Covid: నిబంధనలు ఉల్లంఘించి.. 555 మందితో కోచింగ్‌

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో 550కి పైగా విద్యార్థులతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను అతనిపై కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు.

Published : 25 May 2021 21:10 IST

కొవిడ్‌ నిబంధనలు ఉల్లఘించిన యజమాని అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో 550 మందికి పైగా విద్యార్థులతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివరాలను రాజ్‌కోట్‌ ఎస్పీ బలరామ్‌ మీనా తెలిపారు.

‘‘జయసుఖ్‌ సంకల్వ అనే వ్యక్తి కరోనా నిబంధనలు ఉల్లంఘించి కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మేం అక్కడ తనిఖీలు చేశాం. అక్కడ కోచింగ్‌ సెంటర్‌తో పాటు వసతి గృహం కూడా ఉంది. ఆ ప్రాంగణంలో 555 మంది పదేళ్లలోపు వయసున్న పిల్లలను గుర్తించాం. వారిలో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించట్లేదు. దీంతో ఆ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడిపై అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసి చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు పంపాం. ప్రవేశ పరీక్షలైన జవహర్‌ నవోదయ, బాలాచాంది సైనిక్‌ స్కూలు ప్రవేశ పరీక్షల కోసం చిన్నారులు అక్కడ శిక్షణ పొందుతున్నారు’’ అని ఎస్పీ వెల్లడించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో తరగతి విద్యాబోధనపై నిషేధం ఉన్న నేపథ్యంలో నిర్వాహకుడిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు తల్లిదండ్రులే తమ చిన్నారులకు శిక్షణనివ్వమని కోరుతూ వసతిగృహంలో ఉంచినట్లు అరెస్టుకు ముందు జయసుఖ్‌ విలేకరులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని