EV charging station: హైదరాబాద్‌ చుట్టుపక్కల 330 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు.. ప్రయోగాత్మకంగా ఇక్కడే!

జంట నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల (EV charging station:) ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది.

Published : 02 Jul 2022 02:06 IST

హైదరాబాద్‌: జంట నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (EV charging station:) ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 230 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇటు హెచ్ఎండీఏ పరిధిలో మరో 100 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తొలుత ప్రయోగాత్మకంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో  14 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. 

వాహన కాలుష్యం, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనం ఖరీదు ఎక్కువైనా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ప్రజలు కూడా వీటిపై మక్కువ కనబరుస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల వల్ల కూడా ఎలక్ట్రికల్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ-వాహన పాలసీని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీకి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TS REDCO) నగరంలో పలు చోట్ల ఎలక్ట్రికల్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 230 ప్రదేశాల్లో, హెచ్‌ఎండీఏ పరిధిలో 100 ప్రదేశాల్లో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన జాబితాను టీఎస్‌ రెడ్కోకు అందజేశారు. ప్రతి లొకేషన్లో హైస్పీడ్‌ ఛార్జింగ్, స్లో ఛార్జింగ్ సెంటర్లు ఉంటాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల వినియోగంతో పాటు తద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు తొలుత ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ పరిధిలో 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు టీఎస్‌ రెడ్కో నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇందిరా పార్కులోని పార్కింగ్ స్థలంలో, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌-1 పార్కింగ్, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌-3 పార్కింగ్‌, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌-6 పార్కింగ్‌, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ట్యాంక్ బండ్ కందుకూరి వీరేశ లింగం విగ్రహం వద్ద, ఒహ్రీస్‌ రెస్టారెంట్ ఎదురుగా బషీర్ బాగ్ రోడ్డు, గన్ ఫౌండ్రీ మహ బూబియ గర్ల్స్ జూనియర్ కళాశాల, మున్సిపల్‌ పార్కింగ్‌ అబిడ్స్ జీపీఓ, నానాక్ రామ్ గూడ, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, వనస్థలి పురం నేషనల్‌ డీర్‌ పార్క్‌, శిల్పారామం-2 నాగోల్‌ బ్రిడ్జి మెట్రో ఆఫీస్‌, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్, ఓవైసీ హాస్పిటల్ ఇన్నర్ రింగ్ రోడ్డు సంతోష్ నగర్, తాజ్ త్రీ స్టార్ హోటల్ ఎస్డీ రోడ్డు వద్ద ఎలక్ట్రిక్ చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు