ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్‌

ఇటీవల మృతిచెందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్‌  కోరారు.

Updated : 28 Sep 2020 17:16 IST

ప్రధాని మోదీకి లేఖ

అమరావతి: ఇటీవల మృతిచెందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్‌  కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత సినీ పరిశ్రమకు ఎస్పీ బాలు విశేష సేవలు అందించారని జగన్‌ గుర్తు చేశారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారని పేర్కొన్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 25 నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలూ ఎస్పీ బాలును వరించాయని సీఎం లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు ఎస్పీబీకి అందజేసిందని జగన్‌ గుర్తు చేశారు. సంగీతానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ప్రధానిని జగన్‌ కోరారు.

ఎస్పీ బాలు సేవలకు గుర్తుగా ఆయన సొంత జిల్లా నెల్లూరులో సంగీత వర్సిటీ ఏర్పాటు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈరోజు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ తన తండ్రి చేసిన సేవలకు భారతరత్న ఇస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్పీబీకి భారతరత్న ప్రకటించాలంటూ ఇప్పటికే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు వైరల్‌ అవుతున్నాయి. ఆయన సేవలను గుర్తించాలని అభిమానులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని