ఆస్తమా రోగులకు వైరస్‌ ముప్పు తక్కువేనా..?

ఆస్తమా రోగులు కరోనా వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 02 Dec 2020 19:19 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి వయసుతో సంబంధం లేకుండా అందరిపై ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిపై ఇది మరింత ప్రభావం చూపిస్తోంది. ఈ సమయంలో ఆస్తమా రోగులు కరోనా వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా అధ్యయనం పేర్కొంది. తాజాగా ది జర్నల్‌ ఆఫ్‌ అలెర్జీ, క్లినికల్‌ ఇమ్యూనాలజీలో తాజా పరిశోధన పత్రం ప్రచురితమైంది. శ్వాసకోశ సంబంధ సమస్యలున్న వారిపై కరోనా ప్రభావాన్ని తెలుసుకునే లక్ష్యంగా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం ఇజ్రాయిల్‌లోని ఆరోగ్యసంస్థకు చెందిన సమాచారాన్ని వినియోగించారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో వాలంటీర్లను ఈ పరిశోధనకు నమోదుచేసుకున్నారు. ఇలా మొత్తం 37,469 మందికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా వీరిలో కేవలం 2266 మందిలో వైరస్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో కేవలం 153 మంది మాత్రమే ఆస్తమా రోగులు ఉన్నారని పరిశోధకులు వెల్లడించారు. ఇది పాజిటివ్‌ కేసుల్లో 6.05శాతం మాత్రమే అని పేర్కొన్నారు. వీటి ద్వారా ఆస్తమా రోగులు కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే అంచనాకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆస్తమా రోగులు వాడే ఇన్‌హెలర్లు కూడా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడం లేదా వైరస్‌ బారిన పడకుండా కాపాడుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే, అక్టోబర్‌ నెలలోనూ అమెరికాలో జరిగిన మరో పరిశోధన ఇలాంటి ఫలితాన్నే ప్రకటించింది. ఆస్తమా లేని కరోనా రోగులతో పోలిస్తే, ఆస్తమా ఉన్న వారిలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. వీరికి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించే అవసరం కూడా రాలేదని పేర్కొంది. అంతేకాకుండా కరోనా వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఆస్తమా రోగుల్లో తక్కువేనని స్పష్టంచేసింది. బోస్టన్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌కు చెందిన పరిశోధకులు ఆస్తమా రోగులపై జరిపిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. పరిశోధనల్లో భాగంగా, ఆస్తమా లేని 2686 మందిని, ఆస్తమా వ్యాధి ఉన్న 562 రోగుల ఆరోగ్య సమాచారాన్ని పోల్చి చూశారు. తద్వారా ఆస్తమా ఉన్న రోగులు కరోనా బారిన పడే అవకాశాలు 70శాతం తక్కువేనని అంచనాకు వచ్చారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ఆస్తమా రోగులకు వెంటిలేటర్‌ అవసరం కూడా తక్కువేనని తేల్చారు. తీవ్ర ఆస్తమా ఉన్న 44 మంది రోగుల్లోనూ ఎవ్వరికీ ప్రమాదం లేదని గుర్తించిన పరిశోధకులు, ఆస్తమా రోగులకు కరోనా ప్రమాదం తక్కువేనన్న విషయాన్ని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని