Online study: విద్యార్థులే..కానీ పుస్తకం పట్టడం లేదు..

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చిన్నారుల్లో 37 శాతం మంది అసలు చదువుకోవడం లేదని, కేవలం 8 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులకు

Updated : 07 Sep 2021 01:16 IST

దిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చిన్నారుల్లో 37 శాతం మంది అసలు చదువుకోవడం లేదని, కేవలం 8 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. 97 శాతం మంది తల్లిదండ్రులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాఠశాలలను పునఃప్రారంభించాలని కోరుకుంటున్నారని కూడా తెలిపింది. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, పిల్లల్లో విద్య నైపుణ్యాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆగస్టులో ‘స్కూల్ చిల్డ్రన్స్ ఆన్‌లైన్ అండ్‌ ఆఫ్‌లైన్ లెర్నింగ్ (SCHOOL)’ పేరిట సర్వే చేపట్టి నివేదికను రూపొందించారు.

అసోం, బిహార్, చండీగఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన 1,362 కుటుంబాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి ఇంట్లో కనీసం ఒకరు ప్రాథమిక (క్లాసులు 1 నుంచి 5 వరకు) లేదా అప్పర్-ప్రైమరీ (క్లాసులు 6-8) స్థాయిలో చదువుతున్నారని తెలిపింది. 48 శాతం మంది పిల్లలు కొన్ని పదాల కంటే ఎక్కువ చదవలేకపోతున్నారని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 28 శాతం మంది రెగ్యూలర్‌గా చదువుతున్నారని.. 37 శాతం మంది అసలు చదువుకోవడమే లేదని నివేదకలో పేర్కొంది.

పిల్లల్లో తగ్గిన విద్యా నైపుణ్యాలు

తమ పిల్లల్లో చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు తగ్గిపోయాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాలలను పునఃప్రారంభించాలని వారంతా కోరుకుంటున్నారని అధ్యయనం నివేదించింది. పట్టణాల్లో నివసించే వారిలోనూ మూడింట రెండు వంతుల మందిలో చదవడం, రాయగలిగే సామర్థ్యం తగ్గినట్లుగా భావిస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ విద్య చాలా పరిమితంగా ఉందని సర్వే కనుగొంది. క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌లో చదువుతున్న వారు పట్టణాల్లో 24 శాతం కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం మాత్రమేనని పేర్కొంది. దీనికి పలు కుటుంబాలు స్మార్ట్‌ఫోన్ లేకపోవడమే కారణమని వివరించింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న కుటుంబాల్లోనూ ఆన్‌లైన్‌లో  చదువుతున్న వారు పట్టణ ప్రాంతాల్లో 31 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతమేనని నివేదిక చెబుతోంది.

కొంతమంది పిల్లలు ఆన్‌లైన్ విద్యపై అవగాహన లేక శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తెలిపింది. దూరదర్శన్‌లోనూ పిల్లల కోసం ప్రభుత్వం క్లాసులు నిర్వహిస్తోంది. అయితే, గ్రామీణ పిల్లల్లో కేవలం ఒక శాతం, పట్టణాల్లో నివసించే 8 శాతం పిల్లలు టీవీ కార్యక్రమాలను అప్పుడప్పుడు మాత్రమే ఫాలో అవుతున్నారని తెలిపింది. ఈ సర్వే ప్రకారం చాలా మంది విద్యార్థులు, టీచర్లకు మధ్య అవగాహన లేకుండా పోయిందని తెలుస్తోంది. పట్టణాల్లో 51 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మెజారిటీ పిల్లలు సర్వేకు ముందు 30 రోజుల వరకు తమ టీచర్‌ని కలవలేదు. కొంతమంది వాట్సాప్ ద్వారా యూట్యూబ్ లింక్‌లను ఫార్వర్డ్ చేస్తున్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న పథకం భోజనం కూడా నిలిపివేశారని సర్వేలో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని