ఉలి చేతబట్టి...అవార్డులు కొల్లగొట్టి...

ఆ యువతి చేయి వేస్తే ఎలాంటి శిలైనా...అందమైన శిల్పం కావాల్సిందే. ఎంతటి కరుకు రాయి అయినా...ఆమె ఉలి దెబ్బకు కళాత్మకంగా మారిపోవాల్సిందే. దశాబ్దాలుగా పురుషుల ఆధిక్యం కొనసాగుతున్న శిల్పకళా రంగంలో తనదైన ముద్ర వేస్తూ..

Published : 21 Nov 2020 01:48 IST


 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆ యువతి చేయి వేస్తే ఎలాంటి శిలైనా...అందమైన శిల్పం కావాల్సిందే. ఎంతటి కరుకు రాయి అయినా...ఆమె ఉలి దెబ్బకు కళాత్మకంగా మారిపోవాల్సిందే. దశాబ్దాలుగా పురుషుల ఆధిక్యం కొనసాగుతున్న శిల్పకళా రంగంలో తనదైన ముద్ర వేస్తూ.. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోందామె. అంతేకాదు సామాజిక మాధ్యమాలను వారధిగా మలచుకుని... ఆకట్టుకునే శిల్పాలను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తోంది. అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఆమే మహిళా శిల్పి భువనేశ్వరి.

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ శిల్ప కళాకారులకు, అందమైన శిల్పాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ శిల్పాలు అవసరమైనా ఈ ఊరి వైపే చూస్తుంటారు. అలాంటి ఆళ్లగడ్డలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది భువనేశ్వరి. శిల్పాలను అందంగా చెక్కుతూ ఆకట్టుకుంటోదామె. వారి కుటుంబంలో అందరూ శిల్ప కళాకారులే. శ్రీశైలంలోని భ్రమరాంబికా ఆలయం, మహానందిలోని అద్దాల మండపం, అహోబిలంలోని కోనేరు వంటి ప్రసిద్ధ నిర్మాణాల వెనుక ఆమె కుటుంబీకులు ఉన్నారు.

ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలకున్నా...
తాత నుంచి తండ్రి, అక్కడి నుంచి భువనేశ్వరీ.. ఇలా వారసత్వంగా ఈ కళను ఆమె నేర్చుకుంది. శిల్పకళలో తండ్రి దగ్గర ఓనమాలు దిద్దుతూనే చదువును కొనసాగించింది. బీఈడీ పూర్తి చేసింది. కళాశాల రోజుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనుకున్న ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేక పోయింది. దాంతో తనకు ఎంతో ఇష్టమైన శిల్పకళలోనే రాణించాలని నిర్ణయం తీసుకుంది. అలా ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె ఇందులో కొత్త పంథాను తీసుకువచ్చింది. శిల్పకళకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంది. అంతకు ముందున్న పరిస్థితిని మార్చివేసింది. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఓఎల్‌ఎక్స్‌, యూట్యూబ్‌ వంటి వాటి ద్వారా శిల్పాలను మార్కెటింగ్‌ చేయటం ప్రారంభించింది. 


 

ఆమె తయారు చేసిన ఎన్నో శిల్పాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో దర్శనమిస్తున్నాయి. ద్రాక్షారామంలో శివుడి ధ్యానముద్ర విగ్రహం, లేపాక్షి నంది విగ్రహాలను ఆమెనే రూపొందించింది. గోదావరి పుష్కరాల సమయంలో పదమూడు అడుగుల విగ్రహాన్ని కేవలం ఇరవై అయిదు రోజుల్లో రూపొందించి ఔరా అనిపించింది. కృష్ణవేణి విగ్రహం, శ్రీశైల శిఖరం మీద ఉండే నంది విగ్రహం ఇలా ఎన్నింటికో రూపాన్నిచ్చింది. భువనేశ్వరి తయారు చేసిన విగ్రహాలు, గృహాలంకరణ వస్తువుల ఫొటోలు చూసిన ఓ విదేశీ మహిళ ఆమెతో ఆరడుగుల బుద్ధుడి విగ్రహాన్ని తయారు చేయించింది. సాధారణ వ్యక్తులే కాకుండా ప్రభుత్వాలు కూడా ఆమెకు ఆర్డర్లు ఇచ్చేవి.

కేవలం దేవతా మూర్తుల విగ్రహాల తయారీకే ఆమె పరిమితం కాలేదు. ఈ కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకొంటూ శిల్పాలను రూపొందిస్తోంది. ఇంటీరియర్‌ డెకరేషన్స్‌కు అవసరమయ్యే బొమ్మలు తదితరాలను అందంగా తీర్చిదిద్దుతోంది. శిల్పకళలో గొప్పగా రాణిస్తోన్న భువనేశ్వరిని ఎన్నో అవార్డులు వరించాయి. 2015లో ఉత్తమ ప్రతిభా అవార్డు, 2018లో లేడీ లెజెండ్‌ పురస్కారం, అదే ఏడాది విశ్వకర్మ లెజెండరీ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని