బీరు తాగడం తగ్గించేశారు!

రాష్ట్రంలో బీరు విక్రయాలు పడిపోయాయి. లిక్కర్‌ మాత్రం అదేస్థాయిలో తాగుతున్నారు. బీరు అమ్మకాలు తగ్గినా ఆదాయం అధికంగా సమకూరుతోంది.

Published : 07 Aug 2020 17:05 IST

సుమారు సగానికి పడిపోయిన విక్రయాలు

 
 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బీరు విక్రయాలు పడిపోయాయి. లిక్కర్‌ను‌ మాత్రం అదేస్థాయిలో తాగుతున్నారు. బీరు అమ్మకాలు తగ్గినా ఆదాయం అధికంగా సమకూరుతోంది. గత ఏడాది జులై కంటే ఈసారి రూ.600కోట్లు అదనంగా ఖజనాకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో మద్యానికి డిమాండ్‌ చాలా పెరిగింది. మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని మద్యం దుకాణాలకు అదనపు ఆదాయం వస్తోంది.

కరోనాతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కుంటుపడి ఆదాయ వనరులు బాగా తగ్గాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. వ్యాపార సంస్థలు రాబడులు లేక ఇబ్బంది పడుతున్నాయి. ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిందన్న భావన నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్రంలో మద్యం ప్రియులు తాగుడుకు భారీగా ఖర్చు చేశారు. ఒక్క జులైలోనే ఏకంగా రూ.2,507కోట్ల విక్రయాలు  జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో మద్యం అమ్మకాలతో పోలిస్తే రూ.600కోట్ల విలువైన అమ్మకాలు అదనంగా జరిగాయి.

హైదరాబాద్‌లో తగ్గిన బీర్ల విక్రయాలు..

హైదరాబాద్‌లో బీర్ల విక్రయాలు తగ్గడానికి కారణాలను ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు. జన్మదిన, వివాహ ఇతరత్రా వేడుకలు, విందులకు మాంసాహారంతో పాటు మద్యాన్ని చేర్చడం పరిపాటి. కొవిడ్‌ నిబంధనల అమలుతో విందులు, వినోదాలు పూర్తిగా తగ్గాయి. నలుగురు ఒకేచోట కూర్చొని తాగే అవకాశం లేకుండా పోయింది. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆయా కారణాల వల్ల బీరు అమ్మకాలు భారీగా తగ్గాయని ఆబ్కారీ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్‌, 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగ్గా, బీరు అమ్మకాలు 22.99 లక్షల కేసులు జరిగాయి. లిక్కర్‌ అమ్మకాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నా.. బీరు అమ్మకాలు  సగానికి తగ్గిపోయాయి. అయినా మద్యం అమ్మకాల విలువ మాత్రం గత ఏడాది జులైలోని అమ్మకాలతో పోలిస్తే రూ.600కోట్లు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు భారీగా పెరగ్గా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఏపీలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో చిక్కుకున్నా మద్యం అక్రమ రవాణా ఆగట్లేదు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో మద్యం విక్రయాలు పెరగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ జూన్‌లో రూ.190కోట్లు, జులైలో రూ.203కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఖమ్మంలో జూన్‌లో రూ.198కోట్లు, జులైలో రూ.210కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. నల్గొండ జిల్లాలో జూన్‌లో రూ.274కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, జులైలో రూ.295కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. ఏపీ సరిహద్దు జిల్లాల్లో రూ.10కోట్ల నుంచి రూ.15కోట్ల మద్యం విక్రయాలు అదనంగా జరిగాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని