Maharashtra: అలవోకగా పర్వతాలు ఎక్కుతూ ఔరా అనిపిస్తున్న ఐదేళ్ల చిన్నారి

పర్వతారోహణ అంటేనే చాలా కష్టమైంది. అందులోని ప్రతి ఘట్టం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అలసట, ఆకలి దప్పికలను అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

Published : 12 Nov 2021 01:55 IST

నాసిక్‌: పర్వతారోహణ అంటేనే చాలా కష్టమైనది. అందులోని ప్రతి ఘట్టం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అలసట, ఆకలి దప్పికలను అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మెరుగైన శిక్షణ, నైపుణ్యంతోపాటు గుండె ధైర్యం ఉన్నవారే వీటన్నింటినీ దాటి గమ్యాన్ని చేరుకుంటారు. అలాంటిది.. అలవోకగా పర్వతాలు ఎక్కుతూ ఔరా అనిపిస్తోంది ఐదేళ్ల చిన్నారి అర్నా ఇప్పర్‌. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్‌. తన తల్లిదండ్రలతోపాటు మలంగ్‌గఢ్‌ కోటకు వెళ్లినప్పుడు ట్రెక్కింగ్‌ చేయాలని అర్నా భావించింది. ఆ విషయాన్ని తండ్రి కిశోర్‌ ఇప్పర్‌కు చెప్పగా.. చిన్న వయసులో అంత పెద్ద కోట ఎక్కలేవన్నాడు. కానీ ప్రయత్నించేందుకు చిన్నారి సిద్ధమైంది. అర్నా.. మలంగ్‌గఢ్‌ ఎక్కడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ ఆమె పట్టుదలగా ప్రయత్నించి.. కోట చివరి వరకు ఎక్కింది. మధ్యలో తన తండ్రి అలసిపోయినా.. ఏమాత్రం తడబాటు లేకుండా చిన్నారి ముందుకు సాగింది. ర్యాపిడ్‌ లింక్‌, పోల్‌ క్రాసింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

మహారాష్ట్రలోని మలంగ్‌ఘడ్‌ను ఎక్కిన అతి చిన్న వయస్కురాలిగా అర్నా ఇప్పర్‌ నిలిచింది.  పర్వతారోహకులు సైతం తడబడే అటవీ ప్రాంతాన్ని ఏమాత్రం బెదురు లేకుండా అలవోకగా దాటేసింది. అంత చిన్న వయసులో కష్టమైన సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పర్వతారోహణ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు హరిశ్చంద్రగఢ్‌, రామ్‌శీర్ష్‌ కోటతోపాటు నాసిక్‌ నగరంలోని చంబర్‌ గుహల్ని అధిరోహించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని