పెన్సిల్ మొనతో ‘చిత్రా’లు చేస్తున్నాడు!

కళాకారులు ఉత్తమంగా రాణించేందుకు సృజనాత్మకత ఉండాలి. ఆ సృజనకు ఇంకాస్త కళాత్మకత జోడిస్తే ప్రతీ చిత్రం అందంగానూ.. అపురూపంగానూ మారుతుంది. సాధారణంగా కళాత్మక వస్తువులు చెక్కాలంటే చెక్కో, రాయో కావాలి. కానీ ఆ యువకుడికి మాత్రం పెన్సిల్‌,

Published : 28 Dec 2020 23:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కళాకారులు ఉత్తమంగా రాణించేందుకు సృజనాత్మకత ఉండాలి. ఆ సృజనకు ఇంకాస్త కళాత్మకత జోడిస్తే ప్రతీ చిత్రం అందంగానూ.. అపురూపంగానూ మారుతుంది. సాధారణంగా కళాత్మక వస్తువులు రూపొందించాలంటే చెక్క లేదా రాయి కావాలి. కానీ ఆ యువకుడికి మాత్రం పెన్సిల్‌, సుద్దముక్కలు ఉంటే చాలు. నిమిషాల్లో వాటిని అందమైన కళారూపాలుగా మార్చేస్తాడు. విభిన్న కళాకృతుల్ని విన్నూతంగా రూపొందిస్తున్న ఆ యువకుడి గురించి తెలుసుకుందామా! 

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ సూక్ష్మచిత్ర కళాకారుడిగా రాణిస్తున్నాడు. తన చేతిలో పెన్సిల్‌ పడినా, సుద్దముక్క చిక్కినా వాటికి అందమైన కళాకృతులుగా ప్రాణం పోస్తున్నాడు. పెద్దగా శ్రమ పడకుండానే అందమైన బొమ్మలు నిమిషాల్లో తీర్చిదిద్దటం ఈ యువకుడి ప్రతిభకు నిదర్శనం. వేగంగా బొమ్మలు గీయటం, కళాకృతులు చెక్కటంలో నైపుణ్యం సాధించి.. అదే బాటలో సాగుతూ సన్నని పెన్సిల్‌ మొనపై అరుదైన సూక్ష్మ చిత్రాలకు రూపం ఇస్తున్నాడు శ్రీనాథ్‌.

ఇతరులకు భిన్నంగా ఉండాలని...
పాఠశాల దశలోనే ఈ కళపై మక్కువ పెంచుకున్నాడు అశోక్‌. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వార్తల్లో చూసిన అశోక్‌ తాను కూడా అలాంటి చిన్న వస్తువులను రూపొందించాలని అనుకున్నాడు. అప్పటికే చిత్రలేఖనంపై పట్టు ఉండటంతో పెన్సిల్‌, సుద్దముక్కలపై బొమ్మలు చేయటం సాధన చేశాడు. అతి తక్కువ సమయంలోనే పెన్సిల్ మొనలపై కళారూపాలు చేయటం మొదలు పెట్టాడు. ఇతర చిత్రకారులకు భిన్నంగా గుర్తింపు తెచ్చుకోవాలని సరికొత్తగా ప్రయత్నాలు చేశాడు. అప్పటి వరకు దేవుడి బొమ్మలు, స్వాతంత్ర్య సమర యోధులు, వివిధ భాషల అక్షర క్రమాలకు రూపం ఇచ్చిన ఈ యువ కళాకారుడు పెన్సిల్‌ మొనలపై కదలాడే బొమ్మలకు ప్రాణం పోశాడు. తిరిగే ఫ్యాన్‌, చేతిపంపు ఇంకా ఎన్నో తయారు చేశాడు.

5.3 మిల్లీమీటర్ల వినాయకుడు...
సూక్ష్మచిత్ర కళాకారుడిగా రాణించాలంటే ఏకాగ్రత, ఓపిక ఎంత అవసరమో సమయమూ అంతే కీలకం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అశోక్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజుల్లోనూ ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సూక్ష్మచిత్రాలపై దృష్టి సారించేవాడు. అలా ఇప్పటి వరకు అయిదు వందలకు పైగా కళారూపాలను రూపొందించాడు. 5.3 మిల్లీమీటర్ల వినాయకుడిని రూపొందించి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అంతేకాదు అనేక పురస్కారాలు గెలుచుకున్నాడు. సమాజానికి ఉపయోగపడేదే అసలైన కళ అని గుర్తించిన అశోక్‌ కొవిడ్‌ సమయంలో పెన్సిల్‌ పై అతి చిన్న మాస్కులు రూపొందించాడు. సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్టు చేసి అవగాహన కల్పించాడు. ప్రస్తుతం గిన్నీస్‌ బుక్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎంతో ఇష్టంతో నేర్చుకున్న ఈ కళను భావితరాలకు అందించటం కోసం శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నాడు.  ‌.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని