కన్ను మూసిందని కాటికి తీసుకెళ్తే కళ్లు తెరిచింది..

ఆమె వయసు 76 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు. దీంతో ఆమె బంధువులు అంత్యక్రియలు చేసేందుకు శ్మశానానికి తీసుకొచ్చారు. కాసేపట్లో ఆమె చితికి నిప్పంటిస్తారనగా ఆమె కళ్లు తెరచింది.

Published : 18 May 2021 01:49 IST

ముంబయి: ఆమె వయసు 76 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో ఆమె బంధువులు అంత్యక్రియలు చేసేందుకు శ్మశానానికి తీసుకొచ్చారు. కాసేపట్లో ఆమె చితికి నిప్పంటిస్తారనగా ఆమె కళ్లు తెరచింది. దీంతో అక్కడి వారంతా విస్తుపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగింది. వైద్యాధికారి సోమనాథ్ లాండే తెలిపిన వివరాల ప్రకారం.. బారామతి తాలూకా ముధలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్‌కు కొద్ది రోజుల కిందట కరోనా సోకింది. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వయోభారం, కరోనా లక్షణాలు పెరగడంతో మే 10న ఆమె పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత శకుంతల కుటుంబసభ్యులకు అక్కడ బెడ్‌ దొరకలేదు. ఇంతలో ఆమె అంబులెన్సులోనే స్పృహ కోల్పోయారు. ఆమెను పరీక్షించిన అంబులెన్సు సిబ్బంది మరణించిందని ధ్రువీకరించారు.

దీంతో శకుంతల కుటుంబసభ్యులు ఆమెను తీసుకొని తిరిగి గ్రామానికి వెళ్లిపోయారు. బంధువులకు ఆమె మరణించిందన్న సమాచారం అందించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పూర్తైన తర్వాత శ్మశానానికి తరలించి అక్కడి కార్యక్రమాలు పూర్తి చేశారు. కాసేపట్లో చితికి నిప్పంటిస్తారనగా శకుంతల కళ్లు తెరచి ఏడవడం ప్రారంభించింది. దీంతో ఖంగుతిన్న కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బారామతిలో ఉన్న సిల్వర్‌ జూబ్లీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందిస్తున్నట్లు  డాక్టర్‌ సదానంద్‌ కాలే తెలిపారు.

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దేశం మొత్తం వైరస్‌ బారిన పడి అల్లాడుతోంది. కరోనా ఎక్కువగా ప్రభావం చూపుతున్న రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. లాక్‌డౌన్‌, కఠిన నిబంధనలతో కరోనా కేసులు ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని