Published : 02 Jul 2022 02:12 IST

Bribary Case: రూ.350 లంచం కేసు.. 24 ఏళ్లకు నిర్దోషిగా తేలిన మాజీ పోలీసు అధికారి

ముంబయి: రూ.350 లంచం తీసుకున్నారన్న కేసులో ఓ మాజీ పోలీసు అధికారి.. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలారు. లంచం తీసుకున్నారన్న విషయాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ బాంబే హైకోర్టు తాజాగా ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే.. దాము అవధ్‌ అనే మాజీ పోలీస్‌ అధికారి 1988లో మహారాష్ట్రలోని యేవోలా తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి సోదరుడికి బెయిల్ ఇప్పించే విషయమై ఆయన ఆ ఏడాది మార్చిలో రూ.350 డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏసీబీ వల పన్ని ఆయన్ను పట్టుకుంది. అరెస్టు చేసి, రూ.350 సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే 1998 ఆగస్టులో నాసిక్‌లోని ప్రత్యేక న్యాయస్థానం ఆయన్ను దోషిగా నిర్ధారించి, ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.

దీంతో ఆయన అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వీజీ బిస్త్‌ కూడిన ఏకసభ్య ధర్మాసనం.. నిందితులను దోషులుగా నిర్ధారించేందుకు కేవలం లంచం డబ్బును రికవరీ చేయడం మాత్రమే సరిపోదని, ఆయనపై కేసును రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని పేర్కొంటూ అవధ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ‘అక్రమ రూపంలో నగదు డిమాండ్‌ చేశారు.. తీసుకున్నారనేదానికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు లేనప్పుడు.. నేరాన్ని నిర్ధారించేందుకు కేవలం నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు సాక్ష్య్ం మాత్రమే సరిపోదు’ అని తెలిపింది. ఫిర్యాదుదారు నుంచి అవధ్‌ ప్రత్యేకంగా లంచం డిమాండ్ చేశారని నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలు లేవని జస్టిస్ బిస్త్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా తీర్పుతో అవధ్‌ దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ కేసు నుంచి విముక్తి పొందడం గమనార్హం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని