రాజ్యాంగ ప్రతిలో రామాయణ ఘట్టం

అయోధ్యలో ఈరోజు జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Published : 05 Aug 2020 11:34 IST

దిల్లీ: అయోధ్యలో ఈరోజు జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాముడికి సంబంధించిన ఓ చిత్రాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చే సందర్భాన్ని తెలియజేసే చిత్రం అది. 

‘‘రావణుడిని ఓడించిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు‌ అయోధ్యకు తిరిగివచ్చే అందమైన చిత్రం భారత రాజ్యాంగంలోని అసలు ప్రతిలో ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధ్యాయం ప్రారంభంలో ఇది అందుబాటులో ఉంది. దీన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది. జై శ్రీరామ్‌’’ అని ట్వీట్‌ చేశారు.

రామమందిరం భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 45 ఏళ్లలోపు ఉండి కరోనా నెగిటివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. అయోధ్యను ఆనుకుని ఉన్న 9 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కొవిడ్‌ వైరస్‌ ముప్పు నేపథ్యంలో 175 మంది ప్రముఖులను మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది. అయితే యావత్‌ భారతావని వీక్షించేందుకు వీలుగా దూరదర్శన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని