Offbeat: 600 మెయిల్స్‌, 80 కాల్స్‌.. పట్టువదలని విక్రమార్కుడిలా.. ప్రపంచ బ్యాంకులో కొలువు

విజయానికి షార్ట్‌కట్స్‌ ఏమీ ఉండువు. కష్టపడి ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. అది మరోసారి రుజువైంది అమెరికాలో సివసిస్తున్న దిల్లీ కుర్రాడి విషయంలో..........

Published : 27 Sep 2022 01:41 IST

ఇదీ 23 ఏళ్ల దిల్లీ యువకుడి విజయ గాథ

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయానికి షార్ట్‌కట్స్‌ ఏమీ ఉండవు. కష్టపడి ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. అది మరోసారి రుజువైంది అమెరికాలో నివసిస్తున్న దిల్లీ కుర్రాడి విషయంలో. ;ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తికావస్తున్నా.. ఎలాంటి జాబ్‌ లేని ఆ కుర్రాడు శతవిధాలా ప్రయత్నించాడు. కంపెనీలకు వందల సంఖ్యలో మెయిల్స్‌ పంపించి, కాల్స్‌ చేసి.. చివరకు ఏకంగా ప్రపంచ బ్యాంకులోనే కొలువు కొట్టేశాడు. కాగా తన ప్రయత్నాలు, ఇందుకు తాను ఎంచుకున్న మార్గాలను అతడు లింక్డ్‌ఇన్‌ వేదికగా పంచుకోగా అతడి పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. 15వేల మంది లైక్‌ చేశారు. అనేకమంది షేర్‌ చేశారు.

ప్రతిష్ఠాత్మక యేల్‌ యూనివర్సిటీలో సీటు

దిల్లీలోని శ్రీరాం కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన వత్సల్‌ నహతా ఆపై అమెరికాలోని  ‘యేల్‌’ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. అయితే, 2020లో కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగున్న సమయంలో తన డిగ్రీ పూర్తికావచ్చిందని.. కానీ తాను అప్పటికి ఎలాంటి ఉద్యోగం సాధించలేకపోయానని వత్సల్‌ చెప్పుకొచ్చాడు. ‘కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు ఉవ్విళ్లూరుతున్న రోజులవి’ అంటూ తన పోస్టును ఇలా మొదలుపెట్టాడు ఆ యువకుడు.

నెట్‌వర్కింగ్‌పై దృష్టి

‘మరో 2 నెలల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తికావస్తున్నా నా చేతిలో ఎలాంటి జాబ్‌ లేదు. నేను యేల్‌ విశ్వవిద్యాలయ విద్యార్థిని. కనీసం ఓ ఉద్యోగం సాధించలేని వాడిని ఈ యేల్‌ యూనివర్సిటీకి రావడం ఎందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. ఏం చేస్తున్నావు అని నా తల్లిదండ్రులు ఫోన్‌లో పలకరించినప్పుడు సమాధానం ఇవ్వడం కష్టంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చాడు. ‘భారత్‌కు తిరిగి వెళ్లడం సరైన నిర్ణయం కాదనుకున్నా. నా మొదటి సంపాదన డాలర్లలోనే ఉండాలని నిశ్చయించుకున్నా. జాబ్ అప్లికేషన్ ఫారమ్‌లు, జాబ్ పోర్టల్‌లు కాకుండా నెట్‌వర్కింగ్‌పై దృష్టిపెట్టాను’ అని తెలిపాడు.

ఫలించిన ప్రయత్నాలు.. 4 సంస్థల్లో ఉగ్యోగాలు

రెండు నెలల వ్యవధిలో 1,500 కనెక్షన్ అభ్యర్థనలు, 600 ఈమెయిల్స్, 80 కాల్స్‌ చేయగా.. పెద్ద సంఖ్యలో తిరస్కరణలకు గురైనట్లు వత్సల్‌ పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో 2010 నాటి చిత్రం ‘ది సోషల్ నెట్‌వర్క్‌’లోని ‘ది జెంటిల్ హమ్ ఆఫ్ యాంగ్జైటీ’ పాట యూట్యూబ్‌లో తాను అత్యధికంగా విన్న పాటగా చెప్పుకొచ్చాడు. ‘ఎన్నో సంస్థల తలుపు తట్టగా.. నా ప్రయత్నం ఫలించింది. నాలుగు సంస్థలు నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. వాటిలో నేను ప్రపంచ బ్యాంకును ఎంచుకున్నా. గడువు ముగిసిన తర్వాత నా వీసాను స్పాన్సర్‌ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పించారు. (23 సంవత్సరాల వయస్సు గలవారికి ఇది సాధ్యంకాని విషయం)’ అంటూ ఆ యువకుడు పేర్కొన్నాడు.

తప్పుల నుంచి నేర్చుకొని ప్రయత్నించండి

కష్టసమయంలో తాను కొన్ని పాఠాలు నేర్చుకున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించేందుకు ఆ సమయంలో సహాయపడిందని వత్సల్‌ తెలిపాడు. ప్రజలు ప్రయత్నాన్ని విరమించి వెనకడుగు వేయొద్దనే ఇప్పుడు తన గాథను ఇలాపంచుకుంటున్నానని అతడు వెల్లడించాడు. ‘ఏది ఏమైనా ముందుకుసాగండి. చిన్నదానితో సంతృప్తిపడకండి. తప్పుల నుంచి నేర్చుకొని ప్రయత్నిస్తూ పోతూఉంటే మంచిరోజులు వస్తాయి’ అంటూ నహతా ఆ పోస్ట్‌ను ముగించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని