Unemployment: నిరుద్యోగ భారతం.. మూడేళ్లలో 9వేల మంది ఆత్మహత్య

నిరుద్యోగం కారణంగా గడిచిన మూడేళ్లలో దేశంలో 9140 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Updated : 10 Feb 2022 04:15 IST

కేంద్ర హోంశాఖ వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిసంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. వ్యాపారాల్లో నష్టం లేదా రుణభారం కారణంగా దేశంలో గడిచిన మూడేళ్ల కాలంలోనే 16వేల మంది ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా నిరుద్యోగం కారణంగా మూడేళ్లలో 9140 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు పేర్కొంది. వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశంపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ ఈ వివరాలు వెల్లడించారు.

రుణభారం కారణంగా దేశవ్యాప్తంగా ఒక్క 2020లోనే 5213 మంది ఆత్మహత్యకు పాల్పడగా, 2019లో 5908 మంది, 2018లో 4970 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక నిరుద్యోగం కారణంగా 2020లో 3548 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. అంతకుముందు 2019లో 2851 మంది, 2018లో 2741 మంది నిరుద్యోగం కారణంగా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది.

1900 ఎన్‌జీవోల లైసెన్సు రద్దు..

గడిచిన ఐదేళ్లలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 1900 ఎన్‌జీవోల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (FCRA) 2010 ప్రకారం ఎన్‌జీవోలను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం లేనప్పటికీ.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ నియమ, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఏదైనా ఎన్‌జీవో కేంద్ర హోంశాఖను సంప్రదిస్తే.. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని