Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!

సన్యాసినిగా ఉండిపోవాలని భావించిన ఓ మహిళ.. ఆపై పెళ్లి చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11మంది సంతానానికి జన్మనిచ్చింది.........

Published : 17 Aug 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్యాసినిగా ఉండిపోవాలని భావించిన ఓ మహిళ.. ఆపై పెళ్లి చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11మంది సంతానానికి జన్మనిచ్చింది. అలా ఆమె కుటుంబం పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆమె తన 99వ ఏట తన 100వ మునిమనవడిని ఎత్తుకొని ముసిముసి నవ్వులతో మురిసిపోయింది.

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్‌ కోల్లెర్‌ తన 100వ మునిమనవడిని కలిసి ఆనందంలో మునిగిపోయింది. కోల్లెర్‌ మనవరాలు ఈమధ్యే తనకు పుట్టిన కుమారుడిని తీసుకెళ్లి ఆమె చేతుల్లో పెట్టగా.. ‘నేనెంతో అదృష్టవంతురాలిని’ అంటూ ఆ వృద్ధురాలు సంబరపడిపోయింది. ఆ బుడతడికి కోల్లెర్‌తోపాటు ముత్తాత పేరు వచ్చేలా ‘కోల్లెర్‌ విలియమ్‌ బాల్‌స్టర్’గా పేరు పెట్టామని చెప్పడంతో ఆమె సంతోషం రెట్టింపయ్యింది.

1922లో జన్మించిన మార్గరెట్‌ కోల్లెర్‌ కొద్దిరోజులపాటు సన్యాసినిగా జీవించారు. కొద్దిరోజుల తర్వాత విలియమ్‌ పరిచయమవడంతో ఆమె జీవితమే మారిపోయింది. అనంతరం వారు వివాహం చేసుకున్నారు. కాలక్రమంలో వారికి ఏకంగా 11 మంది సంతానం కలిగింది. ఆపై వారికి కూడా పెళ్లిళ్లు కావడంతో కోల్లర్‌-విలియమ్స్‌కు 56మంది మనవళ్లు, మనవరాళ్లు అయ్యారు. అయితే విలియం కొన్నేళ్ల క్రితమే మరణించారు. కాగా మనవరాళ్లలో ఒకరైన క్రిస్టిన్‌ బాల్‌స్టర్‌ ఈనెల 4వ తేదీన మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా ఆ బుడతడు కోల్లెర్‌కు వందో మునిమనవడు కావడం విశేషం.

ఈ అరుదైన ఘట్టంపై ఆ వృద్ధురాలు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేసింది. తానెంతో అదృష్టవంతురాలినని పేర్కొంది. చాలా రోజులు ఒంటరి జీవితం అనుభవించానని, అందుకే ఓ పెద్ద కుటుంబం ఉండాలని భావించానంది. కాగా అది ఎప్పుడో నెరవేరిందని సంబరపడిపోయింది. మరికొద్ది రోజుల్లోనే కోల్లెర్‌ వందో వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కాగా ఆమె 100వ పుట్టినరోజును ఘనంగా జరపాలని కుటుంబీకులు ప్లాన్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని