తమిళనాడుకు మరో తుపాను ముప్పు

చెన్నై: ‘నివర్‌’ తుపాను వచ్చి వారం రోజులు కాకముందే తమిళనాడుపై మరో తుపాను పొంచి ఉంది. ఈ మేరకు భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది. ఈ తుపాను డిసెంబరు 2న శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటే అవకాశముందని వెల్లడించారు. ఈ సమయంలో తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వారు తెలిపారు.

Updated : 01 Dec 2020 16:44 IST

చెన్నై: ‘నివర్‌’ తుపాను వచ్చి వారం రోజులు కాకముందే తమిళనాడుపై మరో తుపాను పొంచి ఉంది. ఈ మేరకు భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది. ఈ తుపాను డిసెంబరు 2న శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటే అవకాశముందని వెల్లడించారు. ఈ సమయంలో తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ మేరకు ఐఎండీ దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.

తుపాను సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. డిసెంబరు 1 నుంచి మత్స్యకారులెవరూ బంగాళఖాతం ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు సోమవారం తీరానికి తిరిగొచ్చేయాలని తెలిపారు. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. తర్వాత తుపానుగా మారే అవకాశముందన్నారు. అది పశ్చిమ- వాయువ్య దిశలో కదిలి బుధవారం శ్రీలంక తీరాన్ని దాటనుందన్నారు. డిసెంబరు 3న తుపాను కొమొరిన్‌ ప్రాంతంలో బలహీనపడుతుందని తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బంగాళాఖాతం ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల నుంచి గంటకు 55-65 వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. గతవారం నివర్‌ తమిళనాడును హడలెత్తించగా సుమారు 2 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని