2020లో..కరోనా మోసుకొచ్చిన కొత్త పదాలు!

2020 సంవత్సరంలో కరోనా మోసుకొచ్చిన కొన్ని సాధారణ, హాస్యాస్పద పదాలను మరోసారి గుర్తుచేసుకుందాం.

Published : 01 Jan 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ విజృంభణతో యావత్‌ ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మనకు తెలిసిన, వాడుకలో తక్కువగా ఉన్న ఎన్నో పదాలను కరోనా మహమ్మారి మనకు నిత్య పరిచయం చేసింది. రాకపోకలకు ఆటంకం కలిగించినప్పటికీ కొన్ని పదాలతో యావత్‌ ప్రపంచాన్ని ఒక్కమాటపైకి (ఒకే విధమైన పదాలను వాడటంలో) తీసుకొచ్చింది. 2020 సంవత్సరంలో కరోనా మోసుకొచ్చిన కొన్ని సాధారణ, హాస్యాస్పద పదాలను మరోసారి గుర్తుచేసుకుందాం.

ఎపిడమిక్‌, పాండమిక్‌, ఔట్‌బ్రేక్‌: ఏదైనా వ్యాధి ఒక్కసారిగా బయటపడి ప్రబలడాన్నే ఔట్‌బ్రేక్‌ అంటాం. అదే వ్యాధి లేదా వైరస్‌ కొన్ని ప్రాంతాల్లోనే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను అనారోగ్యానికి గురిచేయడాన్ని ఎపిడమిక్‌ అంటారు. ఇక వ్యాధి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తూ, ఎంతోమంది ప్రాణాలను బలితీసుకోవడాన్నే పాండమిక్‌(మహమ్మారి)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారిగా మారి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే.

కరోనియల్స్‌: లాక్‌డౌన్‌ తర్వాత పుట్టిన పిల్లలు. కరోనా ప్రభావంతో యావత్‌ ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. బయటకు వెళితే భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి. కానీ, ఇంటిలో పరిస్థితి అందుకు విరుద్ధమే కదా. అందుకే ఆ సమయంలో పుట్టిన పిల్లలను కరోనియల్స్‌గా సంబోధించడం కొన్నిదేశాల్లో ఎక్కువైంది.

కొవిడియట్‌: కరోనా వైరస్‌ భద్రత గుర్తుకు రాగానే మన మెదడులో మెదిలే వ్యక్తి. కరోనా వైరస్‌ భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగే వ్యక్తి. అలాంటి వ్యక్తిని తిట్టడానికి కొవిడియట్‌గా సంభోదిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వినియోగించారు.

మొరోనావైరస్‌: అదేనండీ.. కరోనా బారినపడిన మన కొవిడియట్స్‌. కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేసి చివరకు వైరస్‌ బారిన పడ్డవారు. ఉదాహరణకు డొనాల్డ్‌ ట్రంప్‌, రూడీ గులియాని(ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది, న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌) వంటి వారు అన్నమాట. అమెరికా వంటి దేశాల్లో ఈ పదం బాగా ప్రాచుర్యంలో ఉంది.

కరోనాకోస్టెర్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ మన మానసిక స్వభావాల హెచ్చుతగ్గులను ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు లాక్‌డౌన్‌ కాలంలో ఇష్టమైన సమయంలో నిద్రలేచి జిమ్‌ చేయడం, తర్వాత హాయిగా సేదతీరడం. ఇంట్లోనే ఇష్టమైన వంటకం చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపేయడం. మరుక్షణమే ఆఫీసులోని మధుర క్షణాలు గుర్తుకొచ్చి నిరాశ చెందడం. మరికొంత సమయానికి మీకు నచ్చని వారిని కూడా కోల్పోతున్నట్లు కలత చెందడం. ఒకేరోజు ఎన్నో మానసిన ఉద్వేగాలు చోటుచేసుకోవడాన్ని కరోనాకోస్టెర్‌గా పిలుస్తున్నారు.

కమ్యూనిటీ స్ప్రెడ్‌/కాంటాక్ట్‌ ట్రేసింగ్‌: ఒక ప్రత్యేక ప్రాంతంలో వైరస్‌ ఎవరినుంచి సోకిందనే విషయం తెలియకుండా (మూలం) విస్తృతంగా వ్యాపించడాన్నే కమ్యూనిటీ స్ప్రెడ్‌(సామాజిక వ్యాప్తి)గా పేర్కొంటారు. ఎవరైనా వ్యక్తి వైరస్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకున్నా వారిలో వైరస్‌ బయటపడినప్పుడు సామాజిక వ్యాప్తిగా గుర్తిస్తారు. దీన్ని నిర్ధారించుకునేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి ఎవరినుంచి వైరస్‌ సోకిందనే విషయాన్ని తెలుసుకోలేని సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఎంతో కీలకం. కొవిడ్‌ గొలుసును తెలుసుకొని నివారించినప్పుడే వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోగలమని నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

సోషల్‌ డిస్టెన్స్‌: భౌతిక దూరం అనే పదం 19వ శతాబ్దంలోనే వాడుకలో ఉంది. వివిధ వర్గాల మధ్య వ్యక్తిగత దూరం పాటించిన కాలంలో.. ముఖ్యంగా కొందరి జాతి, వర్గ వివక్ష చూపిన సందర్భాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడారు. కానీ, కరోనా కాలం ఈ పదాన్ని మళ్లీ పరిచయం చేసింది. ప్రస్తుతం మాత్రం ప్రజారోగ్య శ్రేయస్సుకోసమే. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడింది.

క్వారంటైన్‌: కరోనా లక్షణాలు కనిపించినా, లేదా కొవిడ్‌ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినా, చివరకు పాజిటివ్‌ అని తేలినప్పుడు తప్పనిసరిగా చేయాల్సింది హోం క్వారంటైన్‌. క్వారంటైన్‌ అనగా ఇలాంటి వైరస్‌ల ప్రభావం ఉన్నప్పుడు కొంతకాలం పాటు ఇతర వ్యక్తులకు దూరంగా ఉంటూ కేవలం ఇంటికే పరిమితం కావడం. ఈ పదాన్ని లాటిన్‌ భాషలో నలభై కు అర్థం వచ్చే క్వాడ్రాగినా నుంచి స్వీకరించారు.

ఐసోలేషన్‌: ఇది లాటిన్‌ పదమైన ‘ఇన్సులా’ నుంచి వచ్చింది. అనగా ఐల్యాండ్‌ (ద్వీపం) అని అర్థం. ఇన్సులా, ఐసోలెటో నుంచి ఫ్రెంచ్‌ పదమైన ‘ఐసోల్‌’కు మారింది. ఇక ఇంగ్లీష్‌ పదంలో ఐసోలేట్‌గా మారిపోయింది. 14వ శతాబ్ది కాలంలో ఇటలీలో నిర్మించిన తొలి ఆసుపత్రి ఐల్యాండ్‌లోనే నిర్మించడంతో ఆ పదం పుట్టుకొచ్చింది. నివాస ప్రాంతాలకు లేదా ప్రజలకు దూరంగా ఉండడాన్ని తెలిపే ఈ పదం.. తర్వాత 17శతాబ్దంలో ఆంగ్ల పదంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో వైరస్‌ అనుమానిత, సోకిన వ్యక్తులు హోం ఐసోలేషనల్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

సూపర్‌ స్ప్రెడర్‌: వైరస్‌ సోకిన ఒక వ్యక్తి తన తోటివారిలో చాలా మందికి వైరస్‌ అంటించే సామర్థ్యముండడాన్నే సూపర్‌ స్ప్రెడర్‌ అంటారు. ఒక్కోసారి ఒకే వ్యక్తి ద్వారా చాలా మందికి వైరస్‌ సోకే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పార్టీలు, సమూహాలుగా ఉన్న సమయంలో వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి అక్కడ చాలా మందికి వ్యాప్తిచెందుతుంది. ఇలాంటి సందర్భాలను సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌గా పరిగణిస్తారు.

లాక్‌డౌన్‌: ఆధునిక ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని సంఘటన. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ప్రపంచంలో మూడోవంతు దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించాయి. కొన్ని పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించగా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజలందరూ కొన్నిరోజులపాటు ఇళ్లకే పరిమితమవడంతో పాఠశాలలు, దుకాణాలు, రవాణా వంటి దాదాపు వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి.

వ్యాక్సిన్‌: యావత్‌ ప్రపంచానికి ఆశలు కలిగిస్తోన్న పదం. ప్రాచీన కాలం నుంచే వ్యాక్సిన్‌ అనే పదం పరిచయం ఉన్నప్పటికీ.. 18వ శతాబ్దంగా తొలి టీకాను కనుగొన్న శాస్త్రవేత్తగా ఎడ్వర్ట్‌ జెన్నర్‌ నిలిచారు. 1798లో మశూచికి టీకాను అభివృద్ధి చేసిన జెన్నర్‌ ఆధునిక వైద్యానికి మార్గదర్శిగా నిలిచారు. అప్పటినుంచి ఎన్నో వైరస్‌లను ఎదుర్కొనగలిగే వ్యాక్సిన్‌లను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తూనే ఉన్నారు.

వర్క్‌ ఫ్రం హోం: ఒకప్పుడు కేవలం కొన్ని రంగాల ఉద్యోగులకే అందుబాటులో ఉన్న ఈ వర్క్‌ ఫ్రం హోం విధానం కరోనా పుణ్యమా అంటూ లక్షల మందికి సౌలభ్యం లభించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ప్రస్తుతం ఈ విధానంలోనే తమ కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి.

ది ఎండ్‌(2020): ఎన్నో ఆశలతో మొదలైన 2020 సంవత్సరం ఎన్నో సమస్యలు, సవాళ్లను మోసుకొచ్చింది. అయినప్పటికీ యావప్‌ ప్రపంచం వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ముందుకు సాగింది. కరోనాతో ఆరంభమైన 2020 సంవత్సం ముగుస్తోన్న వేళ.. ఇది తీసుకొచ్చిన ఉపద్రవం కూడా ఇక్కడితోనే ముగిసిపోతుందని ఆశిద్దాం.

ఇవీ చదవండి..
కొత్త సంవత్సరం వేళ..మూగబోయిన ప్రపంచం..!
వైరల్‌ వీడియోస్‌ 2020: మిస్‌ కాకండేం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని