Covid vaccine: రెండు డోసులు తీసుకున్నా.. యాంటీబాడీల కొరత

టీకా రెండు డోసులు తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని ఐఎల్‌ఎస్‌ స్పష్టం చేసింది.....

Published : 13 Sep 2021 01:29 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

భువనేశ్వర్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. అందరికి యాంటీబాడీలు అభివృద్ధి చెందడం లేదా? అనే ప్రశ్నకు పలు అధ్యయనాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తాజాగా ఒడిశాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌ (ఐఎల్‌ఎస్‌) ఇదే విషయాన్ని వెల్లడించింది. ఒడిశాలో టీకా రెండు డోసులు తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని స్పష్టం చేసింది. యాంటీబాడీ జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. వారికి బూస్టర్‌ డోస్ అవసరమని సూచించింది.

ఒడిశాలో ఇప్పటివరకు 61.32 లక్షల మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారు. వీరిలో 10 లక్షల మంది ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందినవారు ఉన్నారు. అయితే ఈ 10లక్షల మందిలో దాదాపు 20 శాతం మందికి పూర్తిస్థాయిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందలేదని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌ తెలిపింది. రెండు టీకాలు వేసుకున్నవారికి 60వేల నుంచి లక్షలోపు యాంటీబాడీలు ఉండాలని.. కానీ ఈ 20శాతం మందిలో 50వేల కంటే తక్కువగానే ఉన్నట్లు వివరించారు. వీరికి బూస్టర్‌డోస్‌ అవసరమని ఐఎల్‌ఎస్‌ డైరెక్టర్‌ డా.అజయ్‌ పరీద అభిప్రాయపడ్డారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ వారిలో యాంటీబాడీలు డెవలప్‌ కాకపోవడానికి జన్యుపరమైన వ్యత్యాసాలే కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్‌ తీసుకోనివారు, 18 ఏళ్ల పిల్లలతోపాటు ఈ 20 శాతం మంది కూడా రానున్న కొవిడ్‌ మూడో దశ సమయంలో వైరస్‌ బారిన పడే అవకాశాలున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌ పేర్కొంది. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీకాలు తీసుకున్నా.. యాంటీబాడీలు లేనివారికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు డా.అజయ్‌ పరీద తెలిపారు. దీనిపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. ఇదివరకు తీసుకున్న టీకానే ఇవ్వాలా? లేక మరో డోసుకు మారాలా? అనే చర్చ సాగుతున్నట్లు వెల్లడించారు. భారత్‌లో ప్రస్తుతం డెల్టా ప్లస్‌ మినహా మరే ఇతర కొత్త వేరియంట్‌ లేదని.. తాజా పరిశోధనలో వెల్లడైనట్లు పరీద స్పష్టం చేశారు. కరోనా నిబంధనలన్నీ పాటిస్తే మూడో దశ రాకుండా జాగ్రత్త పడొచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని