మంచి మనసుకు.. 3రోజుల్లో 20లక్షల సాయం

ఆ ఆటో డ్రైవర్‌ సాయంలో ముందుంటాడు. రక్తదానం చేయాలంటే ఎప్పుడైనా సిద్ధం అంటాడు. గర్భిణులు తన ఆటో ఎక్కితే డబ్బే తీసుకోడు. అలాంటి వ్యక్తికి జీవితంలో అతిపెద్ద సమస్య ఎదురైంది.

Published : 03 Oct 2020 20:00 IST

కర్నూలు: ఆ ఆటో డ్రైవర్‌ సాయంలో ముందుంటాడు. రక్తదానం చేయాలంటే ఎప్పుడైనా సిద్ధం అంటాడు. గర్భిణులు తన ఆటో ఎక్కితే డబ్బే తీసుకోడు. అలాంటి వ్యక్తికి జీవితంలో అతిపెద్ద సమస్య ఎదురైంది. మంచోళ్లకు మంచే జరుగుతుందన్న మాట నిజం చేస్తూ అతని సేవా గుణమే అతనికి కొండంత అండగా నిలుస్తోంది.

మంచికి రోజులున్నాయని పెద్దలు ఊరికే అనరు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన మధుసూదన్‌ విషయంలో అదే నిజమైంది. కొత్తపేటకు చెందిన మధుసూదన్‌ వృత్తి ఆటో నడపడం. ప్రవృత్తి ఇతరులకు సాయం చేయడం. ఇప్పటికే ఎన్నోసార్లు రక్తదానం చేశాడు. తన ఆటోలో గర్భిణులను ఉచితంగా ఆసుపత్రులకు తీసుకువెళ్తుంటాడు. అలాంటి మధుసూదన్‌ కుమార్తె రచనశ్రీ ప్రమాదవశాత్తు వేడినీళ్లలో పడింది. చిన్నారి శరీరం సుమారు 80శాతం కాలింది. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న మధుసూదన్‌కు చికిత్స భారమైంది. ఆ సమయంలో స్నేహితులు కలగజేసుకొని ఆపన్నహస్తం అందించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. మధుసూదన్‌ వ్యక్తిత్వం తెలుసుకున్న దాతలు దాతృత్వం చాటుకున్నారు. మనసున్న మారాజులు 3రోజుల్లోనే బ్యాంకు ఖాతాకు రూ.20లక్షలు పంపారు. మరికొందరు ఆసుపత్రికి వచ్చి నగదు సాయం చేశారు. సాయం చేసిన వారందరికీ మధుసూదన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రచనశ్రీ త్వరగా కోలుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని