్‌దివ’ అనే ఓ సామాజిక సంస్థని స్థాపించి మహిళలు, సామాజిక కార్యకర్తలకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో విభిన్న అభ్యాసాల ద్వారా మెళకువలు నేర్పేవాడు. వినూత్న బోధన పద్దతులను ఉపయోగిస్తూ వారిని డెవలపర్లుగా తీర్చిదిద్దాడు. వారితో కలిసి అనేక యాప్‌లను రూపొందించాడు. అంతేకాదు ఈ సంస్థ ద్వారా వృద్ధులకు, వెనకబడిన ప్రజలకు స్మార్ట్‌ఫోన్ వాడకం, డిజిటల్ మీడియాపై అవగాహన కల్పించేవాడు. ప్రస్తుతం టెక్‌దివ అట్టడుగు ప్రజలకు డిజిటల్ విజ్ఞానాన్ని అందించే ఓ ఎన్‌జీఓగా మారింది. ఇక గత సంవత్సరం ఆటిజం స్పెక్ట్రమ్ గల తన స్నేహితుని కూతురు ఆటిస్టిక్ కోసం కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరు కావాలని మనుని ఆహ్వానించింది. అక్కడ ఎంతో మంది ఆటిస్టిక్ పిల్లల తల్లిదండ్రులను కలుసుకున్నాడు మను. వారితో మాట్లాడాడు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆటిజం, ఇతర దివ్యాంగులు వస్తువులు అమ్మడం, రిటైల్ షాప్‌లలో పనిచేయడం ఇలా కేవలం కొన్ని ఉద్యోగాలు మాత్రమే చేయగలుగుతారని కొందరు భావిస్తారు. ఇవే కాదు వారూ అందరిలా అన్ని ఉద్యోగాలూ చేయగలుగుతారని డిగ్రీలు, ధ్రువపత్రాల కంటే వారిలో నైపుణ్యాలు మెరుగుపరిస్తే అందరికంటే మిన్నగా రాణించగలరనుకున్నాడు. వారికి కోడింగ్ నేర్పాలని నిర్ణయించుకున్నాడు. కోడింగ్‌లో వారిని ఆరితేరేలా చేసి మంచి కొలువులకు మార్గం సులువు చేయాలనుకున్నాడు. అలా వారికోసం ‘HashHackCode’ అనే అంకుర సంస్థని ప్రారంభించాడు. ‘టెక్‌దివ’ సంస్థ అనుభవాన్ని ఈ సంస్థ రూపకల్పనకి ఉపయోగించుకున్నారు.
ఎలా పనిచేస్తుంది?
ఈ సంస్థలో విభిన్న పద్ధతుల ద్వారా ఆటిజం, ఇతర దివ్యాంగులకు కోడింగ్ నేర్పుతారు. న్యూరో డైవర్సిటీయే ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందీ సంస్థ. అనేక పద్దతుల ద్వారా వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి అలాంటి విద్యా విధానాన్ని రూపొందించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేస్తారు. ఏటా 45మందికి పైగా విద్యార్థులను తీసుకుంటారు. ఇందులో ఆటిజం స్పెక్ట్రమ్‌తో ఉన్నవారు మాత్రమే కాదు. డౌన్స్ సిండ్రోమ్, వినికిడి, ప్రసంగ బలహీనత, డిస్లెక్సియా తదితర సమస్యలు ఉన్నవారిని శిక్షణకు ఆహ్వానిస్తారు. వారి కోసం ‘క్రియేటీవ్ కోడింగ్’ అనే కొత్త పాఠ్యాంశాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా శిక్షణను వివిధ విభాగాలుగా విభజిస్తారు. మొదట హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా తదితర వాటిపై ప్రోగ్రామింగ్‌ని నేర్పుతారు. వాటిని సరైన విధంగా అభ్యసిస్తే తదుపరి పైథాన్ వంటి అధునాతన ప్రోగ్రామింగ్‌పై శిక్షణనిస్తారు. ఈ అంకుర సంస్థలో 8 నుంచి 34 సంవత్సరాల వయసు గల వారు ప్రోగ్రామింగ్‌లో శిక్షణ పొందుతారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకీ ప్రోగ్రామింగ్ నేర్పుతారు. ఇది వారి పిల్లలకు మరింత మెరుగ్గా నేర్పేందుకు, వారూ కొలువులను సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు కేవలం ప్రోగ్రామింగ్ నేర్పి ఉద్యోగాల్లో స్థిరపడేలా చూసేందుకే కాదు. ఆ పిల్లల్లో తార్కిక, ఆలోచన జ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. కేవలం ఆచరణాత్మకంగానే బోధిస్తారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచి వారికి వారే ఆలోచిస్తూ ప్రోగ్రామింగ్‌లో మెరుగయ్యేలా చూస్తారు.
లాక్‌డౌన్‌లో ఇలా..
లాక్‌డౌన్‌లో HashHackCode ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కాలేజీ విద్యార్థులను, యువ గ్రాడ్యుయేట్‌లను ఎంపిక చేసి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసేందుకు ఫెలోషిప్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎంపికైన విద్యార్థులు ఇక్కడి మెంటర్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!