ఓసారి దగ్గితే తుంపర ఎంతదూరం వెళ్తుందంటే..

ప్రపంచమంతా కరోనా చేతుల్లో చిక్కుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టు పక్కల దగ్గు, తుమ్ము శబ్దం వినిపిస్తే దానిపైకి ఆలోచన పోయే పరిస్థితి. కొవిడ్‌-19 గాలి ద్వారా వ్యాపిస్తుందనే నిపుణుల అధ్యయనాల మేరకు దగ్గు ద్వారా వెలువడే తుంపర గాల్లో చేరి ఎంతదూరం చేరుతుంది.? కరోనా వచ్చిన వ్యక్తి ఎంత దూరంలో ఉండి దగ్గితే మనం సురక్షితంగా ఉంటాం.? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని

Published : 05 Nov 2020 20:24 IST

సింగపూర్‌ : ప్రపంచమంతా కరోనా చేతుల్లో చిక్కుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టు పక్కల దగ్గు, తుమ్ము శబ్దం వినిపిస్తే దానిపైకి ఆలోచన పోయే పరిస్థితి. కొవిడ్‌-19 గాలి ద్వారా వ్యాపిస్తుందనే నిపుణుల అధ్యయనాల మేరకు దగ్గు ద్వారా వెలువడే తుంపర గాల్లో చేరి ఎంతదూరం చేరుతుంది.? కరోనా వచ్చిన వ్యక్తి ఎంత దూరంలో ఉండి దగ్గితే మనం సురక్షితంగా ఉంటాం.? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌కు చెందిన శాస్ర్తవేత్తలు దగ్గు ద్వారా గాల్లోకి చేరే లాలాజల బిందువులు ఎంతదూరం వెళతాయనే విషయంపై పరిశోధన చేశారు. ఈ వివరాలు ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

మనం ఒకసారి దగ్గినపుడు నోటి నుంచి వచ్చే తుంపరలోని లాలాజల బిందువు గాలి వేగాన్ని బట్టి దాదాపు సెకనుకు రెండు మీటర్ల నుంచి 6.6 మీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. పొడి వాతావరణంలో ఈ దూరం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం వివరిస్తోంది. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల దగ్గు గాల్లోకి చేరిన తుంపర్లు మానవ శరీరంపైకి చేరే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అధ్యయనకర్త ఫాంగ్‌ యీ లియోంగ్‌ అన్నారు. దగ్గినప్పుడు సాధారణంగా నోటి నుంచి వేల సంఖ్యలో లాలాజల బిందువులు గాల్లోకి చేరతాయి. ఇందులో పెద్దగా ఉండే అణువులు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమిపై పడతాయి. అయితే దగ్గేటప్పుడు చేయి అడ్డుపెట్టుకుంటే ఇవి మీటరు దూరంతోనే ఆగిపోతాయని పరిశోధన చెబుతోంది. 

మధ్యస్థ పరిమాణంలో ఉండే లాలాజల బిందువులు చిన్న చిన్న అణువులుగా మారి ఆవిరైపోతాయి. ఇలా ఆవిరైన స్థిరత్వం లేని బిందువులు అత్యంత సూక్ష్మ అణువులుగా రూపాంతరం చెందుతాయి. గాలి, ఉష్ణోగ్రతలను బట్టి ఇవి ప్రయాణించే దూరంలో మార్పులుంటాయని మరో శాస్ర్తవేత్త హాంగింగ్‌ లీ తెలిపారు. వాయువేగాన్ని సూచించే గణిత సూత్రాలను ఉపయోగించి వివిధ వేగాల్లో గాలి ద్వారా వచ్చి మానవ శరీరం చుట్టూ చేరే దగ్గు తుంపర్ల గురించి పరిశోధకులు కనుగొన్నారు. తమ పరిశోధన ఉష్ణమండల ఆరుబయటి వాతావరణంపై దృష్టి పెట్టినట్లు చెప్పిన పరిశోధకులు.. పరిశోధనలో వెల్లడైన అంశాలు ప్రజలు గుమిగూడిన ప్రాంతాలు, సమావేశ మందిరాల్లో ఎలా ఉండబోతాయో పరిశీలించనున్నట్లు తెలిపారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని