కరోనా: మనుషుల తర్వాత ఈ జంతువుల్లోనే..

జంతువులకు కొవిడ్‌-19 సోకుతుందా అనే విషయంపై పలు సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.

Published : 11 Dec 2020 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజువారీ కేసుల సంఖ్య కాస్త అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య లక్షా 42వేలకు చేరింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 6 కోట్ల 81 లక్షలకు పైబడి కరోనా బారిన పడగా.. 15 లక్షల 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మనుషుల సంగతి అలా ఉంచితే.. జంతువులకు కరోనా సోకే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా పరిశోధన ఫలితాలు మహమ్మారి సోకే అవకాశం ఎక్కువగా ఉన్న జంతువుల వివరాలను వెల్లడించాయి.

కరోనా సోకే జంతువులివే..

స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన సెంటర్‌ ఫర్‌ జినోమిక్‌ రెగ్యులేషన్‌ పరిశోధకులు మనుషులతో సహా పది రకాల జంతువులపై కొవిడ్‌ సంబంధిత పరిశోధనలు నిర్వహించారు. ఫెర్రెట్‌ అనే పిల్లి మాదిరి జీవులు, రాత్రి పూట సంచరించే సివెట్‌ అనే చిన్న జంతువులు, పిల్లులు, కుక్కలకు కూడా కరోనా అధికంగా సోకుతోందని వారు తేల్చారు. కాగా బాతులు, ఎలుకలు, చుంచెలుకలు, పందులు, కోళ్లకు కొవిడ్‌ సోకినట్లు ఆధారాలు దొరకలేదని వారు అంటున్నారు. ఫెర్రెట్‌ల జాతికే చెందిన మింక్‌లు ఇరుకైన ప్రదేశాల్లో, మనుషులకు సమీపంగా నివసించటం వల్ల కొవిడ్‌ బారిన పడుతున్నట్టు వెల్లడైందని వారు అంటున్నారు.

ఎలా తెలిసిందంటే..

వివిధ జీవుల శరీర కణాల్లో ప్రవేశించేందుకు కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లను ఉపయోగిస్తుందనే సంగతి తెలిసిందే. ఐతే ఇది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు బార్సిలోనా పరిశోధకులు కంప్యూటర్‌ మోడలింగ్‌ విధానాన్ని అనుసరించారు.  జంతువుల్లో ఉండే  ఏసీఈ2 అనే కారకం ఇందుకు సహకరిస్తోందని వారు తెలుసుకున్నారు. ఈ కారకం మనుషుల తర్వాత ఫెర్రెట్లు, పిల్లులు, కుక్కలు, సివెట్లలో అధికంగా ఉన్నట్లు వెల్లడి కావటం గమనార్హం.

ఇదిలా ఉండగా కొవిడ్‌-19 ఏఏ జీవుల్లో అధికంగా సోకే అవకాశముందో తెలియటం వల్ల.. తర్వాతి కాలంలో అది మళ్లీ తలెత్తే ప్రమాదాన్ని నిరోధించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన లూయిస్‌ సెర్రానో తెలిపారు.

ఇవీ చదవండి..

ఆవుతో హగ్‌.. ఒత్తిడికి కొత్త మందు

చలికాలంలో మూగజీవాలు ఏం చేస్తాయంటే..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని