Andhra News: విశాఖలో అమానవీయ ఘటన.. పసికందు మృతదేహంతో 120కి.మీ స్కూటీపైనే

విశాఖ కేజీహెచ్‌ నుంచి 120 కిలోమీటర్లు స్కూటీపైనే పసికందు మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణించిన ఘటన స్థానికులను కలచివేసింది.

Updated : 16 Feb 2023 17:14 IST

పాడేరు పట్టణం: విశాఖ కేజీహెచ్‌లో దారుణం చోటు చేసుకుంది. కేజీహెచ్‌ నుంచి 120 కిలోమీటర్లు స్కూటీపైనే పసికందు మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణించిన ఘటన స్థానికులను కలచివేసింది. బుధవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ముత్యంకిపొట్టు మండలం కుముడ గ్రామానికి చెందిన గర్భిణిని విశాఖ కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడి ఊపిరాడక శిశువు మృతి చెందింది. 

శిశువు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. అంబులెన్స్‌ కోసం ఎంత ప్రాధేయపడినా కేజీహెచ్‌ సిబ్బంది నుంచి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీపైనే పాడేరుకి పయనమయ్యారు. స్కూటీ మీద పాడేరు వరకు తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకువచ్చారు. జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్‌ ఈ విషయం తెలుసుకొని పాడేరు నుంచి స్వగ్రామం కుమడకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. సమాచార లోపంతో ఇలా జరిగిందని.. అధికారులను సంప్రదిస్తే అంబులెన్స్‌ ఏర్పాటు చేసేవాళ్లమని లీలాప్రసాద్‌ తెలిపారు. తల్లిదండ్రులకు అంబులెన్స్‌ నమోదు ప్రక్రియ తెలియలేదని వివరణ ఇచ్చారు. కేజీహెచ్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని