వింత ఏకశిల.. ఈసారి పోలాండ్‌లో..

నిర్జర ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతూ కొద్దిరోజులకు మాయమవుతూ పరిశోధకులకు పరీక్ష పెడుతున్న అంతుచిక్కని ఏకశిల ఈసారి పోలాండ్‌లో దర్శనమిచ్చింది....

Published : 11 Dec 2020 23:42 IST

వార్సా: నిర్జన ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతూ కొద్దిరోజులకు మాయమవుతూ పరిశోధకులకు పరీక్ష పెడుతున్న అంతుచిక్కని ఏకశిల ఈసారి పోలాండ్‌లో దర్శనమిచ్చింది. అయితే గతంలో జనసంచారంలేని ప్రాంతంలోనే ప్రత్యక్షమయ్యే ఈ వింత స్తంభం ఈసారి మాత్రం ఓ పట్టణానికి అతి సమీపంలో వెలిసింది. పోలాండ్‌ రాజధాని వార్సాలోని విస్తులార్‌ నది ఒడ్డున వెండి రంగులో ఉన్న ఏకశిల కనిపించింది. ఉదయపు నడకకు వెళ్లిన కొందరు దాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని వార్సాలోని విస్తులా జిల్లా అధికారులు ఫేస్‌బుక్‌ ద్వారా ధ్రువీకరించారు. ఆ స్తంభం త్రిభుజాకారంలో దాదాపు 3 మీటర్ల పొడవు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ శిలను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.

గత కొద్ది రోజులుగా పలు దేశాల్లో ఈ తరహా వింత స్తంభాలు దర్శనమిస్తూ మాయమవుతున్నారు. గత నవంబర్‌ 18న అమెరికాలోని యుటాలో మొట్టమొదటిసారి ఈ తరహా వింత శిలను అధికారులు గుర్తించారు. రెడ్‌ రాక్‌ ఎడారిలో వెలసిన ఏకశిలను వన్యప్రాణి సిబ్బంది గుర్తించారు. అయితే కొద్దిరోజులకే అక్కడినుంచి అది మాయమైంది. ఆ స్తంభం అదృశ్యమై 24 గంటలు గడవకముందే రొమానియాలో అదే తరహా స్తంభం ప్రత్యక్షమవడం గమనార్హం. కొద్ది రోజులకు అది కూడా అక్కడినుంచి అదృశ్యమైంది. అనంతరం బ్రిటన్‌లో, తర్వాత నెదర్లాండ్స్‌లో కనిపించాయి. అయితే రాత్రికి రాత్రే వాటిని ఎవరో పాతిపెడుతున్నారని, కొద్దిరోజులకు మళ్లీ తీసుకెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ పని ఎవరు, ఎందుకు చేస్తున్నారో అధికారులు, పరిశోధకులకు అంతుచిక్కడం లేదు.

ఇదీ చదవండి...

కలవరపెడుతున్న ఏకశిలల రహస్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని