Published : 29 Jun 2022 23:16 IST

Offbeat: క్షమాపణ కోరుతూ సోదరుడికి 434 మీటర్లు, 5 కేజీల లేఖ.. ఏం జరిగిందంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది మే 24వ తేదీ. కేరళలోని ఇడుక్కికి చెందిన 21 ఏళ్ల కృష్ణ ప్రసాద్ ఉదయం లేచినప్పటి నుంచి అక్క కాల్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. కనీసం మెసేజ్‌ ద్వారా విషెస్‌ చెబుతుందేమోనని పదేపదే మొబైల్ వైపే చూస్తున్నాడు. కానీ సమయం గడుస్తున్నా అక్క నుంచి ఫోన్‌ గానీ మెసేజ్‌ గానీ రాలేదు. ఉండబట్టలేక కాల్‌ చేసినా.. సరైన స్పందన లేదు. దీంతో తీవ్ర కృష్ణ ప్రసాద్‌ మనస్తాపానికి గురయ్యాడు. అక్క సాయంత్రం ఫోన్‌ చేసినా ఆన్సర్‌ చేయలేదు. వాట్సాప్​లోనూ ఆమె నంబర్​ను బ్లాక్ చేసేశాడు.

కృష్ణ ప్రసాద్ అంతలా హర్ట్‌ అయ్యేందుకు కారణం ఆ రోజు బ్రదర్స్‌ డే. అతడిని తీవ్రంగా బాధపపెట్టింది ఇంజినీర్‌గా పనిచేసే అక్క కృష్ణప్రియ (28). బ్రదర్స్​ డే రోజున అక్క తనకు శుభాకాంక్షలు చెప్పలేదన్నది ప్రసాద్‌ ఆవేదన. కృష్ణ ప్రియకు ఈ విషయం కాస్త ఆలస్యంగా అర్థమైంది. దీంతో తన తప్పును సరిదిద్దుకుంటూ.. తమ్ముడంటే ఎంత ప్రేమో తెలియజేయాలనుకుంది. అందుకోసం ఓ వినూత్న ఆలోచన చేసింది. మరి అప్పుడైనా ప్రసాద్‌ కూల్‌ అయ్యాడో లేదో ఆమె మాటల్లోనే..

‘బ్రదర్స్​ డే విషెస్ చెప్పడం మర్చిపోయా. అందుకే తమ్ముడు నాతో ఫోన్​లో మాట్లాడడం మానేశాడు. వాట్సాప్​లో నా నంబర్ బ్లాక్ చేశాడు. అందుకే లేఖ రాయాలని అనుకున్నా. A4 సైజ్​ షీట్స్​పై రాయడం మొదలుపెట్టా. కానీ, తమ్ముడికి నా భావాలు, వాడిపై నాకున్న ప్రేమ, నేను చెప్పాలనుకున్న విషయం రాసేందుకు ఇవి సరిపోవని అర్థమైంది. అందుకే ఇంకా పొడవైన పేపర్లు కొనాలని మార్కెట్‌కు వెళ్లి అడిగితే.. అలాంటివి దొరకవన్నారు. బిల్లింగ్ రోల్స్​ మాత్రమే ఉంటాయని చెప్పారు. దీంతో 14 బిల్లింగ్ రోల్స్​ కొని ఇంటికి తెచ్చా. మొత్తం లేఖ రాసేందుకు 12 గంటలు పట్టింది. చివరకు ఆ లేఖ 434 మీటర్లు పొడవు, 5 కేజీల బరువు ఉంది’ అంటూ తన భారీ లేఖ విశేషాలు చెప్పింది కృష్ణ ప్రియ.

‘కృష్ణ ప్రసాద్​ జీవితం గురించి మొత్తం వివరాలు ఈ లేఖలో రాశా. పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న నాటి వరకు సంగతులు, మేం కలిసి గడిపిన క్షణాలు, మా ఇరువురి మధ్య ఉన్న ప్రేమ.. ఇలా ప్రతి విషయం ప్రస్తావించా. తమ్ముడు నాకన్నా ఏడేళ్లు చిన్నవాడు. వాడికి నేనంటే గౌరవం. నన్ను ఓ తల్లిలా, టీచర్​లా చూస్తాడు. మేం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. చాలా స్నేహపూర్వకంగా, కవలల్లా ఉండేవాళ్లం. ఏదైనా పండుగ వస్తే ఒకే రంగు దుస్తులు ధరించేవాళ్లం’ అని తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయింది ఆ అక్క.

కృష్ణ ప్రియ శ్రమ వృథా కాలేదు. ఆ లేఖ అందగానే కృష్ణ ప్రసాద్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అనేక రోజులుగా బాధ, కోపంతో ఉన్న తమ్ముడి మోముపై చిరునవ్వులు విరిశాయి. అక్కాతమ్ముళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. ‘ఈ ఏడాది బ్రదర్స్​ డే శుభాకాంక్షలు చెప్పలేదని చాలా బాధపడ్డా. ఆ రోజు నేను ఆమెకు కాల్ చేసినా.. పనిలో బిజీగా ఉన్నానని ఎక్కువ సేపు మాట్లాడలేదు. దీంతో ఆమెను వాట్సాప్​లో బ్లాక్ చేశా. ఏం జరిగిందో అక్క అర్థం చేసుకుని బాధపడినట్టుంది. అందుకే ఈ లేఖ రాసింది. ఈ లెటర్‌ అందుకున్నాక ఎంతో సంతోషించా’ అని కృష్ణ ప్రసాద్ చెప్పాడు.

అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ భారీ లేఖకు ప్రపంచంలోనే అతిపొడవైన లేఖగా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కే అవకాశముంది. ఇందుకోసం ఇప్పటికే గిన్నిస్ బుక్​ వారికి కృష్ణప్రియ దరఖాస్తు చేసింది. అధికారులు అన్నీ పరిశీలించి ధ్రువీకరించే అవకాశం ఉంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని