చిన్నారులపై కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

ఇప్పటిదాకా పెద్దలకు మాత్రమే పరిమితమైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ చిన్నారులకూ అందుబాటులోకి రానుంది.  2-18 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌ సిద్ధమైంది.

Updated : 04 Jun 2021 14:46 IST

పట్నా ఎయిమ్స్‌లో 525 మంది బాలలపై కొవాగ్జిన్‌ ప్రయోగం


పట్నా: ఇప్పటిదాకా పెద్దలకు మాత్రమే పరిమితమైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ చిన్నారులకు కూడా అందుబాటులోకి రానుంది.  2-18 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌ సిద్ధమైంది. కొవిడ్ వ్యాక్సిన్‌ ట్రయల్‌ ప్రధాన పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న డా.సీఎం సింగ్‌ ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో 525 మంది చిన్నారులకు కొవాగ్జిన్‌ టీకా వేయనున్నట్టు ఆయన తెలిపారు. టీకా వేసే ముందు వారికి యాంటీజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయనున్నన్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. చిన్న పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌కు గత నెల 11న డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు జారీ చేసినట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అంతకుముందు తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ తయారు చేసింది. కొవిడ్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైన వారిపైన ఈ వ్యాక్సిన్‌ 78 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఫైజర్ టీకాను 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతులిచ్చాయి. అయితే భారత్‌లో చిన్నపిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్‌ చేస్తుండటం ఇదే ప్రథమం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని