Viral Pic: ఇంగ్లీష్‌లో 35, మ్యాథ్స్‌లో 36.. వైరల్‌గా మారిన కలెక్టర్‌ మార్కుల జాబితా!

పదో తరగతిలో ఇంగ్లీష్‌లో 35, గణితంలో 36 మార్కులు మాత్రమే వచ్చిన ఓ కలెక్టర్‌కు సంబంధించిన మెమో నెట్టింట్‌ వైరల్‌గా మారింది....... 

Published : 14 Jun 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరీక్షలో అనుకున్న మార్కులు రాకపోతే ఆత్మహత్య.. ఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా బలవన్మరణం. ఏమీ సాధించలేమన్న భయం, అపోహతో కొంతమంది విద్యార్థులు భావోద్యేగానికి గురై క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాలివీ. కానీ ఓ సాధారణ విద్యార్థి, అత్తెసరు మార్కులతో పది పాసైనవారు కూడా ఆ తర్వాత గొప్పగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చని నిరూపిస్తోంది ఓ కలెక్టర్‌ మార్కుల జాబితా. ఇంగ్లీష్‌లో 35, గణితంలో 36.. ఇవీ ప్రస్తుతం కలెక్టర్‌ (IAS) హోదాలో ఉన్న తుషార్‌ డి సుమేరా పదిలో సాధించిన మార్కులు. పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సుమేరా ఫొటోతోపాటు ఆయన మార్కుల మెమోను మరో ఐఏఎస్‌ అధికారి ట్విటర్‌లో పంచుకున్నారు.

తక్కువ మార్కులొస్తే కుంగిపోవద్దని తెలియజేసేలా సుమేరా మార్కుల జాబితాను 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అవనిశ్‌ శర్మ తన ట్విటర్‌ (twitter) ఖాతాలో పంచుకున్నారు. ‘పదో తరగతిలో సుమేరా కేవలం పాస్‌ మార్కులనే  సాధించారు. ఆయనకు 100కు ఇంగ్లీష్‌లో 35, గణితంలో 36 మార్కులే వచ్చాయి. ఈ మార్కులు చూసి నువ్వేం సాధించలేవు అని చాలామంది అన్నారు’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అవనిశ్‌ శర్మ ట్వీట్‌కు సుమేరా స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన సుమేరా ప్రస్తుతం గుజరాత్‌లోని భరుచ్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూపీఎస్సీలో ర్యాంకు సాధించారు. అంతకుముందు ఓ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని